భోజనం వడ్డిస్తున్న ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్ ఇంతియాజ్, కమిషనర్ ప్రసన్న వెంకటేష్
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): నగర పాలక సంస్థ, అమృత హస్తం సంయుక్త ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచితంగా భోజనం అందించేందుకు ఉద్ధేశించిన ‘గోరుముద్ద’ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. సాంబమూర్తి రోడ్డులోని అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ఆవరణలో ‘గోరుముద్ద’ కార్యక్రమాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌తో కలిసి కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ప్రారంభించారు. నిరుపేదలకు ఉచితంగా భోజనం అందించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన వీఎంసీ, అమ్మహస్తం చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులను అభినందించారు.
తొలిరోజు భోజనం అందించేందుకు సహకరించిన జస్టిస్ ఆర్.మాధవరావును ప్రత్యేకంగా అభినందించారు. నిరుపేదలకు ఆపన్నహస్తం అందించాలని కోరారు. వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ నగర పరిధిలో దాతలు ఎవరైనా ముందుకు వచ్చి నేరుగా భోజనం సమకూరిస్తే పేదలకు అమృతహస్తం ట్రస్ట్ పంపిణీ చేస్తుందన్నారు. హోటల్స్, కల్యాణ మండపాలు, ఇతర వేదికల్లో జరిగే శుభాకార్యాల్లో మిగిలిన భోజనం పారేయకుండా ఫోన్ (9246472100) చేసి ట్రస్ట్‌కు సమాచారం అందిస్తే వాటిని తీసుకొచ్చి ‘గోరుముద్ద’ కార్యక్రమంలో పేదలకు అందించడం జరుగుతుందన్నారు. అమృతహస్తం ట్రస్ట్ ఎంతో కాలంగా ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాన్ని గుర్తించి వీఎంసీ తరఫున అవసరమైన వసతులు కల్పించిందని తెలిపారు. సెంట్రల్ ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ గోరుముద్ద పేరుతో పేదలకు భోజన సౌకర్యం కల్పించడం మంచి కార్యక్రమం అన్నారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యమన్నారు. అనంతరం స్వయంగా పేదలకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో కన్జూమర్ కోర్టు జడ్జి ఆర్ మాధవరావు, ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు దారా కరుణశ్రీ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్సు) యు.శారదాదేవి, వీఎంసీ అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment