ఇదో వైద్య విధ్వంసం!
సర్కారీ ఆసుపత్రుల్లో చికిత్సకు దిక్కులేదు.. ప్రైవేటుకెళితే జేబులు గుల్ల
♦ గతేడాది వైద్యానికి భారతీయులు చేసిన ఖర్చు రూ. 6,00,000 కోట్లు
♦ వచ్చే ఏడాది ఖర్చు... 'మెకిన్సే' అంచనా రూ. 10,00,000కోట్లు
♦ ఏటా 30-40 శాతం పెరిగిపోతున్న వైద్య ఖర్చులు
♦ నాలుగేళ్లలో దేశ బడ్జెట్‌నూ దాటొచ్చని అంచనాలు
♦ ఖర్చులతో 30% మంది పేదరికంలోకి..
♦ ఈ దుస్థితిపై 'సాక్షి' సమర శంఖం
సాక్షి ప్రత్యేక బృందం:
పాతికేళ్లకే గుండె బరువెక్కుతోంది..
పొత్తిళ్ల నుంచే మధుమేహం ఆక్రమిస్తోంది..
ముప్పై దాటకున్నా రక్తపోటు భయపెడుతోంది..
అరుదైన వ్యాధులు రొటీన్ రంగు పులుముకుంటున్నాయి. కొత్తకొత్త పేర్లతో జబ్బులు పుట్టుకొస్తున్నాయి. సీజనల్ వ్యాధులకైతే అడ్డూఅదుపూ లేదు. ఇవన్నీ కలిస్తే.. భారతీయులు వైద్యానికి పెడుతున్న ఖర్చు ఆకాశాన్నంటుతోంది. ఈ ఖర్చు గతేడాది రూ.6 లక్షల కోట్లు! వచ్చే ఏడాది రూ.10 లక్షల కోట్ల పైమాటే!! మరో నాలుగేళ్లు ఆగితే.. ఏకంగా దేశ బడ్జెట్‌తో పోటీపడుతుందని చెబుతోంది మెకిన్సే సంస్థ. ఎందుకంటే.. ఇప్పుడు రూ.17 లక్షల కోట్లుగా ఉన్న బడ్జెట్ ఏటా పెరుగుతున్నది లక్ష కోట్ల లోపే. కానీ భారతీయుల వైద్య ఖర్చులు ఏటా 30-40 శాతం వృద్ధితో భారీ అంగలేసుకుంటూ ఆర్థిక వ్యవస్థనే సవాల్ చేసే స్థాయికి చేరిపోతున్నాయి. జీతభత్యాలు, మౌలిక సదుపాయాలతో సహా ప్రజల క్షేమం కోసం ప్రభుత్వం ఏడాదిలో చేస్తున్న ఖర్చును.. ప్రజలు తమ ఆరోగ్యం కోసం సొంతంగా వెచ్చిస్తున్నారంటేనే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.దురదృష్టమేంటంటే ఇలా వైద్యానికి ఖర్చు చేస్తున్న వారిలో ఆరోగ్య బీమా భద్రత ఉన్నది కేవలం 5 శాతం మందికే. మిగిలిన వారంతా అప్పులు చేసి, తాకట్టులు పెట్టి తమను, తమ వాళ్లను కాపాడుకోవటానికి ప్రయత్నిస్తున్నవారే. అలాంటి వారి జీవితాలను వైద్యం ఎంతలా విధ్వంసం చేస్తోందో తెలుసా...?
ప్రభుత్వాసుపత్రికి వెళితే!: నిరుపేదకు సుస్తీ చేసి సర్కారీ ఆసుపత్రికెళితే డాక్టరుండటం కష్టం. ఒకవేళ ఉంటే ఆయన రాసిన చీటీలోని పరీక్షలు చేయడానికి అక్కడి సౌకర్యాలుండవు. పోనీ బయటికెళ్లి చేయించుకుందామంటే తన ఆర్థిక పరిస్థితి ససేమిరా అంటుంది. చేసేదేమీ లేక ఇంటికెళ్లి ముసుగు తన్నటం.. అయినా బాగులేకుంటే మరోసారి అదే దవాఖానాకు పోవటం. ఎందుకంటే తను చేయగలిగింది అదే!! ఇక సదరు ఆసుపత్రిలో అర్థం చేసుకునే డాక్టరు గనక ఉంటే నాలుగు గోళీలు రాస్తాడు. అవి వేసుకున్నాక దైవాధీనం. రోజులు బాగుంటే బతికిపోతాడు. లేకుంటే బతుకు పోతుంది. ఈ పరిస్థితి ఎందుకు దాపురిస్తోందంటే... నిబద్ధత నీడను కూడా సహించని ప్రభుత్వ వైద్యం వల్ల. ఎన్నాళ్లయినా ఈ పరిస్థితి మారదెందుకు? నిరుపేదకు సుస్తీ చేస్తే చావాల్సిందేనా...?
