సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో కమిషనర్ సోమేశ్‌కుమార్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన హాజరైన తొలి సమావేశంలోనే సభ్యులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఫలితంగా మనస్తాపం చెందిన ఆయన వాకౌట్ చేయడం.. మేయర్ తదితరులు నచ్చజెప్పడంతో తిరిగి ఆయన సమావేశానికి హాజరవడం.. వెరసి రెండు గంటల పాటు హైడ్రామా నడిచింది. శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సమావేశం సజావుగానే సాగినప్పటికీ.. సాయంత్రం రహదారులు, కాంట్రాక్టర్లకు సంబంధించిన అంశాలపై సభ్యులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. కమిషనర్ సైతం వారి ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. జీహెచ్‌ఎంసీలో తగినంతమంది కాంట్రాక్టర్లు లేకపోవడం.. రహదారుల సమస్యకు తీసుకుంటున్న చర్యలు, తదితర అంశాలను సైతం వివరించారు. అయినప్పటికీ సంతృప్తి చెందని సభ్యులు అధికారుల పనితీరును తప్పుబట్టారు.
రెయిన్‌బజార్ కార్పొరేటర్ ఖాజాబిలాల్ అహ్మద్(ఎంఐఎం) మాట్లాడుతూ.. కమిషనర్ వచ్చి రెండు నె లలైనా ఇంతవరకు ఏ పని చేయలేదని.. మరో రెండు నెలలాగితే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని అప్పుడు కనీసం ఫోన్ కూడా ఎత్తరని ఆవేశంగా అన్నారు. దీంతో కలత చెందిన కమిషనర్ సోమేశ్‌కుమార్ మౌనంగా సభ నుంచి వెళ్లిపోయారు. సాయంత్రం 5.30 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంతకుముందు భోజన విరామానికి ముందు సైతం బిలాల్, కమిషనర్ తన చాంబర్ విస్తరణకు మాత్రం రూ. 9 లక్షలతో పనులు చేయించుకున్నారని వ్యాఖ్యానించారు. రహదారుల పనులకు సంబంధించి పార్టీలకతీతంగా కాంగ్రెస్, టీడీపీ, ఎంఐఎంల ఫ్లోర్‌లీడర్లతో సహా సభ్యులు కమిషనర్‌ను టార్గెట్‌గా చేసుకొని మాట్లాడారు. కాంగ్రెస్ పక్ష నాయకుడు దిడ్దిరాంబాబు మాట్లాడుతూ.. రోడ్ల మరమ్మతులకు నిధులు మంజూరు చేయాలంటే.. గూగుల్ మ్యాప్స్ ద్వారా ఎక్కడ రోడ్డు వేస్తారో చూపమంటున్నారని అన్నారు. సదరు రోడ్డు తాతల తండ్రుల పుట్టుపూర్వోత్తరాలు కావాలంటున్నారన్నారు.
టీడీపీ పక్ష నాయకుడు సింగిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. కమిషనర్ వచ్చినప్పటి నుంచీ పనులు, మంజూర్లు లేకుండా కేవలం మీటింగ్‌లకే పరిమితమయ్యారని, ఫైలు పంపితే ‘స్పీక్’, ‘డిస్కస్’ అని రాయడం తప్ప మంజూరు చేయడం లేదని విరుచుకుపడ్డారు. కార్పొరేటర్లు లేఖలిస్తే మూడు రోజుల్లోగా నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. రెండు నెలలైతే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే, ఇతర అధికారులు సైతం ఎన్నికల విధుల్లో నిమగ్నమవుతారని, అప్పుడిక పనులు జరగవన్నారు. కాంట్రాక్టర్లకు సంబంధించిన చర్చ సందర్భంగా ఎంఐఎం ఫ్లోర్‌లీడర్ నజీరుద్దీన్ మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లపై ఎవరికీ కంట్రోల్ లేదన్నారు.
ఇదే క్రమంలో బిలాల్ కమిషనర్ నుద్దేశించి మాట్లాడుతూ.. పనులు చేయరని.. అరచేతిలో వైకుంఠం చూపుతున్నారని తీవ్రంగా అనడంతో నొచ్చుకున్న కమిషనర్ వెళ్లిపోయారు. వేదనకు గురై తాను వెళ్లిపోతున్నట్లు సెక్రటరీ ద్వారా మేయర్‌కు సమాచారమిచ్చినట్లు తెలిసింది. కమిషనర్ వెళ్లిపోవడంతో అధికారులంతా కూడా ఆయన వెనకే వెళ్లిపోయారు. కమిషనర్ ‘వాకౌట్’తో పలువురు సభ్యులు కమిషనర్ ‘డౌన్‌డౌన్’ , షేమ్ షేమ్ అంటూ నినాదాలు చేశారు. కమిషనర్‌పై వ్యక్తిగత కారణంతో కొందరు సభ్యులు ఇరుకునపెట్టి ఆయనను మానసికంగా గాయపరిచారని బీజేపీ పక్షనాయకుడు బంగారి ప్రకాశ్ ఆరోపించారు.
రెండు గంటల హైడ్రామా
కమిషనర్ బయటకు వెళ్లిపోవడంతో ఏం చేయాలో తోచని మేయర్ కూడా తన స్థానం నుంచి లేచిపోయేందుకు సిద్ధమవగా కార్పొరేటర్లు అడ్డుకున్నారు. తర్జనభ ర్జనల అనంతరం .. సభకు స్వల్ప విరామం ప్రకటించి కమిషనర్‌తో మాట్లాడేందుకు వెళ్లారు. అనంతరం పార్టీ ముఖ్యులతో, ఫ్లోర్‌లీడర్లతో మాట్లాడారు. కమిషనర్‌తో స్పెషల్ కమిషనర్ నవీన్‌మిట్టల్, అడిషనల్ కమిషనర్ వెంకట్రామిరెడ్డి తదితరులు సమాలోచనలు జరిపారు. కమిషనర్‌కు నచ్చజెప్పారు. దాదాపు రెండు గంటల అనంతరం 7.15 గంటలకు తిరిగి కమిషనర్ రావడానికి అంగీకరించడంతో సభ మళ్లీ సమావేశమైంది. ఈ సందర్భంగా మేయర్ మాజిద్‌హుస్సేన్ మాట్లాడుతూ.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆశిస్తున్నానన్నారు.
చిన్న అపోహ వల్ల ఇలాంటి ఘటన జరిగిందంటూ.. కార్పొరేటర్లు ఎవరినీ నొప్పించవద్దన్నారు. అటు కమిషనర్, ఇటు కార్పొరేటర్ల గౌరవానికి భంగం కలగకుండా ఉండేందుకు టీమ్‌గా కలిసి పనిచేసేందుకు కృషి చేస్తానన్నారు. తిరిగి ఇలాంటి పరిస్థితి వస్తే ‘చైర్’(మేయర్)కు సమాధానం చెప్పాలన్నారు. సభను వాయిదా వేసిన మేయర్ తిరిగి సోమవారం ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని ప్రకటించారు. కమిషనర్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ.. ఇది కుటుంబ గొడవ వంటిదని వ్యాఖ్యానించారు. సమస్యను సామరస్యంగా పరిష్కరించుకుంటామని, భవిష్యత్తులో ఇలాంటి వివాదాలకు తావు లేకుండా పనిచేస్తానన్నారు. అందరూ గర్వపడేలా అభివద్ధి పనులు చేసి చూపుతామన్నారు.
కమిషనర్ వాకౌట్ తొలిసారి కాదు
జీహెచ్‌ఎంసీ జనరల్ కౌన్సిల్ సమావేశం నుంచి కమిషనర్ వాకౌట్ చేయడం ఇదే తొలిసారి కాదు. గతంలో సమీర్ శర్మ కమిషనర్‌గా ఉన్నప్పుడు సైతం కార్పొరేటర్లతో జరిగిన వివాదంతో వాకౌట్ చేసి వెళ్లిపోయారు.
కమిషనర్ వాకౌట్
Published Sun, Dec 22 2013 3:49 AM | Last Updated on Sat, Sep 2 2017 1:50 AM
Advertisement
Advertisement