చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలోని మరో 15 మండలాల్లో కరువు ఛాయలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మూడో విడత జాబితా కింద తాజాగా గుర్తించిన మండలాల వివరాలను కలెక్టర్ కె.రాంగోపాల్ ప్రభుత్వానికి సోమవారం రాత్రి ప్రతిపాదనలు పంపారు. ఫలితంగా జిల్లాలో కరువు మండలాల సంఖ్య 37 నుంచి 52కు చేరుకుంది. తొలి విడతగా 14 మండలాల్లో కరువు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 7న తుది జాబితాను ప్రభుత్వానికి పంపారు. తర్వాత మరో 23 మండలాల్లో కరువు ఛాయలు ఉన్నట్లు గర్తించిన అధికారులు ఈ నెల 11న రెండో జాబితా కింద పంపారు. తాజాగా సోమవారం రాత్రి మరో 15 మండలాల్లో కరువు నెలకొన్నట్లు మూడో జాబితా కింద ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో 66 మండలాలకుగాను 52 మండలాల్లో ఇప్పటి వరకు కరువు ఛాయలు నెలకొన్నట్లు అధికారులు గుర్తించారు.
మూడో జాబితాలోని మండలాలివే
ఎర్రావారిపాళెం, కురబలకోట, ఐరాల, పలమనే రు, సదుం, వి.కోట, గుర్రంకొండ, గంగవరం, పెనుమూరు,పాకాల, కార్వేటినగరం, బి.ఎన్.కండ్రిగ, చిత్తూరు, బంగారుపాళెం, పెద్దమండ్యం.
మూడుసార్లు ఎందుకు పంపారు?
శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా జిల్లాలోని కరువు మండలాలను గుర్తించడంలో అధికారులు విఫలమైనట్లు తెలుస్తోంది. కరవు పరిస్థితులు నెలకొన్న ప్రతి ఏటా ఒకటి లేక రెండు దఫాలుగా కరువు మండలాల జాబితాలను ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపుతుంది. అయితే ఈ ఏడాది మూడు దఫాలుగా కరువు మండలాల జాబితాలను ప్రభుత్వానికి నివేదించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరువు మండలాలను గుర్తించడంలో ప్రమాణాలు పాటించడం, తగిన సమయంలో వివిధ రకాలైన సర్వేలు చేపట్టాల్సి ఉంది.
రెవెన్యూ, గణాంకాధికారులు, వ్యవసాయశాఖలు సంయుక్తంగా మండల స్థాయిలో నెలకొన్న కరువు పరిస్థితులను గుర్తించాల్సి ఉంది. తొలుత రెవెన్యూ అధికారులు పలు మండలాల్లో కరువు ఛాయలు నెలకొన్నట్లు గుర్తించాలి. దీనిని నిర్ధారించేందుకు గణాంకాధికారులు పంటకోత ప్రయోగాలను నిర్వహించాలి. అయితే ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా అధికారులు ఉద్యమబాట పట్టడంతో పంటకోత ప్రయోగాలను చేపట్టడంలో ఆలస్యమైంది. అలాగే కరువు మండలాలు గుర్తించడంలో వ్యవసాయాధికారుల పాత్ర నామమాత్రంగా మారినట్లు సమాచారం. పంట సాగు, దిగుబడి తదితర వివరాలను అందించడంలో వ్యవసాయాధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
రాజకీయ ఒత్తిళ్లు కారణమా?
దశలవారీగా కరువు మండలాలను ప్రకటించడంలో రాజకీయ ఒత్తిళ్లూ ఒక కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తమ నియోజకవర్గాల్లోని మండలాల ను కరువు ప్రాంతాలుగా ఎంపిక చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెచ్చారనే విమర్శలు లేకపోలేదు. అయితే ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన మండలాల్లో పంట నష్టపోయిన రైతులకు సాధారణ ఎన్నికలలోపు ప్రయోజనం చేకూర్చుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఆ 14 మండలాలు ఏ పాపం చేశాయి..
జిల్లాలో 66 మండలాలకుగాను ఇప్పటివరకు 52 మండలాల్లో కరువు ఛాయలు నెలకొన్నట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన 14 మండలాలపై సవతి ప్రేమ చూపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మండలాలన్నీ టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉండడమే కారణంగా తెలుస్తోంది. ఈ జాబితాలో రామసముద్రం, శ్రీకాళహస్తి, ఏర్పేడు, సత్యవేడు, నారాయణవనం, వరదయ్యపాళెం, నాగలాపురం, పిచ్చాటూరు, నగరి, పుత్తూరు, వడమాలపేట, నిండ్ర, విజయపురం, పెద్దపంజాణి మండలాలు ఉన్నాయి. ఇక్కడ వర్షపాతం అధికంగా ఉందని, పంటలకు నష్టం జరగలేదనేది అధికారుల వాదనగా ఉంది.
మరో 15 మండలాల్లో కరువు
Published Tue, Nov 19 2013 2:45 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement