అక్రమార్కులకు..బంగారు బాట
- స్మగ్లర్ల అడ్డాగా వైజాగ్ ఎయిర్‌పోర్టు
- ఏడాదిలో నాలుగుసార్లు రూ.1.80కోట్ల బిస్కెట్ల పట్టివేత
- తాజాగా శంషాబాద్ విమానాశ్రయంలో పసిడి తరలింపుపై నిఘా పెంపు
- తప్పించుకునేందుకు విశాఖను కేంద్రంగా ఎంచుకుంటున్న అక్రమార్కులు
సాక్షి, విశాఖపట్నం: ప్రశాంత విశాఖ నగరం రకరకాల నేరాలకు అడ్డాగా మారుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వైజాగ్ ఎయిర్‌పోర్టు క్రమక్రమంగా బంగారం అక్రమ రవాణాకు అడ్డాగా మారుతోంది.ఇక్కడి నుంచి దుబాయ్‌కు ఏకైక అంతర్జాతీయ విమాన సర్వీసు ఉండడంతో పసిడి అక్రమార్కులు ఈ విమానం ద్వారా ఎయిర్‌పోర్టు నుంచి సులువుగా బంగారం దారి మళ్లించేస్తున్నారు.
చెన్నయ్, హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో నిఘా పెరగడంతో పసిడి దొంగలు ప్రత్యామ్నాయంగా పెద్దగా నిఘా ఉండని వైజాగ్ ఎయిర్‌పోర్టును వ్యాపారానికి కేంద్రంగా ఎంచుకుంటున్నారు. రానురాను ఇక్కడి నుంచి అక్రమ రవాణా పెరిగిపోతోంది. గడిచిన ఏడాదిలో ఇప్పటివరకు నాలుగుసార్లు రూ.1.80 కోట్ల విలువైన బంగారం పట్టుబడింది. విశాఖపట్నం ఎయిర్‌పోర్టు నుంచి విదేశాలకు వెళ్లే విమానాలు చాలా తక్కువ. అందులోనూ దుబాయ్‌కు వెళ్లే ఏకైక సర్వీసు గతేడాది ప్రారంభమైంది.
ఇది కూడా నేరుగా కాకుండా విశాఖ-హైదరాబాద్-దుబాయ్ మీదుగా వెళ్తుంది. దీంతో విశాఖ నుంచి నిత్యం అనేకమంది ప్రయాణికులు వచ్చి పోతుంటారు. కొందరు అక్రమార్కుల కన్ను ఈ సర్వీసుపై పడింది. తిరుగు ప్రయాణంలో దుబాయ్ విమానం హైదరాబాద్ మీదుగా వస్తుండడంతో పసిడి అక్రమార్కులకు మంచి వరంగా మారుతోంది. దుబాయ్ విమానం హైదరాబాద్‌లో దిగగానే పసిడి రవాణా చేసే వారి తరఫు వ్యక్తి హైదరాబాద్ నుంచి విశాఖకు రావడానికి దుబాయ్ విమానం టికెట్ తీసుకుంటున్నారు.
తీరా ఫ్లైట్ విశాఖకు రాగానే సరకు హైదరాబాద్‌లో విమానం ఎక్కిన వ్యక్తికి కట్టబెడుతున్నారు. విశాఖలో విమానం దిగిన వెంటనే కేవలం దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణిలకులను మాత్రమే కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఎక్కిన ప్రయాణికులపై నిఘా పెద్దగా ఉండడంలేదు. దీన్ని అడ్డంగా పెట్టుకుని పసిడిని విశాఖ ఎయిర్‌పోర్టునుంచి సులువుగా తరలించేస్తున్నారు.
విశాఖ నుంచి దుబాయ్ సర్వీసు మొదలైన గతేడాదినుంచి ఇప్పటివరకు మొత్తం నాలుగుసార్లు దఫదఫాలు రూ.25లక్షలు, రూ.32లక్షలు, 2 కేజీల విలువైన రూ.60లక్షలు, 2.15 కేజీల విలువైన 61.02లక్షల సరకును పట్టుకున్నారు.అంటే పట్టుబడని సరకు ఇంకా ఎంతుంటుందో మరి.