free meal
-
ఫ్రీ మీల్స్ కోసం అమ్మడి కక్కుర్తి.. చివరికి ఏమైందంటే?
ఆన్లైన్లో, రెస్టారెంట్‌లోగానీ ఆర్డర్ చేసిన ఫుడ్‌లో ఏదైనా లోపం ఉన్నా, లేదా ఇంకేమైనా వెంట్రుకలు లాంటి అవాంఛిత పదార్థాల్ని, వస్తువులను గుర్తించినా, వెంటనే సంబంధిత డెలివరీ సంస్థకు ఫిర్యాదు చేయడం, దానికి వాళ్లు సారీ చెప్పడం, లేదా ఫ్రీ మీల్ ఆఫర్ చేయడం ఇదంతా మనకు తెలిసిన కథే. అయితే ఇలాంటి ఫ్రీ మీల్స్ కోసం ఆశపడిన ఒక అమ్మడు అడ్డంగా బుక్ అయిపోయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక రెస్టారెంట్లు కస్టమర్లు ఫిర్యాదులు ఆధారంగా వారికి నష్టపరిహారం ఫ్రీ మీల్స్ ఆఫర్ చేస్తాయి. న్యూయార్క్ పోస్ట్ ప్రకారం కథనం ప్రకారం ఇలా ఉచిత భోజనం కక్కుర్తి పడిన బ్రిటీష్ మహిళ రెస్టారెంట్‌ను మోసం చేయాలని ప్లాన్ చేసింది. ఇంగ్లాండ్‌లోని బ్లాక్‌బర్న్‌లోని ప్రసిద్ధ తినుబండారం అయిన అబ్జర్వేటరీలో భోజనం చేస్తూ ఆహారంలో జుట్టు వచ్చిందంటూ హడావిడి చేసింది. దీంతో హోటల్ యజమాని మహిళ బీఫ్ రోస్ట్ డిన్నర్‌ను తిరిగి ఆఫర్ చేశారు. అయితే, నిఘా కెమెరాలున్నాయన్న సంగతిని ఆ మహిళ మర్చిపోయింది. కానీ రెస్టారెంట్ యజమాని మాత్రం మర్చిపోలేదు. అందుకే పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇచ్చే తమ హోటల్లో ఇలా జరిగిందేమిటబ్బా అని ఆందోళన చెందిన అతను ఆ తరువాత అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించాడు. దీంతో అసలు విషయం తెలిసి ఖంగుతిన్నాడు. వీడియోలో మహిళ జుట్టును తీసి తన భాగస్వామి సగం తిన్న ప్లేట్లో ఉంచడం క్లియర్ కనిపించింది.టామ్ క్రాఫ్ట్ దీనిపై సోషల్ మీడియాలోపోస్ట్ పెట్టడంతో ఇది వైరల్‌గా మారింది. బిజినెస్ బాబులూ బీ అలర్ట్ జాగ్రత్త ఇలాంటి వాళ్లూ కూడా ఉంటారు అంటూ ఫేస్బుక్లో CCTV ఫుటేజీని షేర్ చేశాడు. ఇది చాలా అసహ్యంగా అనిపించిందని, కేవలం 15.88 డాలర్లు(రూ. 1300) కోసం ఇంతకు దిగజారతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతేకాదు తమకు ఫైవ్ స్టార్ ఫుడ్ హైజీన్ రేటింగ్ ఉందనీ, అన్ని ఆహార భద్రతా మార్గదర్శకాలకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని తెలిపాడు. నిజంగా సీసీటీవీ ఫుటేజీని గమనించకపోతే ఆమె ఆరోపణతో తన వ్యాపారం, ప్రతిష్ట గంగలో కలిసిపోయేదిగా అంటూ వాపోయాడు.. -
స్వాతంత్ర్యం రాకపూర్వం నుంచి నేటికీ నిరంతర అన్నదానం..
సాక్షి, వేటపాలెం(ప్రకాశం): గొల్లపూడి రాధాకృష్ణయ్య దాతృత్వం.. ముందుచూపు. 88 ఏళ్లగా పేదవిద్యార్ధుల ఆకలి తీరుస్తుంది. స్వాతంత్య్రంరాక పూర్వమే ప్రారంభించిన హాస్టల్ నేటికీ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. కష్టపడి చదువు కొనే విద్యార్ధులకు కులమతాలకు అతీతంగా పట్టెడన్నం పెట్టాలన్న సంకల్పానికి భవిష్యత్‌లోను డోకాలేని విదంగా శాశ్వత నిధి ఏర్పాటు చేసిన రాధాకృష్ణయ్యకు విద్యార్ధులు నిత్యం జ్యోహార్లు అర్పిస్తుంటారు. వేటపాలెంలో 1921 సంవత్సరంలో ఏర్పాటు చేసిన రావుసాహెబ్ బండ్ల బాపయ్య శెట్టి పాఠశాలకు చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వందలాది మంది విద్యార్ధులు వస్తుండేవారు. రవాణా సౌకర్యాలు అంతగా లేని రోజుల్లో ఉదయం పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు తిరిగి ఇంటికి వెళ్లే అవకాశం లేక భోజనం కోసం ఇబ్బందులు పడుతుండేవారు. దీన్ని గొల్లపూడి రాధాకృష్ణయ్య గమనించారు. పేద విద్యార్ధులకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దుస్తులు వ్యాపారం నిర్వహించే ఈయన మద్రాసులోని షావుకారు పేటలో ఉన్న హిందూ థీయోసాఫికల్ స్కూల్ ప్రధానోపాద్యాయుడు రంగస్వామి అయ్యర్ ప్రేరణతో 1933 సంవత్సరంలో మొదటి సారిగా వేటపాలెంలో బిబిహెచ్ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు బోజనం సౌకర్యం కల్పించారు. మొదటి హాస్టల్ నిర్వహణకు తన వ్యాపారం నుంచి నిధులు సమకూర్చేవారు. కానీ తన అనంతరం కూడా విద్యార్థులు ఇబ్బందులు పడకూడదన్న ఆలోచన ట్రష్టును ఏర్పాటు చేసేలా చేసింది. శాశ్వత భవనం, పర్నిచర్‌తో పాటు మూలనిధిని కూడా ఏర్పాటు చేయడంతో పాటు 88 సంవత్సరాలుగా విద్యార్ధులు కడుపు నిండా బోజనం తింటున్నారు. రాధాకృష్ణయ్య అనంతరం ఆయన దత్తపుత్రుడు గొల్లపూడి సీతారం 1977లో హాస్టల్ నిర్వహణ బాద్యతలను చేపట్టి సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. భోజనం ఎవరికి పెడతారంటే... ప్రతి ఏడాది బండ్ల బాపయ్య శెట్టి కళాశాల్లో అడ్మిషన్లు జరుగుతాయి. కళాశాల్లో చేరిన విద్యార్థులకు హాస్టల్ నిర్వాహకులు ఒక పద్యం నేర్పిస్తారు. ఈ పద్యం తప్పుపోకుండా చెప్పిన పేద విద్యార్థులను గుర్తించి వారికి బోజనం కోసం టోకేన్లు అందిస్తారు. ఈ టోకెన్ పొందిన విద్యార్థులకు ప్రతి రోజు ఉదయం పాఠశాలకు వచ్చే ముందు వారు పొందిన టోకెన్లను హాష్టల్ వద్ద ఏర్పాటు చేసిన బాక్సులో వేసిరావాల్సి ఉంటుంది. టోకెన్లు ఆదారంగా హాస్టల్లో బోజనం తయారుచేస్తారు. ప్రతి రోజు 6 నుంచి ఇంటర్మీడియట్ చదువుకోనే 100 నుంచి 150 మంది విద్యార్థులు హాష్టల్లో భోజనం చేస్తుంటారు. బోజనానికి ముందుగా ప్రార్ధన చేయాల్సి ఉంటుంది. -
వాట్సప్ చేస్తే ఉచిత భోజనం: తెలంగాణ పోలీసుల శ్రీకారం
సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ కట్టడికి తెలంగాణ పోలీసులు విశేష కృషి చేస్తున్నారు. ఒకవైపు కర్ఫ్యూ పకడ్బందీగా అమలుచేస్తూనే కరోనా వ్యాప్తి చెందకుండా కట్టడి చర్యలు ముమ్మరంగా చేస్తున్నారు. అందులో భాగంగా మరో ముందడుగు వేసి కరోనా బాధితులకు అండగా నిలబడేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా బాధితులకు ఉచితంగా భోజనం అందించే కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుట్టారు. ఆహారం కావాల్సిన కరోనా బాధితులు వాట్సప్‌లో మెసేజ్ చేస్తే చాలు. ఆ వివరాలు చదవండి. సత్యసాయి సేవా సంస్థ, స్విగ్గీ, బిగ్ బాస్కెట్, హోప్ సంస్థలతో కలిసి తెలంగాణ పోలీసులు ‘సేవా భోజనం’ పేరిట ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భోజనం అవసరమైన కరోనా బాధితులు ఉదయం 7 గంటలలోపు 77996 16163 నంబర్‌కు వాట్సప్‌లో వివరాలు పంపించాలి. హోం ఐసోలేషన్‌లో ఉన్నవారికి మాత్రమే ఈ సదుపాయం కల్పిస్తున్నారు. వీరిలో చిన్నారులు, వృద్ధులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలంగాణ పోలీస్ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమాన్ని డీఐజీ స్వాతిలక్రా ఆయా సంస్థల ప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. కరోనా బాధితులకు సద్దుదేశంతో ప్రారంభించిన ఈ కార్యక్రమాన్నియితే దుర్వినియోగం చేయొద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. చదవండి: జొమాటో సంచలనం: నోయిడాలో అమల్లోకి.. చదవండి: ఒకే రోజు లాక్డౌన్ ప్రకటించిన రెండు రాష్ట్రాలు చదవండి: తెలుగు రాష్ట్రాల సీఎంలకు ప్రధాని ఫోన్ Telangana State Police by taking support from @ssssoindia, @leadlife_india, @SwiggyCares, @bigbasket_com & Hope Organization has launched a “Free Food” (lunch) for COVID patients who are in isolation at their doorstep. pic.twitter.com/DemeRRhLR8 — Telangana State Police (@TelanganaCOPs) May 6, 2021 -
నిరుపేదలకు ‘గోరుముద్ద’
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): నగర పాలక సంస్థ, అమృత హస్తం సంయుక్త ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచితంగా భోజనం అందించేందుకు ఉద్ధేశించిన ‘గోరుముద్ద’ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. సాంబమూర్తి రోడ్డులోని అలంకార్ సెంటర్ ధర్నా చౌక్ వద్ద ఉన్న అన్న క్యాంటీన్ ఆవరణలో ‘గోరుముద్ద’ కార్యక్రమాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌తో కలిసి కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ప్రారంభించారు. నిరుపేదలకు ఉచితంగా భోజనం అందించేందుకు ఉద్దేశించిన ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సేవా దృక్పథంతో ముందుకు వచ్చిన వీఎంసీ, అమ్మహస్తం చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులను అభినందించారు. తొలిరోజు భోజనం అందించేందుకు సహకరించిన జస్టిస్ ఆర్.మాధవరావును ప్రత్యేకంగా అభినందించారు. నిరుపేదలకు ఆపన్నహస్తం అందించాలని కోరారు. వీఎంసీ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ నగర పరిధిలో దాతలు ఎవరైనా ముందుకు వచ్చి నేరుగా భోజనం సమకూరిస్తే పేదలకు అమృతహస్తం ట్రస్ట్ పంపిణీ చేస్తుందన్నారు. హోటల్స్, కల్యాణ మండపాలు, ఇతర వేదికల్లో జరిగే శుభాకార్యాల్లో మిగిలిన భోజనం పారేయకుండా ఫోన్ (9246472100) చేసి ట్రస్ట్‌కు సమాచారం అందిస్తే వాటిని తీసుకొచ్చి ‘గోరుముద్ద’ కార్యక్రమంలో పేదలకు అందించడం జరుగుతుందన్నారు. అమృతహస్తం ట్రస్ట్ ఎంతో కాలంగా ఈ విధమైన కార్యక్రమాలు నిర్వహిస్తోందని చెప్పారు. ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాన్ని గుర్తించి వీఎంసీ తరఫున అవసరమైన వసతులు కల్పించిందని తెలిపారు. సెంట్రల్ ఎమ్మెల్యే విష్ణు మాట్లాడుతూ గోరుముద్ద పేరుతో పేదలకు భోజన సౌకర్యం కల్పించడం మంచి కార్యక్రమం అన్నారు. పేదల ఆకలి తీర్చడమే లక్ష్యమన్నారు. అనంతరం స్వయంగా పేదలకు భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో కన్జూమర్ కోర్టు జడ్జి ఆర్ మాధవరావు, ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు దారా కరుణశ్రీ, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్సు) యు.శారదాదేవి, వీఎంసీ అధికారులు పాల్గొన్నారు. -
సీఎం ఔదార్యానికి ఫిదా..
పనాజీ: గోవా సీఎం ప్రమోద్ సావత్ తన ఔదార్యాన్ని చాటుకున్నారు. ముంబై విమానాశ్రయంలో గురువారం రాత్రి 9.30 గంటలకు గోవాకు బయలుదేరాల్పిన ఎయిర్ ఇండియా విమానం టేకాఫ్ తీసుకునేందుకు తీవ్ర జాప్యమైంది. ఆ విమానం తెల్లవారుజామున 3. 30 గంటలకు గమ్యస్ధానం చేరుకుంది. విమానం గోవాకు చేరుకోవడంలో తీవ్ర జాప్యం నెలకొనడంతో ప్రయాణికులు ఇబ్బందులకు లోనయ్యారు. ఈ విమానంలో గోవా ఫార్వర్డు పార్టీ నాయకుడు కేతన్ భాటికర్ కూడా ప్రయాణిస్తున్నారు. ఢిల్లీలో ఉన్న గోవా ముఖ్యమంత్రికి కేతన్ భాటికర్ విమాన అలస్యం విషయం గురించి రాత్రి 1.13 గంటలకు ఫోన్లో వివరించారు. సీఎం ప్రమోద్ వెంటనే స్పందించి ప్రయాణీకులకు భోజనాలు సమకూర్చారు. తర్వాత రాత్రి 1.27 గంటలకు సీఎం స్వయంగా ఫోన్ చేసి మరో 30 నిమిషాల్లో విమానం బయలుదేరుతుందని సమాచారం అందించారని భాటికర్ తెలిపారు. గోవా సీఎం స్పందించిన తీరు పట్ల విమాన ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేశారు. -
వేద పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తులు
మే 31 వరకు గడువు ఉచిత భోజన, వసతి సదుపాయాలు సాక్షి,తిరుమల: తెలుగు రాష్ట్రాల్లోని టీటీడీ వేదపాఠశాలల్లో 2016-2017 విద్యా సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. కీసరగుట్ట, చిలుకూరు, ఐ.భీమవరం, విజయనగరం, నల్గొండ, కోటప్పకొండలోని వేదపాఠశాల్లో ప్రవేశాలుంటాయి. నిర్దిష్ట వయసు, విద్యార్హతలు, పుట్టినతేదీ రుజువు చేసే ధ్రువపత్రాల నకళ్లు, సొంత చిరునామాతో కూడిన పోస్టుకార్డును జతచేసి మే 31వ తేదీలోపు పంపాలని టీటీడీ ప్రజా సంబంధాల విభాగం సోమవారం ఒక ప్రకటనలో కోరింది. ఋగ్వేదం-సకలశాఖ, శుక్లయజుర్వేదం-కాణ్వశాఖ, సామవేదం-రాణాయనీయశాఖ, కృష్ణ యజుర్వేదం-తైత్తిరీయశాఖ కోర్సుల కాలపరిమితి 12 సంవత్సరాలు. అధర్వణవేదం-శౌనకశాఖ కాలపరిమితి 7 సంవత్సరాలు. ఈ కోర్సుల్లో చేరే విద్యార్థులు 5వ తరగతి ఉత్తీర్ణులై 2004, జూలై 1వ నుంచి 2006 జూన్ 30వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. ఇక అపస్తంబ పౌరహిత్యం (స్మార్తం), శైవాగమం, పాంచరాత్రాగమం, దివ్య ప్రబంధం కోర్సుల కాలపరిమితి 8 సంవత్సరాలు. ఈ కోర్సుల్లో చేరదలచుకున్న విద్యార్థులు 01-07-2002 నుండి 30-06-2004 మధ్య జన్మించి, ఏడో తరగతి విద్యార్హత కలిగి ఉండాలి. ఈ కోర్సుల్లో అధ్యయన కాలంలో భోజనం, వసతి ఉచితంగా కల్పిస్తారు. ఒక్కొక్క వేద విద్యార్థికి రూ.3 లక్షలు, ఒక్కొక్క ప్రబంధ, ఆగమ్మ, స్మార్త విద్యార్థికి రూ.లక్ష బ్యాంకులో డిపాజిట్ చేసి, కోర్సు పూర్తికాగానే వడ్డీతో కలిపి మొత్తం విద్యార్థికి చెల్లిస్తారు. అభ్యర్థులు తమ సొంత ఖర్చులతో రాత, మౌఖిక పరీక్షలకు హాజరుకావాలి. ఇతర వివరాలకు www.tirumala.org లేదా www.tirupati.org టీటీడీ వెబ్సైట్లకు సంప్రదించవచ్చు. విద్యార్థులు చేరదలచుకున్న వేద పాఠశాలను ముందుగా నిర్ధారించుకుని అక్కడికి మాత్రమే పూర్తి చేసిన దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఆయా వేదపాఠశాలల చిరునామాలు: కీసరగుట్ట: ప్రిన్సిపాల్, ఎస్వీ వేద సంస్కృత పాఠశాల, కీసరగుట్ట, కీసర మండలం, రంగారెడ్డి జిల్లా-501301- సెల్ :8790720410 ఐ.భీమవరం: ప్రిన్సిపాల్, ఎస్వీ వేదపాఠశాల, ఐ.భీమవరం, ఆకివీడు మండలం, పశ్చిమగోదావరి, 534235- సెల్: 9848355906. చిలుకూరు: ప్రిన్సిపాల్, ఎస్వీ వేదపాఠశాల, చిలుకూరు పోస్టు, మోయింబాద్ మండలం, రంగారెడ్డి జిల్లా,501504, సెల్: 8790720410 విజయగనరం: ప్రిన్సిపాల్, ఎస్వీ వేదశాల, శ్రీమత రామాయణ ప్రాంగణం, రామనారాయణ సారికా దగ్గర, విజయనగరం జిల్లా, 535004. సెల్:8790720460. నల్లగొండ: ప్రిన్సిపాల్, ఎస్వీ వేద పాఠశాల, ఎఎంఆర్ఎస్ఎల్బీసీ క్యాంపస్, పానగల్, రామగిరి, నల్లగొండ జిల్లా- 508002, సెల్: 9866862395 కోటప్పకొండ: ప్రిన్సిపాల్, ఎస్వీ వేదపాఠశాల, కోటప్పకొండ, వయా సతుకూరు, గువయ్యపాళెం పోస్టు, గుంటూరు జిల్లా-522540, సెల్: 9000527367 -
'డంకిన్ డోనట్స్' కోసం క్యూ కట్టారు
హైదరాబాద్ : ఫ్రీగా వస్తే ఎవరైనా సరే ఏదీ వదిలిపెట్టరు. అదీ ఫుడ్... ఉచితంగా ఇస్తేమంటే ఇంకేంటి పండుగే. అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకునేందుకు జనాలు భారీగా ఎగబడ్డారు. దాంతో సుమారు రెండు కిలోమీరట్ల వరకూ క్యూ ఏర్పడింది. ఎక్కడా అనుకుంటున్నారా? కొత్తగా ఏదైనా షాపు ఓపెన్ చేస్తే ...కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆఫర్లు పెడతారు. 'డంకిన్ డోనట్స్' కూడా ఈ పద్ధతి ఫాలో అయ్యింది. మొదటి 300మందికి ఉచితంగా ఫుడ్ సర్వ్ చేస్తామని యాజమాన్యం ప్రకటించటంతో చిన్నా, పెద్దా, ఆడ, మగా అందరూ క్యూ కట్టేశారు. ఇంతకీ ఈ షాపు ఎక్కడనుకుంటున్నారా? బంజారాహిల్స్ రోడ్ నెంబర్.1లో 'డంకిన్ డోనట్స్' రెస్టారెంట్. శనివారం నుంచి ప్రారంభిస్తున్నామని రెస్టారెంట్ యాజమాన్యం ఒకరోజు ముందుగానే ప్రచారం చేపట్టింది. ముందుగా వచ్చిన 300మందికి ఉచితంగా సర్వ్ చేస్తామని. దాంతో ఉదయం 5 గంటల నుంచే షాప్ ముందు పడిగాపులు పడ్డారు. చాంతాడంత క్యూ ఏర్పడటంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు కూడా డ్యూటీలోకి దిగారు. కొసమెరుపు ఏంటంటే... ఈ క్యూలో బడాబాబులే ఎక్కువగా ఉండటం విశేషం.