
కలెక్షన్ కింగ్
►నాకు అర్జెంట్ పని ఉంది. ఓ రూ.50 వేలు ఇవ్వు. మళ్లీ ఇస్తా!
► నువ్వు కాల్‌మనీ వ్యాపారం చేస్తున్నావంట.. ఒక్కసారి నా వద్దకు వచ్చిపో!!
►మీరిద్దరూ ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకున్నారు. కోర్టుల చుట్టూ ఎక్కడ తిరుగుతారు.. రండి హోటల్‌లో మాట్లాడుకుందాం!!!
► ఇదీ ఓ సీఐ వ్యవహారం
సాక్షి ప్రతినిధి, కర్నూలు: స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదులు తీసుకోకపోవడం.. కేవలం సెటిల్‌మెంట్లతో వ్యవహారాలు చక్కబెట్టడం.. తన కింద పనిచేస్తున్న ఎస్‌ఐతో కలిసి ఇసుక దందాకు తెగబడటం.. ఆ సీఐ బాగోతం ఎంత చెప్పినా తక్కువే. అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్న కొద్ది మంది వ్యాపారులను పిలిపించి కాల్‌మనీ పేరుతో బెదిరించి సుమారు రూ.10లక్షల నుంచి రూ.12 లక్షలు వసూలు చేశారు. ఇదే డబ్బుతో కొద్దిరోజుల క్రితం కారు కొన్న సదరు సీఐ ఎంచక్కా షికారు చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తం మీద కర్నూలు రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ఆ సీఐ వ్యవహారం కాస్తా ఇప్పుడు డిపార్టుమెంట్‌లో చర్చనీయాంశమయింది. కొద్ది రోజుల క్రితం అవినీతి ఆరోపణలతో ఏకంగా నలుగురు సీఐలపై వేటు పడింది. ఇదే కోవలో ఈయనను కూడా తప్పిస్తారా? లేదో తేలాల్సి ఉంది.
బంగారు గొలుసు మాయం
కొద్దిరోజుల క్రితం సదరు సీఐ స్టేషన్ పరిధిలో ఒక బంగారు గొలుసు చోరీ అయింది. దీనిపై కేసు కూడా నమోదయింది. ఈ బంగారు గొలుసును దొంగలించిన దొంగను పట్టుకున్నారు కూడా. అయితే.. ఇప్పటి వరకు రికవరీ అయినట్టు ఎక్కడా చూపలేదు. ఎక్కడికెళ్లిందోనని ఆరా తీస్తే.. సీఐ గారి ఇంట్లో ప్రత్యక్షమయిందని తెలిసింది. ఈ వ్యవహారం స్టేషన్‌లో ఉన్న పోలీసులందరికీ తెలిసినా ఎవ్వరూ కిక్కురుమనలేని పరిస్థితి. అంతేకాకుండా ఎప్పుడు ఎవ్వరి మీద విరుచుకుపడతారో తెలియని ఆందోళన పరిస్థితులల్లో కిందిస్థాయి సిబ్బంది కూడా ఇబ్బందిగా కాలం వెళ్లదీస్తున్నారు.
తన కింద పనిచేసే ఒక ఎస్‌ఐతో కలిసి మొన్నటి వరకు ఇసుక దందాను ప్రోత్సహించారు. అయితే, ఇప్పుడు ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుండటంతో.. ఇసుక ట్రాక్టర్లపైన టార్పాలిన్లు కప్పలేదనే సాకుతో వేధింపులకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది.