బెంగళూరు ఇందిరాగాంధీ ఆస్పత్రిలో రెడ్డి సుహానాతో తల్లి
చిత్తూరు,బి.కొత్తకోట: షుగర్ లెవల్స్‌లో వ్యత్యాసంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న చిన్నారని రెడ్డి సుహానా (1)ను తక్షణమే తిరుపతి స్విమ్స్‌కు తరలించాలని కలెక్టర్ నారాయణ భరత్‌గుప్త మంగళవా రం జిల్లావైద్యశాలల సేవల సమన్వయకర్త సరళమ్మను ఆదేశించారు. బి.కొత్తకోట మండలానికి చెందిన బావాజాన్ కుమార్తె రెడ్డి సుహానా ఆరోగ్య పరిస్థితిపై ‘సాక్షి’లో పలు కథనాలు రావడంతో ప్రభుత్వం స్పందించి ఆదుకునే చర్యలు అమలు చేసింది. ఇన్సులిన్ మందులు, ఫ్రిడ్జ్, సీఎం సహాయ నిధి నుంచి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు. ఇటీవల రెడ్డి సుహానా ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరం కావడంతో తల్లిదండ్రులు బెంగళూరులోని ఇందిరాగాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లి చేర్పించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు చిన్నారి తలలో నీరు చేరిందని, దానివల్లే తల పెద్దదైందని గుర్తించి వెల్లడించారు.
శస్త్రచికిత్స చేయించాలని సూచించారు. ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ తక్షణమే చిన్నారి రెడ్డి సుహానాను బెంగళూరు నుంచి తిరుపతి స్విమ్స్ తరలించాలని అధికారులను ఆదేశించారు. స్విమ్స్‌లో శస్త్ర చికిత్స సాధ్యం కాకుంటే హైదరాబాద్‌లో మెరుగైన శస్త్ర చికిత్స చేయించేందుకు నిర్ణయించారు. బి.కొత్తకోటకు వచ్చిన సరళమ్మ స్థానిక ప్రభుత్వ వైద్యుడు అభిషేక్‌ను బెంగళూరు వెళ్లాలని సూచించారు. ఒక ఆరోగ్యమిత్రను వెంట పంపుతానని చెప్పారు. రెడ్డి సుహానాను అంబులెన్స్‌లో ఎలా తీసుకురావాలో, ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరించారు. అడ్వాన్స్ లైవ్ సేవ్ అంబులెన్స్‌ను దీనికోసం వినియోగించాలని, అందుకయ్యే ఖర్చును పీహెచ్‌సీ నిధుల నుంచి చెల్లించాలని కోరారు. బుధవారం ఉదయం 10 గంటలకల్లా రెడ్డి సుహానా స్విమ్స్‌లో ఉండాలని సరళమ్మ చెప్పడంతో తీసుకొచ్చేందుకు డాక్టర్ అభిషేక్ బెంగళూరు వెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment