సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: అవును.. మీరు చదివింది నిజమే.. పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో బిజీ అయిపోయారు. ఎవరేమనుకుంటే మాకేంటి.. అన్న రీతిలో నిబంధనలను పక్కనపెట్టి టీడీపీ సొంత పనుల్లో ఈయనా భాగస్వాములవుతున్నారు. ప్రత్యేక హోదా డిమాండ్‌తో తెలుగుదేశం పార్టీ అధిష్టానం రాష్ట్రంలోని అన్ని నగరాల్లోధర్మపోరాట సభలు నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు తొలిసభ గత నెల 30న తిరుపతిలో నిర్వహించారు. మలి సభను ఈనెల 22న విశాఖలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
పూర్తిగా పార్టీపరమైన ఈ రాజకీయ సభతో ఏమాత్రం సంబంధం లేకపోయినా.. జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, పోలీస్ కమిషనర్ టి.యోగానంద్ ఆ ఏర్పాట్లలో తలమునకలవడం చర్చనీయాంశమవుతోంది. సభా ఏర్పాట్లపై గురువారం సాయంత్రం సర్క్యూట్ హౌస్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రి గంటా శ్రీనివాసరావుల ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు కలెక్టర్, సీపీలు హాజరు కావడం చర్చకు తెరలేపింది. హోం మంత్రి చినరాజప్ప రాకతో బందోబస్తు ఏర్పాట్లు సమీక్షించేందుకు సీపీ యోగానంద్ వెళ్లారని భావించినా.. కలెక్టర్ వెళ్లడంపై మాత్రం ఆక్షేపణలు వ్యక్తమవుతున్నాయి. సభ నిర్వహణకు, జిల్లా కలెక్టర్‌కు సంబంధం ఏమిటన్న వాదనలు వినిపిస్తున్నాయి.
మరో పక్క జీవీఎంసీ ఉన్నతాధికారులు కూడా సభ ఏర్పాట్లలో ఇప్పటి నుంచే మునిగితేలుతుండటం వివాదాస్పదమవుతోంది. గతంలో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల గ్రౌండ్స్‌లోనే మహానాడు నిర్వహించి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీడీపీ ఇప్పుడు ధర్మపోరాట సభనూ అక్కడే నిర్వహించాలని నిర్ణయించడంపై కూడా భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఈ అంశంలో ఏయూ పాలకమండలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అప్పట్లో ఉన్నత విద్యామండలి ఆదేశాల మేరకే మహానాడుకు అనుమతినిచ్చామని, భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ పార్టీ సదస్సుల నిర్వహణకు అనుమతివ్వబోమని చెప్పుకొచ్చారు. దానికి విరుద్ధంగా ఇప్పుడు టీడీపీ ధర్మపోరాట సభకు అనుమతినివ్వడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment