సమగ్రాభివృద్ధే విజన్‌ | Collector Hari Kiran Has Come Up With A Special Vision On Kadapa District Development. | Sakshi
Sakshi News home page

‘స్పందన’తో సమస్యల సత్వర పరిష్కారం

Published Sun, Jul 21 2019 9:57 AM | Last Updated on Sun, Jul 21 2019 9:59 AM

Collector Hari Kiran Has Come Up With A Special Vision On Kadapa District Development. - Sakshi

జిల్లా సమగ్రాభివృద్ధిపై ప్రత్యేక విజన్‌తో కలెక్టర్‌ హరి కిరణ్‌ ముందుకు సాగుతున్నారు. స్పందనలో వచ్చే సమస్యలకు యుద్ధ ప్రాతిపదికన పరిష్కారం చూపేందుకు జిల్లా అధికార యంత్రాంగాన్ని ఉరకలెత్తిస్తున్నారు. నవరత్నాల అమలుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు వెళుతున్నారు. గ్రామ వలంటీర్లు, గ్రామ, వార్డు సచివాలయాల సరికొత్త పాలనను సమర్థవంతంగా నడిపేందుకు సిద్ధమవుతున్నారు. గాలేరు–నగరి ప్రాజెక్టును పూర్తి చేసి గండికోటలో 26 టీఎంసీల నీటిని నింపడమే టార్గెట్‌గా నిర్దేశించుకున్నారు. కడప విమానాశ్రయం అభివృద్ధి్ద, స్టీల్‌ప్లాంటు నిర్మాణం, కుందూ ద్వారా బ్రహ్మంసాగర్‌కు నీరు తదితర పథకాలను పూర్తి చేసి జిల్లాను అన్ని రంగాలలోముందుకు నడిపించేందుకు కలెక్టర్‌ కృషి చేస్తున్నారు. సీఎం జిల్లా కావడంతో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.అభివృద్ధి,సంక్షేమాలను అవకతవకలకు తావు లేకుండా పట్టాలెక్కించడం కత్తిమీద సామే. సమర్థుడు, పాలనాదక్షత కలిగిన యువ అధికారిగా హరికిరణ్‌ ఆ బాధ్యతలను సవాలుగా తీసుకున్నారు. జిల్లాకు సంబంధించి వివిధ అంశాలపై  ‘సాక్షి ప్రతినిధి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.         –సాక్షి ప్రతినిధి కడప 

సాక్షి : స్పందన కార్యక్రమం ఎలా ఉంది?
కలెక్టర్‌ : ఈ కార్యక్రమానికి ఊహించనంతంగా స్పందన వస్తోంది. వారం వారం జనం తండోపతండాలుగా వస్తున్నారు.  ఎన్నడూ లేనంతగా జనం నమ్మకంతో అధికారుల వద్దకు తరలి వస్తున్నారు.
సాక్షి : సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కలెక్టర్‌ : జనం సమస్యలను అర్జీ రూపంలో తీసుకుంటూ నమోదు చేస్తున్నాం. సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తామో కూడా అర్జీదారులకు చెబుతున్నాం. చిన్నచిన్న సమస్యలు అక్కడికక్కడే పరిష్కరిస్తున్నాం. సాక్షాత్తూ ముఖ్యమంత్రే స్పందనను వారం వారం సమీక్షిస్తున్నారు. దీంతో జిల్లాలో ఈ కార్యక్రమాన్ని మరింత ›ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని పనిచేస్తున్నాం.
సాక్షి : జిల్లా సమగ్రాభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కలెక్టర్‌  : ఇది ముఖ్యమంత్రి జిల్లా. ఇక్కడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ప్రభుత్వం గట్టిగా చెబుతోంది. అందుకు అనుగుణంగా జిల్లాలోని ప్రధాన సమస్యలను గుర్తించడం, వాటిని ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడం ముఖ్యం. ఇందుకోసం ప్రణాళికలు ఇప్పటికే సిద్దం చేశాం.
సాక్షి : జన్మభూమి కమిటీలకు, సచివాలయ ఉద్యోగుల వ్యవస్థకు తేడా ఏమిటి?
కలెక్టర్‌ : జన్మభూమి కమిటీలు నిర్ణాయక శక్తిగా పనిచేశాయి. వారు చెప్పిందే జరిగింది.. వలంటీర్లు, సచివాలయ ఉద్యోగుల వ్యవస్థ ఇందుకు భిన్నం. వీరు ప్రభుత్వ పథకాల ఫలాలను ప్రజలకు చేరవేస్తాం.
సాక్షి : జిల్లాలో అభివృద్ధి పనుల సంగతేమిటి?
కలెక్టర్‌ : ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాలలో మాత్రమే గ్రామీణ ప్రాంతాలకు రోడ్డు సౌకర్యం ఉంది. మిగిలిన నియోజకవర్గాల్లో గ్రామాలకు సక్రమంగా రోడ్లు లేవు. ప్రతి గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
సాక్షి : తాగునీటి ఇబ్బందులు ఎలా అధిగమిస్తారు?
కలెక్టర్‌ : మూడు నాలుగేళ్లుగా వర్షాలు లేవు. భూగర్బ జలాలు అడుగంటాయి.  బోరుబావులు, తాగునీటి పథకాలు ఒట్టిపోయాయి. ప్రస్తుతం వెయ్యి గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నాం. వర్షాలు వస్తే తప్ప ఇబ్బందులు తీరవు. భవిష్యత్తులో నీటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నదే లక్ష్యం. గాలేరు–నగరి, తెలుగుగంగ తదితర ప్రాజెక్టుల మిగులు పనులు పూర్తి చేసి గండికోటలో 26 టీఎంసీల నీటిని నిలిపి ప్రతి గ్రామానికి సురక్షిత తాగునీటిని అందిస్తాం.
సాక్షి : కుందూ వరద కాలువ ఎంతవరకు వచ్చింది?
కలెక్టర్‌ : కుందూ నుంచి నీటిని తరలింపే లక్ష్యంగా బ్రహ్మంసాగర్‌కు కాలువను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డిసెంబరులో స్వయంగా ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు. రూ.300 కోట్లకు పైగా వెచ్చించి ఐదు టీఎంసీలకు పైగా నీటిని బ్రహ్మంసాగర్‌కు తరలించాలన్నది ఉద్దేశం. సాగర్‌లో నిత్యం నీటిని నిల్వ ఉంచి పరివాహక ప్రాంతంలో సాగు, తాగునీటిని అందించాలన్నదే లక్ష్యం.
సాక్షి : రిమ్స్‌ అభివృద్ధి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కలెక్టర్‌ : రిమ్స్‌ ఆస్పత్రిని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిగా మార్చేందుకు ముఖ్యమంత్రి ఒకే చెప్పారు. అవసరమైన నిధులు ఇస్తామన్నారు. ప్రస్తుతం ఫైలు సిద్ధంగా ఉంది. త్వరలోనే రిమ్స్‌ను సూపర్‌ స్పెషాలిటీ మార్చడం జరుగుతుంది. ఇదే జరిగితే ఆస్పత్రిలో మరిన్ని ఉద్యోగాల కల్పన జరుగుతుంది. పేదలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయి.
సాక్షి : స్పోర్ట్స్‌ అభివృద్ధి తీసుకుంటున్న చర్యలు ఏమిటి?
కలెక్టర్‌ : జిల్లాలో రూ.30 కోట్లతో స్పోర్ట్స్‌ స్కూలు అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నాం. స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు సైతం చర్యలు తీసుకుంటున్నాం. అందుకోసం అవసరమైన భూమిని యోగి వేమన యూనివర్సిటీæ  ప్రాంతంలో సేకరిస్తున్నాం. 

సాక్షి : జిల్లాలో ప్రధాన రోడ్లను ఎక్కడ నిర్మించబోతున్నారు?
కలెక్టర్‌ : కడప నుంచి ప్రకాశం జిల్లాలోని అమరావతి–అనంత ప్రధాన రహదారిలో కలిసేలా మైదుకూరు నుండి ప్రధాన రహదారిని నిర్మించాలని యోచిస్తున్నాం.  ఇందుకోసం ప్రతిపాదనలు సిద్ధం చేశాం. ఈ రహదారి నిర్మాణానికి కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మరింతగా కృషి చేస్తున్నారు.
సాక్షి : సీఎం జిల్లాలో మీ ఆధ్వర్యంలో పాలన ఎలా ఉండబోతోంది?
కలెక్టర్‌ : కచ్చితంగా పారదర్శకంగా ఉంటుంది. ముఖ్యమంత్రి ఉద్దేశం కూడా ఇదే. అవినీతికి తావు లేని పాలన ఉండాలని చెబుతున్నారు. అధికారులను సమన్వయం చేసుకుని పాలన సాగిస్తాం.
సాక్షి : ప్రజాప్రతినిధుల మద్దతు ఎలా ఉంది?
కలెక్టర్‌ : ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి మొదలుకొని అందరూ ప్రజాప్రతినిధులు సహకరిస్తున్నారు. సొంత జిల్లా కావడంతో అభివృద్ధికి   సీఎం అన్ని విధాలుగా సాయం అందిస్తారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని నియోజకవర్గాలను అభివృద్ది చేసుకోవాలన్నది అందరి ›ప్రజాప్రతినిధుల ఆలోచన. దీనికి అనుగుణంగానే అధికారుల సహకారం ఉంటుంది. 
సాక్షి : అధికారుల సహకారం ఎలా ఉంది?
కలెక్టర్‌ : పనిచేసేవారూ ఉన్నారు. కొందరు పనిచేయని వారూ ఉన్నారు. ముఖ్యమంత్రి జిల్లాలో అన్ని విభాగాల అధికారులు అప్రమత్తతతోనే ఉంటేనే పనులు జరుగుతాయి. పనిచేసే అధికారులను ప్రోత్సహిస్తాం. పనిచేయని వారిని సాగనంపుతాం.
సాక్షి : జిల్లాలో కరువు పరిస్థితులను ఎలా అధిగమిస్తారు?
కలెక్టర్‌ : ఇప్పటికే వర్షాభావంతో ఖరీఫ్‌ దాదాపుగా పోయింది. రబీపైనే ఆశలు. ప్రత్యామ్నాయ పంటలకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రభుత్వ పరంగా రైతాంగంతోపాటు అన్ని వర్గాల వారిని ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటాం.

సాక్షి : స్టీల్‌ప్లాంటు నిర్మాణం ఎంత వరకు వచ్చింది?
కలెక్టర్‌ :  స్టీల్‌ప్లాంటు నిర్మిస్తున్నట్లు ఇప్పటికే సీఎం ప్రకటించారు. కొప్పర్తి ప్రాంతంలో 6500 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. స్టీల్‌ ప్లాంటు ఇక్కడే ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నాం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి అన్ని విషయాలను ముఖ్యమంత్రి స్వయంగా చూస్తున్నారు. స్టీల్‌ప్లాంటు త్వరలోనే ఏర్పాటవుతుంది. దీంతోపాటు కొప్పర్తిలో మరిన్ని పరిశ్రమలు నెలకొల్పబోతున్నాం.

సాక్షి : సంక్షేమ పథకాల అమలుకు తీసుకుంటున్న చర్యలేమిటి?
కలెక్టర్‌ : నవరత్నాల అమలుకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. అర్హులైన అందరికీ పెన్షన్లు, రేషన్‌కార్డులు ఇవ్వడంతోపాటు నవరత్నాల్లోని అన్ని  పథకాలను అర్హులందరికీ అందేలా చూస్తాం. గ్రామ స్థాయిలో పథకాలు సక్రమంగా అందేందుకు వలంటీర్ల వ్యవస్థతోపాటు గ్రామ, పట్టణ సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం ప్రవేశపెడుతోంది. దీనిని సక్రమంగా అమలు చేసేందుకే చర్యలు తీసుకుంటున్నాం. సచివాలయ ఉద్యోగుల ఎంపికను పారదర్శకంగా నిర్వహించబోతున్నాం. 

సాక్షి : కడప విమానాశ్రయ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
కలెక్టర్‌ :కడప విమానాశ్రయాన్ని తిరుపతి, వైజాగ్‌ తదితర విమానాశ్రయాల స్థాయిలో అభివృద్ధి చేయబోతున్నాం. రాబోయే మూడు నెలల్లో నైట్‌ ల్యాండింగ్‌ ఉండేలా చర్యలు చేపడుతున్నాం.  విమానాశ్రయంలో అవసరమైన ఆరు ఫిల్లర్స్‌ ఏర్పాటు చేయబోతున్నాం. ఫారెస్టు క్లియరెన్స్‌  రావాల్సి ఉంది. త్వరలోనే పనులు పూర్తి చేస్తాం. విమానాశ్రయంలో గ్రీనరీ కోసం ఇప్పటికే కోటి రూపాయలు ఖర్చు చేశాం. మరో కోటి రూపాయలు  నిధులు వెచ్చించనున్నాం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement