
అదితీ నువ్వు నియంతవై రావాలి..
విశాఖ: లేత గులాబి రంగు గౌనులో ముద్దుముద్దుగా పలుకుతూ అందర్నీ అలరించిన చిన్నారి అదితి ఇక లేదన్నవార్త ప్రతి ఒక్కరినీ కలచివేసింది. తిరిగి చిరునవ్వులు చిందిస్తూ అందరి ముందుకు తిరిగి వస్తుందా అనే అనుమానం వెంటాడినా... వాస్తవాన్ని జీర్ణించుకోవడానికి ప్రతి గుండె నిరాకరించింది. తమ కంటిపాప క్షేమంగా తిరిగొస్తుందన్న ఆ కుటుంబం ఆశలు ఆవిరైపోయాయి.
విశాఖపట్నంలో సెప్టెంబర్ 24న ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడి గల్లంతైన ఆరేళ్ల చిన్నారి అదితి విజయనగరం జిల్లా భోగాపురం మండలం దిబ్బలపాలెం తీరంలో విగతజీవిగా మారిపోయింది. తీరని విషాదాన్ని నింపిన ఈ ఉదంతంపై సోషల్ మీడియాలో పలువురి స్పందన ఇలా ఉంది.
నిన్న అయిలాన్...నేడు అదితి
తీరం వేరు కావచ్చు...ప్రాంతం వేరు కావచ్చు
ఈ కనుపాపలను అలా దూరం చేయాలన్న మనసు నీకెలా వచ్చింది
ఓ సముద్రుడా నీవు మింగేసి...అలా నీలో ఉంచుకున్నా...
అయిలాన్, అదితీ ఎక్కడో ఒక చోట బతికే ఉంటారన్న ఆశతో మేం బతుకుతాం
కానీ ఇలా ఒడ్డున చేర్చి మమ్మల్ని ఎందుకు జీవచ్చవాలుగా మారుస్తావ్
ఇలా బతకడం కంటే మమ్మల్నీ నీవే తీసుకెళ్ళు...
కానీ మా శవాలను మాత్రం ఈ పసిపాపల్లా ఒడ్డకు చేర్చకే...ప్లీజ్.
అమ్మా అదితి.....
క్షమించు నాన్నా ఈ పాడు సమాజాన్ని...
నిరుపేద ఎంపీలకు జీతాలు పెంచడంపై ఉన్న శ్రద్ధ ఓపెన్ నాలాలకు కప్పు ఏర్పాటుపై లేదు దీనికి....
నిర్లక్షంతో నీ చిరునవ్వులు చిదిమేసి, నీ వాళ్ళకు సరైన ఆఖరి చూపు... నీ మీద పడి, బాధ తీరా ఏడ్చే అవకాశం లేకుండా చేసిన "మనవాళ్ళ"ను ఉరితీసినా ఆ శిక్ష వాళ్లు చేసిన పాపానికి, చూపిన నిర్లక్షానికి క్షమాభిక్ష లాంటిదే.....
ఇక రావద్దమ్మా ఈ స్వార్థ లోకానికి....
నీ వాళ్ళ కోసం రావాలని అనిపిస్తే......
మా కోసం ఈ వ్యవస్థను మార్చే, నియంతవై రా....