
వాణిజ్యపరంగానే హైదరాబాద్ అభివృద్ధి: టి.జీవన్‌రెడ్డి
జగిత్యాల(కరీంనగర్), న్యూస్‌లైన్ : రాష్ట్రంలో 60 ఏళ్లలో సీమాంధ్ర పాలకుల వల్ల హైదరాబాద్ నగరంతోపాటు రంగారెడ్డి జిల్లా వాణిజ్యపరంగా మాత్రమే అభివృద్ధి చెందిందని, ఆ రెండు ప్రాంతాల్లోని ప్రజలు అభివృద్ధి చెందలేదని మాజీ మంత్రి టి.జీవన్‌రెడ్డి అన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాల మండలం తిప్పన్నపేట గ్రామ సమీపంలో నిర్వహించిన రాజీవ్‌గాంధీ జయంత్యుత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
సీమాంధ్రలో ప్రతి జిల్లాకు జిల్లా కార్యాలయాలుంటే రంగారెడ్డి జిల్లాలో మాత్రం జిల్లా కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోందని తెలిపారు. అక్కడున్న జిల్లా కార్యాలయాన్ని అప్పటి సీఎం చంద్రబాబు జాతీయస్థాయి ఐటీఐకి అప్పగించి రెండు ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను మాత్రం వాణిజ్య వ్యాపారవేత్తలకు అప్పజెప్పిన ఘనుడని విమర్శించారు.
సీమాంధ్ర నాయకులే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూములు కొనుగోలు చేసి అభివృద్ధి చెందారే తప్ప తెలంగాణ ప్రజలను మాత్రం అభివృద్ధి చెందనివ్వలేదని పేర్కొన్నారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల వల్లే దేశంలో బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీలు అభివృద్ధి చెందారని, ప్రస్తుతం సోనియాగాంధీ తెలంగాణ నిర్ణయాన్ని ప్రకటించి తెలంగాణ ప్రజల కోసం మాటతప్పని నాయకురాలిగా చరిత్రలో నిలబడతారని పేర్కొన్నారు.