కడప కల్చరల్, న్యూస్‌లైన్ : జిల్లాలోని గండికోట పర్యాటక ఉత్సవాలను త్వరలో నిర్వహించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. ఈ ఉత్సవాలు డిసెంబరులో నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఇది నిజంగా జిల్లావాసులు శుభవార్తగానే భావించవచ్చు. కానీ ప్రభుత్వం అడగకనే ఇచ్చిన ఈ వరం జిల్లాపై అభిమానంతో కాదని, రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఇచ్చిన తాయిలమేనని మేధావులు భావిస్తున్నారు. 2012 ఆగస్టులో రాష్ట్రంలోని 12 పర్యాటక ప్రాంతాల్లో ప్రతిచోట మూడురోజులపాటు పర్యాటక ఉత్సవాలను నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
ఈ మేరకు 12 ప్రాంతాల్లోనూ షెడ్యూలు విడుదల చేశారు. అందులో జిల్లాకు ప్రాధాన్యత లేకపోవడంతో భారత జాతీయ కళా వారసత్వ పరిరక్షణ సంస్థ (ఇంటాక్) ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకువె ళ్లడంతో పాటు సంబంధిత రాష్ట్ర అధికారులు, మంత్రులకు కూడా విజ్ఞప్తులు పంపారు. ఎమ్మెల్సీ షేక్ హుస్సేన్ సంబంధిత మంత్రితో ఫోన్‌లో సంప్రదించి జిల్లాలో కూడా పర్యాటక ఉత్సవాలు నిర్వహించేందుకు ఒప్పించారు. గండికోటతోపాటు రాజంపేటలో కూడా ఒకరోజు ఉత్సవం నిర్వహించి ముగింపు ఉత్సవాలను కడప నగరంలో నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందించి ఏర్పాట్లు చేశారు.
ఎమ్మెల్సీ అడ్డుపుల్ల
ఈ దశలో కలెక్టరేట్‌లో జరిగిన ఓ సమావేశానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ హాజరై ప్రస్తుతం జిల్లాలో కరువు ఉండగా ఈ ఉ త్సవాలు ఎందుకని అడ్డుపుల్ల వేయ డం తో అధికారులు పునరాలోచనలో పడ్డా రు. ఉత్సవాలకు కేటాయించిన రూ.12లక్షలతో కరువు తీరేది కాదని, ఉత్సవాలు జరిపితే జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు అభివృద్ధే చెందే అవకాశముందని పర్యాటక అభిమానులు, మేధావులు ఎంత విన్నవించుకున్నా చెవిటి వాని ముందు శంఖమే అయింది. అధికారులు కూడా ఉత్సవాలు చేస్తారో లేదో స్పష్టం చేయలేకపోయారు. మరో నాలుగు రోజుల్లో ఉత్సవాలు నిర్వహించాల్సి ఉండగా కార్యక్రమాన్ని నిరవధికంగా వాయిదా వేశామని జిల్లా అధికారులు ప్రకటన చేశారు. పరిస్థితులు చక్కబడ్డాక వీలువెంబడి ఉత్సవాలు నిర్వహిస్తామని ప్రకటించినా ఆ తర్వాత దాని ఊసేలేదు.
ఇది తాయిలమే..
దాదాపు చిన్న ఉద్యమం చేసి సాధించుకున్న గండికోట పర్యాటక ఉత్సవాలను అసంబద్దమైన కారణాల వల్ల రద్దుచేసి ఇప్పుడు నిర్వహించేందుకు ముందుకు రావడం కేవలం ఎన్నికల నేపథ్యమేనని జిల్లా పర్యాటక ప్రియులు భావిస్తున్నారు. ఈ ఉత్సవాలు ఎన్నికల తాయిలమేనని, అయినా ఉత్సవాల నిర్వహణ తమకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోందని పేర్కొంటున్నారు.
త్వరలో గండికోట పర్యాటక ఉత్సవాలు
Published Thu, Nov 7 2013 2:44 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement