మ్యాన్ హోల్డ్స్ చోరీ చేయడంతో ఖాళీగా ఉన్న సిలిండర్లు
ఖమ్మంవైద్యవిభాగం: ఖమ్మం జిల్లా జనరల్ ఆస్పత్రిలో రక్షణ కరువైంది. ఆస్పత్రికి సంబంధించిన విలువైన వస్తువులు తరచూ మాయమవుతున్నాయి. అంతే కాకుండా రోగులు, వారికి సహాయంగా వచ్చే వారి సెల్ ఫోన్ల చోరీ పరిపాటిగా మారింది. ఇంత జరుగుతున్నా అధికారులు, సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వాహకులు పట్టించుకోకపోవడంతో ఆస్పత్రికి వచ్చే వారు మండిపడుతున్నారు.
పెరిగిన తాకిడి
జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఇటీవల మెడికల్ కళాశాలగా మార్పు చెందింది. దీంతో నిత్యం వెయ్యి నుండి 1,500 మంది వరకు వైద్యసేవలకు వస్తుంటారు. అలాగే రోగుల సహాయకులతో నిత్యం ఆస్పత్రి కిటకిటలాడుతెఓంది. ఇదే అదనుగా కొందరు చోరీలకు పాల్పడుతున్నారు. రోగుల బెడ్ల వద్ద ఉండే ఫోన్లు, చార్జింగ్ పెట్టిన ఫోన్లు చోరీ చేస్తుండగా.. ఇటీవల ఆర్‌ఎంఓకు వరుస ఫిర్యాదులు అందుతున్నా ఎలాంటి చర్యలు లేదు. మరోపక్క ఆస్పత్రిలోని వస్తువులు కూడా తస్కరణకు గురవుతున్నాయి.
తాజాగా ఆక్సిజన్ సిలిండర్లకు వినియోగించే మ్యాన్ హోల్డ్‌లు చోరీకి గురయ్యాయి. ఆక్సిజన్ సిలిండర్ల నుండి పైప్‌లైన్‌కు లింక్ కలిపేందుకు మ్యాన్ హోల్డ్స్ వినియోగిస్తారు. వీటిని చాలా వరకు దొంగలు ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి పూట ముసుగు వేసుకొచ్చి వీటిని చోరీ చేస్తున్నట్లు సీసీ కెమెరాల్లో రికార్డు అయినా పట్టించుకోవడం లేదు.
సెక్యూరిటీ ఉన్నట్టా.. లేనట్లా?
పెద్దాస్పత్రిలో సెక్యూరిటీ, పేషంట్ కేర్, స్వీపర్ల నిర్వహణ బాధ్యతను ప్రభుత్వ ఓ ఏజెన్సీకి కట్టబెట్టింది. ఆస్పత్రిలో 575 బెడ్లు ప్రాతిపదికగా బెడ్‌కు రూ.7,500 సదరు కాంట్రాక్టర్‌కు చెల్లిస్తోంది. ఈమేరకు 259 మంది సెక్యూరిటీ, పేషంట్ కేర్, స్వీపర్లను నియమించారు. ఇంత వరకు బాగానే ఉన్నా వారిని ఆస్పత్రి రక్షణకు వినియోగించట్లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఆస్పత్రిలో అవసరం మేరకు సిబ్బంది లేకపోవడంతో వీరిని ఇతర పనులకు కేటాయిస్తున్నారని.. మరికొందరిని అధికారులు, ఉద్యోగులు వారి ఇళ్లలో పని చేయించుకుంటున్నారని సమాచారం. ఫలితంగా సెక్యూరిటీ గార్డుల కొరతతో చోరీలు సర్వసాధారణమయ్యాయి. ఇంత జరుగుతున్నా విషయం బయటకు పొక్కకుండా, పోలీసులకు ఫిర్యాదు చేయకుండా అధికారులు మిన్నకుంటున్నట్లు సమాచారం.
గట్టి నిఘా ఏర్పాటు చేస్తాం
ఆస్పత్రిలో చోరీలు జరగకుండా గట్టి నిఘా ఏర్పాటుచేస్తాం. సెల్‌ఫోన్లు చోరీకి గురైన విషయమై ఫిర్యాదులు అందాయి. అలాగే సిలిండర్లకు బిగించే మ్యాన్ హోల్ద్‌స్ కూడా దొంగిలించారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసి పకడ్బందీ రక్షణ చర్యలు తీసుకుంటాం.
– బి.శ్రీనివాసరావు, ఆర్‌ఎంఓ
Comments
Please login to add a commentAdd a comment