సాక్షి, మచిలీపట్నం :
సమైక్య ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న తరుణంలో జిల్లాలో ఇద్దరు ప్రధాన ఉన్నతాధికారులను ఒకేసారి సాగనంపుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చర్చనీయాంశమైంది. వారు జిల్లాకు వచ్చి 14 మాసాలు గడవకముందే బదిలీ వేటు పడటానికి బలమైన కారణాలే ఉన్నాయని చెబుతున్నారు. రాష్ట్రంలో ఒకేసారి 14 మంది ఐఏఎస్‌లకు స్థాన చలనం కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం సాయంత్రం ఆదేశాలు జారీ చేసింది. కలెక్టర్‌గా ఉన్న బుద్ధప్రకాష్ ఎం.జ్యోతిని రూరల్ హెల్త్ మిషన్ డెరైక్టర్ (హైదరాబాద్)గా, జాయింట్ కలెక్టర్‌గా ఉన్న పి.ఉషాకుమారిని శ్రీకాకుళం జిల్లా జేసీగా బదిలీ చేసింది.
రాజకీయ ఒత్తిళ్లే కారణం...
జిల్లాలో పాలన సజావుగా సాగించడం మాటెలా ఉన్నా కీలక విషయాల్లో కూడా ఠ మొదటి పేజీ తరువాయి
ఈ ఉన్నతాధికారులిద్దరూ నిర్లిప్తతతో వ్యవహరించడం వల్ల రాజకీయనాయకులకు ఇబ్బందికరంగా మారిందనే ప్రచారం ఉంది. కేవలం ఒకరిద్దరు ప్రజాప్రతినిధులను ప్రసన్నం చేసుకుని మిగిలినవారిని పట్టించుకోకపోవడంతో వారందరూ గుర్రుగా ఉన్నారు. అవకాశం వచ్చిన ప్రతి సందర్భంలోనూ వీరిద్దరి గురించి సీఎంకు జిల్లా ప్రజాప్రతినిధులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అందువల్లే వారిద్దర్నీ ఒకేసారి బదిలీ చేసినట్లు తెలుస్తోంది. ఎంప్లాయ్‌మెంట్ జనరేషన్ మార్కెటింగ్ మిషన్ (హైదరాబాద్) సీఈవోగా పనిచేస్తున్న 2002 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎం.రఘునందన్‌ను జిల్లాకు కొత్త కలెక్టర్‌గా, సీఎం పేషీలో పనిచేస్తున్న జె.మురళిని జాయింట్ కలెక్టర్‌గా నియమించారు.
కలెక్టర్ పనితీరుపై అసంతృప్తి...
కలెక్టర్‌గా బుద్ధప్రకాష్ పనితీరు అధికార, ప్రతిపక్ష ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తినే మిగిల్చింది. 2002 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన కర్నూలులో జేసీగా పనిచేస్తూ పదోన్నతిపై కలెక్టర్‌గా 2012 జూలై 31న జిల్లాకు వచ్చారు. ఆయన హయాంలో కీలక విషయాలు, అర్జీలు, ఇతర అనుమతులకు సంబంధించిన ఫైళ్లు నెలల తరబడి కలెక్టరేట్‌లోనే మగ్గిపోయాయనే ఆరోపణలు వచ్చాయి. రొటీన్ కార్యక్రమాలు మినహా కీలక పనులేమీ జరగలేదు. పలు శాఖల అధికారులు సైతం ఎవరికి నచ్చినట్టు వారు వ్యవహరించడంతో పాలనపై కలెక్టర్ పట్టుసాధించలేకపోయారు. వారిని సమన్వయం చేసి ముందుకు నడపడంలోనూ ఆయన దృష్టిపెట్టలేదన్న విమర్శలు ఎదుర్కొన్నారు. విజయవాడ, మచిలీపట్నం క్యాంపులు మినహా జిల్లాలోని కీలక విషయాలను అవగాహన చేసుకుని వాటిని పరిష్కరించే దిశగా పర్యటించిన సందర్భాలు తక్కువే.
ఇటీవల ఎదురైన నీటి ఎద్దడి, చెరువుల తవ్వకం సమయంలో అడపాదడపా ఆయన పర్యటించినా ప్రజల్లోను, ప్రజాప్రతినిధుల్లోను కలెక్టర్ పనిచేస్తున్నారన్న నమ్మకాన్ని కల్పించలేకపోయారు. మంత్రి కొలుసు పార్థసారథి, ఎంపీ లగడపాటి రాజగోపాల్‌తో మినహా మిగిలిన ఎంపీ, ఎమ్మెల్యేలు, కీలక నేతలతో కలెక్టర్‌కు సఖ్యత లేదనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలోనే పలువురు తెరవెనుక చక్రం తిప్పారని, కొద్దినెలలుగా వారు చేసిన ప్రయత్నాలు ఫలించి బదిలీకి మార్గం సుగమమైందని వినికిడి.
జేసీ తీరుపై గుర్రు...
కలెక్టర్ తరువాత కీలక పోస్టులో ఉండే జేసీ పి.ఉషాకుమారి తీరుపైనా ప్రజాప్రతినిధులు గుర్రుగానే ఉన్నారు. హైదరాబాద్‌లోని సెక్రటేరియట్‌లో పనిచేస్తూ 2012 ఆగస్టు 29న ఆమె ఇక్కడికి వచ్చారు. అప్పటి నుంచి అనేక విషయాల్లో ఆమె మాటతీరు, వ్యవహారశైలి నచ్చని ప్రజాప్రతినిధులు బదిలీకి పావులు కదిపినట్టు సమాచారం. ఇసుక ర్యాంపులు, ఆక్వా చెరువులు తదితర విషయాల్లో జేసీ పనితీరుపై ప్రజాప్రతినిధులు ఫిర్యాదులు చేసినట్టు సమాచారం.
కలెక్టరేట్‌కు అంటుకున్న అవినీతి మకిలి..
జిల్లాను అనేక రంగాల్లో ముందుకు నడపాల్సిన కలెక్టరేట్‌కు సైతం అవినీతి మకిలి అంటుకుంది. రెండు నెలలక్రితం కలెక్టరేట్‌లోని సి-సెక్షన్‌కు చెందిన రాజశేఖర్ ఒక పెట్రోల్ బంక్ ఏర్పాటుకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (ఎన్‌వోసి) కోసం రూ. 25 లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. చిరుద్యోగి అయిన ఆయన రూ.25 వేలు ఎలా డిమాండ్ చేస్తాడని, పైఅధికారులకు కూడా వాటాలిచ్చేందుకే అలా చేశాడంటూ కలెక్టరేట్‌లోని ఇతర ఉద్యోగులు వ్యాఖ్యానించడం పలు అనుమానాలకు తావిచ్చింది. ఏదేమైనా కలెక్టర్, జేసీ ఉండే క్యాంపస్‌లోనే చిరుద్యోగి పట్టుబడటం అప్పట్లో చర్చనీయాంశమైంది.
ఇసుక క్వారీల వివాదంలోనూ...
తమకు అనుకూలంగా ఉంటే కాసుల గలగలలు, అడ్డొస్తే అంతే సంగతులు అనే తీరులో జిల్లాలో ఇసుక సిండికేట్లు వ్యవహరిస్తుంటారు. ఇసుక ర్యాంపుల వివాదం కూడా జిల్లాలోని ఈ ఇద్దరు కీలక అధికారుల మెడకు చుట్టుకున్నట్టు సమాచారం. కొద్ది నెలల క్రితం పామర్రు నియోజకవర్గ పరిధిలోని ఇసుక ర్యాంపు విషయంలో ఎమ్మెల్యే డీవై దాసు కలెక్టరేట్‌ను లక్ష్యంగా చేసుకుని పెనువివాదాన్ని రేపారు. ఇసుక క్వారీకి అనుమతి ఇవ్వాలని అనేక రోజులపాటు అధికారులను కోరిన డీవై దాసు కొద్దినెలల క్రితం నేరుగా కలెక్టరేట్‌కు వచ్చి ధర్నా చేశారు. అదే సమయంలో కలెక్టర్ బుద్ధప్రకాష్, ఎమ్మెల్యే దాసు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. ఆగ్రహంతో ఊగిపోయిన డీవైదాసు ఈ ఇద్దరు అధికారులను బదిలీ చేయిస్తానని సవాల్ చేశారు. కారణమేదైనా, ఎవరైనా, జిల్లాకు చెందిన ఇద్దరు ఉన్నతాధికారుల బదిలీకి మంత్రి, సీఎం వద్ద రాజకీయ ఒత్తిళ్లే పనిచేశాయని తెలుస్తోంది.
కలెక్టర్, జేసీ ఔట్
Published Wed, Oct 9 2013 3:28 AM | Last Updated on Fri, Sep 1 2017 11:27 PM
Advertisement
Advertisement