- అక్రమార్కులకు టీడీపీ నేతల అండదండలు
- ఓ ప్రజాప్రతినిధి కనుసన్నల్లో బుద్దాలపాలెం తవ్వకాలు
- తవ్వకం వైపు చూడొద్దంటూ ఆ ప్రజాప్రతినిధి ‘సింహ’గర్జన
- పట్టించుకోని రెవెన్యూ అధికారులు
కోనేరుసెంటర్ (బుద్దాలపాలెం) : బందరు మండలం, బుద్దాలపాలెంలో అనుమతి లేకుండా చేపల చెరువుల తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన టీడీపీ ప్రజాప్రతినిధి ఈ చెరువుల తవ్వకాలకు నేతృత్వం వహిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. చెరువుల తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నా రెవెన్యూ అధికారులు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. అధికారులు పట్టించుకోకపోవడం, టీడీపీ నేతల అండదండలు మెండుగా ఉండటంతో గ్రామానికి చెందిన ఆ ప్రజాప్రతినిధి చెరువుల తవ్వకాలకు నాయకత్వం వహిస్తూ పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
గ్రామంలోని తాళ్లపాలెం కాలువ గట్టు వెంబడి ఇరవై రోజులుగా చెరువుల తవ్వకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. నిన్నటి వరకూ పచ్చగా కళకళలాడిన పంటపొలాలు నేడు చేపల చెరువులుగా మారుతున్నాయి. అక్రమంగా చెరువు తవ్వకాలకు పాల్పడే వారు అధికారుల కళ్లు గప్పి గుట్టుచప్పుడు కాకుండా పనులు పూర్తి చేస్తుంటారు. కానీ ఈ ప్రజాప్రతినిధి మాత్రం జంకూబొంకు లేకుండా అందరికీ తెలిసేలా దగ్గరుండి మరీ తవ్వకాలు జరిపిస్తున్నాడు. అదేమని ఎవరైనా ప్రశ్నిస్తే ‘ప్రభుత్వమే మాది. మంత్రి మా మనిషి. ఎవరేం చేస్తారు’ అంటూ ‘సింహ’గర్జన చేస్తున్నారని గ్రామస్తులు పేర్కొం టున్నారు. పంట పొలాల మధ్య చెరువుల తవ్వకాల కారణంగా తమ పొలాలకు ఊట నీరు దిగటంతో తీరని నష్టం జరుగుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
అధికారులపై నేతల ఒత్తిడి
గ్రామంలో చెరువు తవ్వకాలు జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న రెవెన్యూ అధికారి ఒకరు ఇటీవల సదరు ప్రజాప్రతినిధిని హెచ్చరించినట్లు సమాచారం. అయితే ఆ ప్రజాప్రతి నిధి టీడీపీ ముఖ్య నేతలను కలిసి రెవెన్యూ అధికారులు చెరువు తవ్వకాలను అడ్డుకోకుండా చూడాలని కోరారని తెలిసింది. దీంతో ఆ పార్టీ ముఖ్య నేత ఒకరు సంబంధిత రెవెన్యూ అధికారికి ఫోన్ చేసి ‘వాళ్లు మావాళ్లే చూసీ చూడనట్లు ఊరుకోండి’ అని ఆదేశించారని, దీంతో సదరు రెవెన్యూ సిబ్బంది చేసేదేమీ లేక ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఇటీవల రెవెన్యూ సిబ్బంది చెరువు తవ్వకాల వద్దకు వెళ్లి వివరాలు సేకరిస్తుండగా ఆ ప్రజాప్రతినిధి గ్రామంలోని తన అనుచరులైన కొంత మందితో ఆ ప్రాంతంలో చెరువు తవ్వుకోవడం వలన తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పించి వెనక్కి పంపినట్లు తెలుస్తోంది.