Narayanavanam
-
ఎమ్మెల్యే ఇంట్లో తీవ్ర విషాదం
సాక్షి,చిత్తూరు : చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆదిమూలం తల్లి కాంతమ్మ(86) తన స్వగ్రామం నారాయణవనం మండలంలోని భీముని చెరువులో గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ సందర్భంగా ఆదిమూలం కుటుంబానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, నారాయణస్వామి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు ప్రగాడ సంతాపం తెలియజేశారు. -
అమ్మో ! ఎంత పెద్ద కొండచిలువో
సాక్షి, నారాయణవనం(చిత్తూరు) : స్థానికంగా బుధవారం సాయంత్రం ఓ కొండచిలువ హల్చల్ చేసింది. స్థానిక పశువైద్యశాల సమీపంలో నీరులేని బావిలో రెండు నాగుపాము పిల్లలతో పాటు పెద్ద కొండచిలువను గ్రామస్తులు గుర్తించారు. బావి నుంచి బయటకు వచ్చిన కొండచిలువ పిల్ల పక్కనే ఉన్న మహమ్మద్‌కు చెందిన మేకపిల్లను మింగడానికి ప్రయత్నించింది. యజమాని చాకచక్యంతో మేకపిల్లను కాపాడి, పుత్తూరు అటవీ శాఖ అధికారులకు ఫోన్ చేశారు. వారు స్పందించకపోవడంతో కొండచిలువను సమీపంలోని అరుణానదిలో ముళ్లపొదల్లో వదిలేసినట్లు ఆయన చెప్పారు. -
నారాయణవనంలో అన్నదానానికి మంగళం
నారాయణవనం : పద్మావతి సమేత కల్యాణ వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు అన్నప్రసాదాల వితరణ కార్యక్రమానికి టీటీడీ అధికారులు మంగళం పాడారు. కొన్నేళ్లుగా నిర్వహిస్తున్న అన్నప్రసాదాల వితరణను ఈ ఏడాది ఆపివేయడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పది రోజులపాటు నిర్వహించే బ్రహ్మోత్సవాల్లో ప్రతి రోజూ మధ్యాహ్నం, రాత్రి ఆలయానికి వచ్చే భక్తులకు అన్నప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని ఆరేళ్ల క్రితం ప్రారంభించారు. తర్వాత అగస్తేశ్వర, వీరభద్ర స్వామి, శక్తి వినాయక ఆలయాల ఉత్సవాల్లోనూ వితరణ చేశారు. తిరుచానూరు నుంచి వాహనంలో సాంబారు, పెరుగన్నం తెచ్చి భక్తులకు అందించేవారు. కల్యాణ వెంకన్న ఆలయ బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం కాగా మధ్యాహ్నం అన్నప్రసాదాల కోసం ఆలయానికి వచ్చే భక్తులతో పాటు స్వామి వారి సేవకు వచ్చే భక్తులు నిరాశతో ఆలయ సమీపంలోని సమాచార కేంద్రం వద్దకు వచ్చి వెనుదిరిగారు. వేసవి తీవ్రత దృష్ట్యా తిరుచానూరులోని టీటీడీ క్యాంటీన్ నుంచి తెచ్చే సాంబారు, పెరుగన్నం పాడైపోతోందని ఆలయ అధికారి నాగరాజు వివరణ ఇచ్చారు. ఆలయంలో స్వామి వారి దర్శనానంతరం భక్తులకు ప్రసాదాలను అందజేస్తున్నామని తెలిపారు. -
కైలాసకోనలో కామకేళి
తిరుపతి: చిత్తూరు జిల్లా నారాయణవనం మండలం కైలాసకోనలోని ఏపీ టూరిజం అతిథిగృహంలో వ్యభిచార కార్యకలాపాలు వెలుగుచూడడంతో పర్యాటక శాఖలో కలకలం రేగింది. అక్కడ చాలాకాలంగా వ్యభిచారం జరుగుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. గెస్ట్ హౌస్ సిబ్బందే చెన్నై నుంచి విటులను రప్పించి ఈ వ్యవహారం సాగిస్తున్నట్టు తెలుస్తోంది. వ్యభిచార ముఠా పట్టుబడిన గది బుధవారం తెల్లవారుజామున చెన్నైకి చెందిన ఓ యువకుడు బుక్ చేసుకున్నాడు. తర్వాత మరో ఇద్దరు యువకులు దిగారు. పుత్తూరుకు చెందిన ఇద్దరు యువతులు అనంతరం గదిలోకి ప్రవేశించారు. మధ్యాహ్నం వరకు రాసలీలలు సాగినా టూరిజం సిబ్బంది పట్టించుకోలేదు. 'సాక్షి' కథనంతో టూరిజం శాఖ స్పందించింది. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. -
మరో 15 మండలాల్లో కరువు
చిత్తూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: జిల్లాలోని మరో 15 మండలాల్లో కరువు ఛాయలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో మూడో విడత జాబితా కింద తాజాగా గుర్తించిన మండలాల వివరాలను కలెక్టర్ కె.రాంగోపాల్ ప్రభుత్వానికి సోమవారం రాత్రి ప్రతిపాదనలు పంపారు. ఫలితంగా జిల్లాలో కరువు మండలాల సంఖ్య 37 నుంచి 52కు చేరుకుంది. తొలి విడతగా 14 మండలాల్లో కరువు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ నెల 7న తుది జాబితాను ప్రభుత్వానికి పంపారు. తర్వాత మరో 23 మండలాల్లో కరువు ఛాయలు ఉన్నట్లు గర్తించిన అధికారులు ఈ నెల 11న రెండో జాబితా కింద పంపారు. తాజాగా సోమవారం రాత్రి మరో 15 మండలాల్లో కరువు నెలకొన్నట్లు మూడో జాబితా కింద ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. జిల్లాలో 66 మండలాలకుగాను 52 మండలాల్లో ఇప్పటి వరకు కరువు ఛాయలు నెలకొన్నట్లు అధికారులు గుర్తించారు. మూడో జాబితాలోని మండలాలివే ఎర్రావారిపాళెం, కురబలకోట, ఐరాల, పలమనే రు, సదుం, వి.కోట, గుర్రంకొండ, గంగవరం, పెనుమూరు,పాకాల, కార్వేటినగరం, బి.ఎన్.కండ్రిగ, చిత్తూరు, బంగారుపాళెం, పెద్దమండ్యం. మూడుసార్లు ఎందుకు పంపారు? శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా జిల్లాలోని కరువు మండలాలను గుర్తించడంలో అధికారులు విఫలమైనట్లు తెలుస్తోంది. కరవు పరిస్థితులు నెలకొన్న ప్రతి ఏటా ఒకటి లేక రెండు దఫాలుగా కరువు మండలాల జాబితాలను ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపుతుంది. అయితే ఈ ఏడాది మూడు దఫాలుగా కరువు మండలాల జాబితాలను ప్రభుత్వానికి నివేదించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కరువు మండలాలను గుర్తించడంలో ప్రమాణాలు పాటించడం, తగిన సమయంలో వివిధ రకాలైన సర్వేలు చేపట్టాల్సి ఉంది. రెవెన్యూ, గణాంకాధికారులు, వ్యవసాయశాఖలు సంయుక్తంగా మండల స్థాయిలో నెలకొన్న కరువు పరిస్థితులను గుర్తించాల్సి ఉంది. తొలుత రెవెన్యూ అధికారులు పలు మండలాల్లో కరువు ఛాయలు నెలకొన్నట్లు గుర్తించాలి. దీనిని నిర్ధారించేందుకు గణాంకాధికారులు పంటకోత ప్రయోగాలను నిర్వహించాలి. అయితే ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా అధికారులు ఉద్యమబాట పట్టడంతో పంటకోత ప్రయోగాలను చేపట్టడంలో ఆలస్యమైంది. అలాగే కరువు మండలాలు గుర్తించడంలో వ్యవసాయాధికారుల పాత్ర నామమాత్రంగా మారినట్లు సమాచారం. పంట సాగు, దిగుబడి తదితర వివరాలను అందించడంలో వ్యవసాయాధికారులు విఫలమయ్యారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రాజకీయ ఒత్తిళ్లు కారణమా? దశలవారీగా కరువు మండలాలను ప్రకటించడంలో రాజకీయ ఒత్తిళ్లూ ఒక కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో తమ నియోజకవర్గాల్లోని మండలాల ను కరువు ప్రాంతాలుగా ఎంపిక చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులపై ఒత్తిడి తెచ్చారనే విమర్శలు లేకపోలేదు. అయితే ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన మండలాల్లో పంట నష్టపోయిన రైతులకు సాధారణ ఎన్నికలలోపు ప్రయోజనం చేకూర్చుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. ఆ 14 మండలాలు ఏ పాపం చేశాయి.. జిల్లాలో 66 మండలాలకుగాను ఇప్పటివరకు 52 మండలాల్లో కరువు ఛాయలు నెలకొన్నట్లు అధికారులు గుర్తించారు. మిగిలిన 14 మండలాలపై సవతి ప్రేమ చూపుతున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ మండలాలన్నీ టీడీపీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉండడమే కారణంగా తెలుస్తోంది. ఈ జాబితాలో రామసముద్రం, శ్రీకాళహస్తి, ఏర్పేడు, సత్యవేడు, నారాయణవనం, వరదయ్యపాళెం, నాగలాపురం, పిచ్చాటూరు, నగరి, పుత్తూరు, వడమాలపేట, నిండ్ర, విజయపురం, పెద్దపంజాణి మండలాలు ఉన్నాయి. ఇక్కడ వర్షపాతం అధికంగా ఉందని, పంటలకు నష్టం జరగలేదనేది అధికారుల వాదనగా ఉంది. -
విద్యార్థి ఆత్మహత్య
నారాయణవనం(చిత్తూరు), న్యూస్‌లైన్ :మండలంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన డిప్లొమా విద్యార్థి బి.క్రాంతి కుమార్(17) సమీపంలోని వ్యవసాయ బావిలో ఆదివారం సాయత్రం శవమై తేలాడు. మృతుడు శ్రీకాకుళం జిల్లా సోంపేట వాసిగా గుర్తించారు. ఎస్ఐ ప్రసాదరావు కథనం మేరకు..నారాయణవనం మండలంలోని సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల అనుబంధ పాలిటెక్నిక్ కళాశాలలో డిప్లమో రెండో ఏడాది క్రాంతి కుమార్ చదువుతున్నాడు. స్థానికంగా హాస్టల్లోనే ఉంటున్నాడు. ఇతను కళాశాలకు సమీపం ఎరికంబట్టు పంచాయతీ పరిధిలోని వ్యవసాయ బావిలో ఆదివారం సాయంత్రం శవమై తేలాడు. రైతులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుడు సిద్ధార్థ కళాశాల విద్యార్థిగా గుర్తించారు. కళాశాల ప్రిన్సిపాళ్లు చంద్రశేఖర్‌రెడ్డి, కుమార్‌బాబు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కళాశాలల ప్రిన్సిపాళ్లు ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ సమైక్యాంధ్ర ఉద్యమం కారణంగా క్రాంతికుమార్ జూలై 15న కళాశాల నుంచి ఇంటికి వెళ్లిపోయాడన్నారు. ఈ నెల 14వ తేదీన కళాశాలకు వచ్చి హాస్టల్లో ఉంటున్నాడని తెలిపారు. క్రాంతికుమార్ గురించి అతని తల్లి కరుణాదేవి శనివారం వాకబు చేసిందన్నారు. ఈ క్రమంలో ఇతను తరగతులకు హాజరుకావడం లేదని, మూడు రోజులుగా హాస్టల్లోనూ లేడని తెలిసిందన్నారు. కాంత్రికుమార్ తనతో గొడవ పడ్డాడని, కొన్ని రోజులుగా మాట్లాడడం లేదని, మీరే చూసుకోవాలని అతని తల్లి కరుణాదేవి తమకు ఎస్ఎంఎస్ పంపిందని వివరించారు. ఈ క్రమంలో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసిందన్నారు. క్రాంతికుమార్ మృతి సమాచారాన్ని కుటుంబ సభ్యులకు తెలియజేశామని ఎస్ఐ ప్రసాదరావు తెలిపారు. ఇతను ఆత్మహత్య చేసుకుని ఉంటాడని, కుటుంబ సభ్యులను, సహచర విద్యార్థులను విచారిస్తే విషయం తెలుస్తుందని అన్నారు.