మధ్య తరగతి సంగతో..?
నిరుపేదలూ, నిరుద్యోగులే కాదు. కాస్తోకూస్తో స్థితిమంతులు, ముందు చూపుతో వైద్య బీమా చేయించుకున్నవారి పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా లేదు. కారణం.. నిజాయితీ కరువైన ప్రైవేటు వైద్యం!! కిందపడి చేయి బెణికిందని వెళితే... తక్షణం ప్లేట్లు వేసి సర్జరీ చేయాల్సిందేనంటాడొక పేరున్న ఎముకల డాక్టరు. కంగారుపడి మరో మంచి వైద్యుడి దగ్గరికెళితే... సర్జరీ కాదు కదా కనీసం కట్టు కూడా లేకుండా తగ్గించారాయన. ఇక మరో ఆసుపత్రయితే రోగి చనిపోయినా ఆ విషయం బంధువులకు చెప్పకుండా నాలుగు సర్జరీలు చేసేసింది. కడుపులో కాస్త మంటగా ఉందని వెళ్తే ఎమ్మారైతో సహా అన్ని స్కానింగ్‌లూ చేయించేస్తున్నాడు మరో వైద్య శిఖామణి. ఇవన్నీ పచ్చి నిజాలు. పరీక్షల నుంచి సర్జరీల వరకూ అడుగడుగునా దండుకోవటం, పిండుకోవటమే పరమార్థంగా మారిన కార్పొరేట్ వైద్యానికి లాభాల లెక్కలు తప్ప మనుషుల వేదన పట్టే పరిస్థితి లేదు. 'మీరు అడిగినంత డబ్బిస్తాం. మాకు అవసరమైన వైద్యం మాత్రమే చేయండి మొర్రో' అని అరిచినా వినిపించుకునే వైద్య నారాయణులు లేరక్కడ. ఎందుకంటే కన్సల్టేషన్, పరీక్షల నుంచి సర్జరీల వరకూ యాజమాన్యాలు పెట్టే టార్గెట్లే వారికి ముఖ్యం.
పాడెక్కిన సంప్రదాయ వైద్యం
ఎలాంటి ఊళ్లో ఉండాలో చెబుతూ సుమతీ శతకకారుడు 'అప్పిచ్చువాడు..'తర్వాత వైద్యుడికే ప్రాధాన్యం ఇచ్చాడు! ఆయన చెప్పినట్టుగానే పూర్వపు రోజుల్లో ప్రతి ఊళ్లో సంప్రదాయ వైద్యుడు ఉండేవాడు. ధన్వంతరి వేల ఏళ్ల కిందటే ఈ గడ్డపై మూలి కలతో ఔషధాలను తయారు చేశా డు. అష్ట విధ చికిత్సలతో ఆయుర్వేదాన్ని అందించాడు. ఆ పరంపర ఒక తరం నుంచి మరో తరానికి అందేది. ఊరికి ఏ ఆపద వచ్చినా మందు ఇచ్చి బాగుచేసే సంప్రదాయ వైద్యులుండేవారు. తృణమో పణమో.. ఏమీ లేకుంటే ఓ నమస్కారం మాత్రమే స్వీకరించి చిరునవ్వుతో జనం యోగక్షేమాలను వారు జాగ్రత్తగా చూసుకునేవారు. ఆప్యాయంగా పలకరించి సగం జబ్బు తగ్గించేవారు. గాయాలకు గడ్డి చేమంతి, ఉత్తరేణి వంటివి వేసి కట్టుకడితే అవి ఇట్టే మాయమయ్యేవి. జ్వరం, దగ్గు, జలుబు, అజీ ర్ణం.. ఇలా ఏ జబ్బు చేసినా మాత్రలిచ్చి మాన్పేసేవారు. పెద్ద జబ్బులు వస్తే తప్ప ఊరు దాటి పట్నం వెళ్లే పరిస్థితి ఉండేది కాదు.
మరి ఇప్పుడు..?
