జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్‌లో గార్డ్ డ్యూటీ విధుల గురించి ఆరా తీస్తున్న ఎస్పీ
– అర్ధరాత్రి నగరంలో ఆకస్మిక తనిఖీ
– వన్‌టౌన్ ఏఎస్‌ఐపై బదిలీ వేటు
– ఇద్దరు కానిస్టేబుళ్లు వీఆర్‌కు
– ఏఆర్‌పీసీ పక్కిరయ్యకు చార్జిమెమో
కర్నూలు : విధి నిర్వహణలో అలసత్వం వహించిన పోలీసు సిబ్బందిపై ఎస్పీ ఆకే రవికృష్ణ కొరడా ఝుళిపించారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు ఏఆర్ హెడ్ క్వార్టర్, సెక్యూరిటీ గార్డ్ రూమ్స్‌తో పాటు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో గస్తీ పాయింట్స్‌ను కూడా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్‌లో బీట్ పుస్తకాలు పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెట్రోలింగ్, గస్తీ విధులకు అలాట్ చేసిన కానిస్టేబుళ్లు ఆ విధులు మాని పోలీస్ స్టేషన్‌లోనే ఉండటంతో వారిని ఎస్పీ విచారించారు. విధుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించినట్లు తెలుసుకుని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వన్‌టౌన్ ఏఎస్‌ఐ పి.వి.రామిరెడ్డిపై శాఖాపరమైన చర్యల్లో భాగంగా శ్రీశైలంకు బదిలీ చేశారు. అదే స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుళ్లు ఎంవీ రమణ(పీసీ 2359), డి.వీరారెడ్డి (పీసీ 1826) విధుల్లో లేకుండా స్టేషన్‌లోనే ఉండటంతో వీఆర్‌లో రిపోర్టు చేసుకోవాల్సిందిగా ఆదేశించారు. రాత్రిపూట గస్తీ, పెట్రోలింగ్ విధులు నిర్వహించే పోలీసులు ప్రజలకు భద్రతా భావాన్ని కల్పించే విధంగా ఉండాలని, విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శిస్తే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. పెట్రోలింగ్, డే, నైట్ బీట్ చెకింగ్‌కు వెళ్లే సిబ్బంది విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఐ, ఎస్‌లకు సూచించారు. వివిధ ఘటనల్లో న్యాయం కోసం పోలీస్ స్టేషన్లకు వచ్చే వారి విషయంలో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు. సమర్థంగా విధులు నిర్వహిస్తూ శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేయాలని ఆదేశించారు. కర్నూలు డీఎస్పీ రమణమూర్తి, వన్‌టౌన్ సీఐ వి.ఆర్.కష్ణయ్య తదితరులు ఎస్పీ వెంట నగరంలో పర్యటించారు.