సాక్షి, పశ్చిమ గోదావరి : ఓటర్లు స్వేచ్చాయుత వాతావరణంలో తమకు నచ్చిన నేతను ఎన్నుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ సూచించారు. మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి ఆయన జిల్లా ఎస్పీ రవి ప్రకాశ్‌తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాలకు.. 15 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. జిల్లాలో మొత్తం 3417 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశామన్నారు. 530 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌లలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని తెలిపారు. జిల్లాలో మొత్తం 32,18,106 ఓటర్లుండగా వారిలో పురుషులు15,81,496.. స్త్రీలు 16,36,610 ఉన్నారన్నారు. జిల్లాలో అత్యధికంగా చింతలపూడి నియోజకవర్గంలో 2,63,337 మంది ఓటర్లుండగా.. భీమవరం 2,46,342 ఓటర్లతో రెండో స్థానంలో ఉందని తెలిపారు. అత్యల్పంగా నరసాపురం నియోజకవర్గంలో 1,68,122 మంది ఓటర్లు మాత్రమే ఉన్నారన్నారు.
పోలింగ్ కోసం 25 వేల మంది సిబ్బందితో పాటు.. ఎన్నికల నిర్వహణకు 3441 ప్రిసైడింగ్ అధికారులను కూడా నియమించామని తెలిపారు. ‘మై ఓట్ క్యూ’ మొబైల్ యాప్ వాడకం ద్వారా పోలింగ్ కేంద్రం వద్ద క్యూలైన్ గురించి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకోవచ్చన్నారు. పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు కోసం 2900 మంది సివిల్ పోలీసులతో పాటు 12 కంపెనీల పారామిలటరీ బలగాలను, 4 కంపెనీల ఏపీఎస్పీ బలగాలను, 29 కంపెనీల గ్రే హౌండ్స్ బలగాలను వినియోగిస్తున్నామని తెలిపారు. 2651 పోలింగ్ కేంద్రాల వద్ద వెబ్ కాస్టింగ్ ద్వారా లైవ్ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎన్నికల పోలింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ నెల 10, 11 తేదిలలో సెలవు ప్రకటించారని తెలిపారు. డీఎస్పీల నేతృత్వంలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలకి స్పెషల్ స్టైకింగ్ బృందాలను నియమించామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment