=ప్రభుత్వానికి కలెక్టర్ ప్రతిపాదనలు
=మరిన్ని మండలాలు పెరిగే అవకాశం
=రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదం తర్వాతే ప్రకటన
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలో 14 మండలాల్లో కరువుఛాయలు నెలకొన్నట్లు జిల్లా కలెక్టర్ కె.రాంగోపాల్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపారు. 2013 ఖరీఫ్ సీజన్‌లో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉన్నా, స కాలంలో కురవకపోవడంతో పంటల దిగుబడి తగ్గింది. అదే విధంగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం 750 మిల్లీ మీటర్లు నమోదు కావాల్సి ఉంది. సాధారణంకన్నా త క్కువగా నమోదైన మండలాలను సైతం కరువు మండలాల జాబితాలో చేర్చారు. మండల గ ణాంక అధికారులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంగా జిల్లాలో పంట కోత ప్రయోగాలు చేపట్టారు. సాధారణం కన్నా పంట దిగుబడి తక్కువగా వచ్చిన మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించారు.
కరువు మండలాలు ఇవే..
2013 ఖరీఫ్ సీజన్‌లో నెలకొన్న వాతావరణ పరిస్థితుల ఆధారంగా జిల్లాలో కరువు ఛాయ లు నెలకొన్నాయి. పడమటి ప్రాంతాల్లోని బి.కొత్తకోట, పెద్దమండ్యం, కలకడ, నిమ్మనపల్లె, రొంపిచెర్ల, చౌడేపల్లె, సోమల, పుంగనూరు, వి.కోట, రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లె, కుప్పం, కేవీబీపురం మండలాలను కరువు ప్రాంతాలుగా జిల్లా అధికారులు గుర్తించి ప్రతి పాదనలు రూపొందించారు.
కరువు మండలాలు పెరిగే అవకాశం
కరువు ప్రాంతాలను గుర్తించడంలో జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. వాతావరణం, పంటల విస్తీర్ణం, సాగు విస్తీర్ణం, దిగుబడి తదితర అంశాలకు సంబంధించి ఆయా శాఖల నుంచి నివేదికలు సేకరించాల్సి ఉంది. సాధారణ పంట దిగుబడి కంటే తగ్గే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన పంట కోత ప్రయోగాల్లో తేలింది. దీనిపై జిల్లా వ్యవసాయ శాఖ మండల స్థాయిలోని పంటల సాగు, దిగుబడి పరిస్థితులపై ఇప్పటి వరకు సమగ్ర నివేదికలు అందించలేదు. ఈ నివేదికలు వస్తే కరువు మండలాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ప్రజాప్రతినిధులకు దక్కని ప్రాధాన్యం
గత ఏడాది నుంచి కరువు మండలాలను గుర్తించడానికి ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో కరువు నివారణ విపత్తుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 13 మంది సభ్యులతో కూడిన బృందం కరువు మండలాలను ప్రకటించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. జిల్లా కలెక్టర్ ద్వారా పంపిన ప్రతిపాదనలు పరిశీలించిన అనంతరం రాష్ట్ర స్థాయి కమిటీ సేకరించిన నివేదికలతో సరిపోల్చి నిబంధనల ఆధారంగా కరువు మండలాలను ప్రకటించనున్నారు. దీంతో ఈ ఏడాది కూడా కరువు మండలాల ప్రకటనలో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం నామమాత్రం కానుంది.