రోజులు మారాయి. పాలకులు సంప్రదాయ వైద్యాన్ని పాడెక్కించారు. ఊళ్లల్లో నాటి వైద్యులు మచ్చుకైనా కన్పించడం లేదు. ఫలితంగా ప్రాణాంతక వ్యాధుల సంగతి అలా ఉంచితే ఏ చిన్న జబ్బు చేసినా ఊళ్లో పరిష్కారం దొరకడం లేదు! తరతరాల నుంచి వస్తున్న వైద్య విధానాలకు తిలోదకాలు ఇచ్చిన ప్రభుత్వాలు.. అంతకు మెరుగైన వైద్యాన్ని అందిస్తే మంచిదే. కానీ పల్లెల్లో సర్కారీ వైద్యం ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వ్యాధుల సీజన్ వచ్చిందంటే జనం పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకునే నాథుడు ఉండడు. ఆదుకునే ప్రభుత్వాసుపత్రి ఉండదు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పడకేశాయి. ఎక్కడ చూసినా వసతుల లేమి.. మందుల కరువు.. వైద్యుల కొరత. ఫలితంగా ఏ జబ్బు చేసినా పట్నం పోవాల్సిందే. కార్పొరేట్ ఆసుపత్రుల తలుపు తట్టాల్సిందే. ఇక అక్కడికి వెళ్తే ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. కాసుల వేట తప్ప రోగానికి మందు దొరకదు. దొరికినా సామాన్యుడికి అందని దుస్థితి. ఇలా సంప్రదాయ ైవె ద్యానికి చరమగీతం పాడిన ప్రభుత్వాలు.. ప్రజల ఆరోగ్యాన్ని 'కార్పొరేట్' కు తాకట్టు పెట్టాయి.
కదులుదాం.. కదిలిద్దాం..
నిత్యావసరాల్లో భాగమైన వైద్యం ఇప్పుడు... నిబద్ధత, నిజాయితీ లోపించి సంక్షోభంలో కూరుకుపోయింది. సంక్షోభాన్ని సైతం దాటిపోతోంది. ఖరీదైన వైద్యం చేయించుకోలేక 30 శాతం మంది మధ్యతరగతి నుంచి పేదరికంలోకి జారిపోతున్నారంటే ఆ తప్పు ఎవరిది? అందుబాటు ధరలో... అవసరమైన చికిత్స చేయని ప్రైవేటు వైద్యానిది కాదా? ఉచితంగా వైద్యసదుపాయం కల్పించ లేని సర్కారీ ఆసుపత్రులది కాదా? అవును! దీనికిపుడు చికిత్స కావాలి. ప్రజల వైద్య ఖర్చులు బడ్జెట్‌కు రెండింతలు కాకముందే ఈ చికిత్స ఎక్కడో ఒకచోట మొదలవ్వాలి. అందుకే ‘సాక్షి’ ఈ బాధ్యతను భుజాన వేసుకుంది. అందులో భాగంగానే వైద్యరంగం తీరుతెన్నులను విశ్లేషిస్తూ.. జరిగిన, జరుగుతున్న సంఘటనలను తెలియజేస్తూ వరుస కథనాలను అందించనుంది.
'సాక్షి' చేస్తున్న ఈ ప్రయత్నానికి మీరూ కలసి రావాలి. సర్కారీ, కార్పొరేట్ వైద్యంలో మీకెదురైన చేదు అనుభవాలను.. మీరు చూసిన మంచి డాక్టర్ల గురించి 'సాక్షి'తో పంచుకోండి. వైద్య దుస్థితిని మార్చడానికి సూచనలు కూడా తెలియజేయండి. వీటిని ప్రచురించటం ద్వారా నిర్మాణాత్మకమైన చర్చకు అవకాశమిద్దాం. మీ అనుభవాలు, ఆలోచనలను ఈమెయిల్స్, లేఖల ద్వారా ‘'సాక్షి'కి పంపేటపుడు... మీ పేరు, మీకు చికిత్స చేసిన ఆసుపత్రి లేదా డాక్టరు పూర్తి పేరును, మొబైల్ నంబర్లను తప్పనిసరిగా తెలియజేయండి. మీ పేరు రహస్యంగా ఉంచాలని భావిస్తే అది కూడా రాయండి.
లేఖలు పంపాల్సిన చిరునామా:
ఎడిటర్, సాక్షి, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్-34
sakshihealth15@gmail.com