K.. Rangopal
-
మరో 15 మండలాల్లో కరువు
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలోని మరో 15 మండలాల్లో కరువు ఛాయలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మూడో విడత జాబితా కింద తాజాగా గుర్తించిన మండలాల వివరాలను కలెక్టర్ కె.రాంగోపాల్ ప్రభుత్వానికి సోమవారం రాత్రి ప్రతిపాదనలు పంపారు. ఫలితంగా జిల్లాలో కరువు మండలాల సంఖ్య 37 నుంచి 52కు చేరుకుంది. తొలి విడతగా 14 మండలాల్లో కరువు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 7న తుది జాబితాను ప్రభుత్వానికి పంపారు. తర్వాత మరో 23 మండలాల్లో కరువు ఛాయలు ఉన్నట్లు గర్తించిన అధికారులు ఈ నెల 11న రెండో జాబితా కింద పంపారు. తాజాగా సోమవారం రాత్రి మరో 15 మండలాల్లో కరువు నెలకొన్నట్లు మూడో జాబితా కింద ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో 66 మండలాలకుగాను 52 మండలాల్లో ఇప్పటి వరకు కరువు ఛాయలు నెలకొన్నట్లు అధికారులు గుర్తించారు. మూడో జాబితాలోని మండలాలివే ఎర్రావారిపాళెం, కురబలకోట, ఐరాల, పలమనే రు, సదుం, వి.కోట, గుర్రంకొండ, గంగవరం, పెనుమూరు,పాకాల, కార్వేటినగరం, బి.ఎన్.కండ్రిగ, చిత్తూరు, బంగారుపాళెం, పెద్దమండ్యం. మూడుసార్లు ఎందుకు పంపారు? శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా జిల్లాలోని కరువు మండలాలను గుర్తించడంలో అధికారులు విఫలమైనట్లు తెలుస్తోంది. కరవు పరిస్థితులు నెలకొన్న ప్రతి ఏటా ఒకటి లేక రెండు దఫాలుగా కరువు మండలాల జాబితాలను ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపుతుంది. అయితే ఈ ఏడాది మూడు దఫాలుగా కరువు మండలాల జాబితాలను ప్రభుత్వానికి నివేదించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరువు మండలాలను గుర్తించడంలో ప్రమాణాలు పాటించడం, తగిన సమయంలో వివిధ రకాలైన సర్వేలు చేపట్టాల్సి ఉంది. రెవెన్యూ, గణాంకాధికారులు, వ్యవసాయశాఖలు సంయుక్తంగా మండల స్థాయిలో నెలకొన్న కరువు పరిస్థితులను గుర్తించాల్సి ఉంది. తొలుత రెవెన్యూ అధికారులు పలు మండలాల్లో కరువు ఛాయలు నెలకొన్నట్లు గుర్తించాలి. దీనిని నిర్ధారించేందుకు గణాంకాధికారులు పంటకోత ప్రయోగాలను నిర్వహించాలి. అయితే ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా అధికారులు ఉద్యమబాట పట్టడంతో పంటకోత ప్రయోగాలను చేపట్టడంలో ఆలస్యమైంది. అలాగే కరువు మండలాలు గుర్తించడంలో వ్యవసాయాధికారుల పాత్ర నామమాత్రంగా మారినట్లు సమాచారం. పంట సాగు, దిగుబడి తదితర వివరాలను అందించడంలో వ్యవసాయాధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు కారణమా? దశలవారీగా కరువు మండలాలను ప్రకటించడంలో రాజకీయ ఒత్తిళ్లూ ఒక కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తమ నియోజకవర్గాల్లోని మండలాల ను కరువు ప్రాంతాలుగా ఎంపిక చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెచ్చారనే విమర్శలు లేకపోలేదు. అయితే ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన మండలాల్లో పంట నష్టపోయిన రైతులకు సాధారణ ఎన్నికలలోపు ప్రయోజనం చేకూర్చుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ 14 మండలాలు ఏ పాపం చేశాయి.. జిల్లాలో 66 మండలాలకుగాను ఇప్పటివరకు 52 మండలాల్లో కరువు ఛాయలు నెలకొన్నట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన 14 మండలాలపై సవతి ప్రేమ చూపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మండలాలన్నీ టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉండడమే కారణంగా తెలుస్తోంది. ఈ జాబితాలో రామసముద్రం, శ్రీకాళహస్తి, ఏర్పేడు, సత్యవేడు, నారాయణవనం, వరదయ్యపాళెం, నాగలాపురం, పిచ్చాటూరు, నగరి, పుత్తూరు, వడమాలపేట, నిండ్ర, విజయపురం, పెద్దపంజాణి మండలాలు ఉన్నాయి. ఇక్కడ వర్షపాతం అధికంగా ఉందని, పంటలకు నష్టం జరగలేదనేది అధికారుల వాదనగా ఉంది. -
14 మండలాల్లో కరువు!
=ప్రభుత్వానికి కలెక్టర్ ప్రతిపాదనలు =మరిన్ని మండలాలు పెరిగే అవకాశం =రాష్ట్ర స్థాయి కమిటీ ఆమోదం తర్వాతే ప్రకటన చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలో 14 మండలాల్లో కరువుఛాయలు నెలకొన్నట్లు జిల్లా కలెక్టర్ కె.రాంగోపాల్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతి పాదనలు పంపారు. 2013 ఖరీఫ్ సీజన్లో నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉన్నా, స కాలంలో కురవకపోవడంతో పంటల దిగుబడి తగ్గింది. అదే విధంగా ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు సాధారణ వర్షపాతం 750 మిల్లీ మీటర్లు నమోదు కావాల్సి ఉంది. సాధారణంకన్నా త క్కువగా నమోదైన మండలాలను సైతం కరువు మండలాల జాబితాలో చేర్చారు. మండల గ ణాంక అధికారులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు సమన్వయంగా జిల్లాలో పంట కోత ప్రయోగాలు చేపట్టారు. సాధారణం కన్నా పంట దిగుబడి తక్కువగా వచ్చిన మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించారు. కరువు మండలాలు ఇవే.. 2013 ఖరీఫ్ సీజన్లో నెలకొన్న వాతావరణ పరిస్థితుల ఆధారంగా జిల్లాలో కరువు ఛాయ లు నెలకొన్నాయి. పడమటి ప్రాంతాల్లోని బి.కొత్తకోట, పెద్దమండ్యం, కలకడ, నిమ్మనపల్లె, రొంపిచెర్ల, చౌడేపల్లె, సోమల, పుంగనూరు, వి.కోట, రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లె, కుప్పం, కేవీబీపురం మండలాలను కరువు ప్రాంతాలుగా జిల్లా అధికారులు గుర్తించి ప్రతి పాదనలు రూపొందించారు. కరువు మండలాలు పెరిగే అవకాశం కరువు ప్రాంతాలను గుర్తించడంలో జిల్లా ముఖ్య ప్రణాళిక శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. వాతావరణం, పంటల విస్తీర్ణం, సాగు విస్తీర్ణం, దిగుబడి తదితర అంశాలకు సంబంధించి ఆయా శాఖల నుంచి నివేదికలు సేకరించాల్సి ఉంది. సాధారణ పంట దిగుబడి కంటే తగ్గే అవకాశాలు ఉన్నట్లు ఇటీవల నిర్వహించిన పంట కోత ప్రయోగాల్లో తేలింది. దీనిపై జిల్లా వ్యవసాయ శాఖ మండల స్థాయిలోని పంటల సాగు, దిగుబడి పరిస్థితులపై ఇప్పటి వరకు సమగ్ర నివేదికలు అందించలేదు. ఈ నివేదికలు వస్తే కరువు మండలాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధులకు దక్కని ప్రాధాన్యం గత ఏడాది నుంచి కరువు మండలాలను గుర్తించడానికి ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో కరువు నివారణ విపత్తుల కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో 13 మంది సభ్యులతో కూడిన బృందం కరువు మండలాలను ప్రకటించడంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. జిల్లా కలెక్టర్ ద్వారా పంపిన ప్రతిపాదనలు పరిశీలించిన అనంతరం రాష్ట్ర స్థాయి కమిటీ సేకరించిన నివేదికలతో సరిపోల్చి నిబంధనల ఆధారంగా కరువు మండలాలను ప్రకటించనున్నారు. దీంతో ఈ ఏడాది కూడా కరువు మండలాల ప్రకటనలో ప్రజాప్రతినిధులకు ప్రాధాన్యం నామమాత్రం కానుంది. -
ఓటర్ల జాబితా సవరించాలి : కలెక్టర్
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నామని, అదే సమయంలో ఒకే వ్యక్తి రెండు ప్రాంతాల్లో ఓటును నమోదు చేసుకున్నట్లయితే వాటిని జాబితాలో సవరించాల్సి ఉందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.రాంగోపాల్ అభిప్రాయపడ్డారు. గురువారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటరు తన ఓటు హక్కును పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకునేందుకు వీలుగా జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 3175 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. వీటిలో మరిన్ని చేర్పులు మార్పుల కోసం రాజకీయ పార్టీలు అభ్యంతరాలు, సలహాలు తెలియజేయాలన్నారు. బూత్‌లెవల్ ఏజెంట్ల వివరాలు సైతం ఇవ్వాలని కోరారు. నవంబర్ 4న జిల్లా ఓటర్ల ముసాయిదా జాబితాను విడుదల చేస్తామని, అభ్యంతరాలు, విజ్ఞప్తులను నవంబర్ నెలాఖరు వరకు స్వీకరిస్తామన్నారు. 12, 20 తేదీల్లో గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించి ఓటరు జాబితాలోని పేర్లను సరిచూస్తామని చెప్పారు. 10, 17, 24 తేదీల్లో బూత్ లెవల్ అధికారులతో సమావేశాలు నిర్వహిస్తామన్నారు. డిసెంబర్ 12వ తేదీ వరకు వీటిపై ఆక్షేపణలు, అభ్యంతరాలు స్వీకరించి విచారణ చేపడతామ ని, 30వ తేదీన ఓటర్ల జాబితాను ఫొటో ఐడెంటిటీతో అప్డేషన్, అనుబంధ జాబితాల తయారు, ముద్రణ జరుగుతుందని చెప్పారు. 2014 జనవరి 6వ తేదీన ఓటరు తుది జాబితా విడుదల చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ బసంత్‌కుమార్, మదనపల్లె సబ్ కలెక్టర్ నారాయణ్ భరత్‌గుప్తా , డీఆర్వో శేషయ్య, చిత్తూరు, తిరుపతి ఆర్డీవోలు పెంచల్ కిషోర్, రామచంద్రారెడ్డి, బీఎస్పీ జిల్లా అధ్యక్షులు ప్రభాకర్, బీజేపీ ప్రధాన కార్యదర్శి జగదీష్‌కుమార్, టీడీపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, సీపీఐ కార్యదర్శి రామానాయుడు, సీపీఎం కార్యదర్శి చైతన్య, తహశీల్దార్లు పాల్గొన్నారు. పెరిగిన పోలింగ్ బూత్‌ల సంఖ్య జిల్లాలో పోలింగ్ బూత్‌ల సంఖ్య పెరిగింది. జిల్లావ్యాప్తంగా 14 నియోజకవర్గాల్లో 3125 పోలింగ్ బూత్‌లు ఉండగా, వీటి సంఖ్య 3175కు చేరుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను జిల్లా కలెక్టర్ కె.రాంగోపాల్ గురువారం కలెక్టరేట్లో జరిగిన రాజకీయ పార్టీల సమావేశంలో విడుదల చేశారు. నియోజకవర్గాల వారీగా పెరిగిన పోలింగ్ బూత్‌ల వివరాలు ఇలా ఉన్నాయి. తంబళ్లపల్లెలో 210 నుంచి 213 చేరుకోగా పీలేరు నియోజకవర్గంలో 221 నుంచి 230కి, మదనపల్లె నియోజకవర్గంలో 203 నుంచి 221కి, పుంగనూరు నియోజకవర్గంలో 213 నుంచి 215కు, చంద్రగిరి నియోజకవర్గంలో 263 నుంచి 270కి, చిత్తూరు నియోజకవర్గంలో 187 నుంచి 190కి, పలమనేరు నియోజకవర్గంలో 228 నుంచి 231కి, కుప్పం నియోజకవర్గంలో 205 నుంచి 210కి చేరుకున్నాయి. కాగా శ్రీకాళహస్తి, సత్యవేడు, నగరి, గంగాధరనెల్లూరు, పూతలపట్టు నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్‌లలో ఎలాంటి మార్పు లేదు. తిరుపతి నియోజకవర్గం పరిధిలో 262 పోలింగ్ బూత్‌లు ఉండగా, ఇంటి నెంబర్లు కొత్తగా ఇచ్చినందున చేర్పులు, మార్పులకు సమయం పడుతుందని ఆర్డీవో రామచంద్రారెడ్డి కలెక్టర్‌కు ఇచ్చిన నివేదికలో పేర్కొన్నారు.