జిల్లా స్థాయి అధికారుల సంప్రదింపుల కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్
ఏలూరు(మెట్రో) : నిర్ణీత కాల వ్యవధిలో ప్రజా సమస్యలు పరిష్కరించకుంటే ఆయా శాఖల అధికారులకు రూ.100 చొప్పున జరిమానా విధిస్తానని కలెక్టర్ భాస్కర్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి అధికారుల సంప్రదింపుల కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు అందించిన వినతిపత్రాలు నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కారం కావాలని ఆదేశించారు. నిర్ణీత కాలవ్యవధిలో పరిష్కారం కాని ఒకొక్క ఫిర్యాదుకు రూ.100 చొప్పున జరిమానా విధిస్తున్నామని కలెక్టర్ చెప్పారు.
జరిమానా ఇలా..
ఏపీఈపీడీసీఎల్ ఎస్‌ఈ 34 ఫిర్యాదులకు రూ.3,400, సర్వే సెటిల్‌మెంట్ శాఖకు 19 ఫిర్యాదులకు రూ.1,900, పౌరసరఫరాల శాఖకు రూ.1,600, మత్స్య శాఖకు రూ.1,000, పంచాయతీ కార్యదర్శులకు రూ.600, దేవాదాయశాఖకు రూ.700 జరిమానా విధిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
అధికారులపై చర్యలు
మీకోసం కార్యక్రమంలో వచ్చిన ప్రజాసమస్యలను పరిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్క్‌ఫెడ్ డీఎం నాగమల్లికకు షోకాజ్ నోటీసు జారీ చేయాలని కలెక్టర్ డీఆర్‌ఓను ఆదేశించారు. అలాగే పశుసంవర్ధకశాఖ జేడీని ప్రభుత్వానికి సరెండర్ చేయాలని ఆదేశించారు. ఆర్టీసీ డీఎం, మార్క్‌ఫెడ్ డీఎం, జిల్లా గ్రంథాలయ సంస్థ, ఏపీఐఐసీ శాఖల ఉన్నతాధికారులకు ఈ–ఫైలింగ్ అమలు చేయని కారణంగా షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఆర్‌ఓ సత్యనారాయణను కలెక్టర్ ఆదేశించారు.
10వ తరగతి ఫలితాల్లోవెనుకబాటు ఎందుకు
జిల్లాలో ఉపాధ్యాయులంతా బాధ్యతగా పాఠాలు చెబితే పదో తరగతి పరీక్షా ఫలితాల్లో వెనుకబాటు ఎందుకు వచ్చిందని, దీనికి ఏయే టీచర్ బాధ్యులో గుర్తించాలని కలెక్టర్ కాటంనేని భాస్కర్ డీఈఓ రేణుకను ఆదేశించారు. వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని తహసీల్దార్లను కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment