పశ్చిమగోదావరి ,ఏలూరు (మెట్రో) : జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయ్యిందని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ సాంఘిక సంక్షేమశాఖ సహాయ సాంఘిక సంక్షేమాధికారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల చింతలపూడి సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థిని ఘటనను తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ ఆ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు. తక్షణమే సహాయ సాంఘిక సంక్షేమాధికారిని సస్పెండ్ చేయాలని ఆదేశించారు.
అదేవిధంగా వార్డెన్‌ల బయోమెట్రిక్ హాజరు పరిశీలించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డైరెక్టర్ రంగలక్ష్మీదేవికి ఛార్జిమెమో ఇవ్వాలని డీఆర్వోను సత్యనారాయణను ఆదేశించారు. సాంఘిక సంక్షేమశాఖలో అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక ఆడపిల్ల జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చిందని, అధికారులు ఉద్యోగం చేస్తున్నారా లేక గాడిదలు కాస్తున్నారా అంటూ కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఆడపిల్లకు కోల్పోయిన జీవితాన్ని తెచ్చి ఇవ్వగలరా అని ప్రశ్నించారు.
వసతిగృహాలకు లైసెన్స్‌లు ఉండాలి
ఏలూరు (మెట్రో) : జిల్లాలో బాలల వసతిగృహాలకు తప్పనిసరిగా లైసెన్సులు కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ చెప్పారు. జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ సొసైటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. బాలల సంరక్షణ సమితి పనితీరు 3 నెలలకు ఒకసారి సమీక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
గోశాల అమలుకు చర్యలు
జిల్లాలో ‘గోశాల పథకం’ సక్రమంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ ఆదేశించారు. సోమవారం నిర్వహించిన డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రజలు ఫోన్‌ల ద్వారా పలు సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. నిడదవోలు మండలం తాడిమళ్లకు చెందిన కృష్ణకుమార్ ఫోన్‌లో మాట్లాడుతూ గోశాల పథకం గురించి తెలపాలని కలెక్టర్‌ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్ గోశాల పథకం గురించి తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment