
కలెక్టరేట్ ఎదుట 5న భారీ ధర్నా
అల్లూరు (బిట్రగుంట): ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన హామీలు వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ రైతులు, మహిళలు, చేనేత కార్మికులు, నిరుద్యోగులతో కలిసి ఈ నెల 5న కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించనున్నట్లు వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి అన్నారు. అల్లూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
ముఖ్య అతిథిగా హాజరైన ప్రసన్నకుమార్‌రెడ్డి కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు పనితీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. మోసపూరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అధికారం చేపట్టిన తర్వాత ప్రజలను పూర్తిగా విస్మరించారన్నారు. రైతు రుణమాఫీకి రూ.87 వేల కోట్లు, డ్వాక్రా సంఘాల రుణమాఫీ కోసం రూ.14 వేల కోట్లు అవసరం ఉందన్నారు. ఇంత వరకూ ఒక్కపైసా కూడా మాఫీ చేయలేదన్నారు. ఈ జాప్యంతో రైతులు, డ్వాక్రా సంఘాలు రూ.25వేల కోట్లు వడ్డీ కట్టాల్సిన దుస్థితి నెలకొందన్నారు.
ఈ పరిస్థితుల్లో రుణమాఫీ కోసం బడ్జెట్‌లో కేవలం రూ.500 కోట్లు మాత్రమే కేటాయించిన బాబు తన సహజ నైజమైన వంచనను ప్రదర్శించారన్నారు. అదే విధంగా ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగులకు ప్రతి నెలా రూ. 2వేలు నిరుద్యోగ భృతి అంటూ మేనిఫెస్టోలో ప్రదర్శించిన బాబు ఇంత వరకూ ఆ ఊసే ఎత్తడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 10 లక్షల మంది పింఛన్లు రద్దు చేశారని ఆరోపిం చారు. ఎన్నికల మేనిఫెస్టోలో, సభల్లో మొత్తం 300 వాగ్దానాలు చేసిన ఆయన ఇంత వరకూ ఒక్కహామీ కూడా నెరవేర్చలేదని స్పష్టం చేశారు. బాబు హామీలు వెంటనే అమలు చేయాలని కోరుతూ కలెక్టరేట్ ఎదుట నిర్వహించే ధర్నా కార్యక్రమానికి ప్రతిఒక్కరూ తరలి రావాలని కోరారు.
టీడీపీకి తొత్తులుగా అధికారులు
జిల్లాలో అధికారులు టీడీపీకి, ప్రభుత్వానికి తొత్తులుగా మారి అనుకూలంగా పని చేస్తూ వైఎస్సార్ సీపీ కార్యకర్తలను, ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారని ప్రసన్నకుమార్‌రెడ్డి అరోపించారు. జిల్లాలో 40 శాతం మంది అధికారులు ఇదే విధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. తహశీల్దార్‌లు, ఎంపీడీఓలు, ఎస్సైలు, సీఐలు, డీ ఎస్పీలు చాలా అతిగా ప్రవర్తిస్తున్నారన్నారు. అధికారులు ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. ‘ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ప్రభుత్వాలు శాశ్వతం కాదు. ప్రజలు ఆశీర్వదిస్తే అధికారం వస్తుంది. తిరుగుబాటు చేస్తే ప్రభుత్వాలు పడిపోతాయి. అధికారులంటే మాకు చాలా గౌరవం’ అని ఆయన అన్నారు. అధికారులు నిజాయితీగా పని చేయాలని కోరారు. కార్యకర్తలకు పూర్తిస్థాయిలో అండగా ఉంటామన్నారు. అదే విధంగా త్వరలో కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో మండలంలో 75 మంది కార్యకర్తలకు పదవులు వస్తాయని తెలిపారు. కార్యకర్తలంతా ప్రజలకు అండగా నిలిచి సమస్యలపై పోరాటం చేయాలని కోరారు.
అల్లూరు అభివృద్ధికి కృషి : ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి
ఎన్నికల సమయంలో అండగా నిలిచిన అల్లూరు అభివృద్ధికి నిర్మాణాత్మకంగా కృషి చేయనున్నట్లు కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్‌రెడ్డి అన్నారు. కార్యకర్తలకు, ప్రజలకు నిరంతరం అం దుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. సొంత నిధులు వెచ్చించైనా అల్లూరును అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్ దండా కృష్ణారెడ్డి, ఎంపీపీ మంజుల, జెడ్పీటీసీ సభ్యురాలు దండా పద్మావతీ, సర్పంచ్‌లు చంద్రలీల, ప్రసాద్, డేవిడ్, నాయకులు మన్నెమాల సుకుమార్‌రెడ్డి, రాంబాబు, ఆళ్ల సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.