- సిమ్ కార్డు ఇవ్వని పాత కమిషనర్
- పాత తేదీలతో ఫైళ్లపై సంతకాలు!
- చెక్కులను, క్యాష్ పుస్తకాలను స్వాధీనం చేసుకున్న నూతన కమిషనర్
మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : మచిలీపట్నం మున్సిపాలిటీ పాత, కొత్త కమిషనర్ల మధ్య ‘సెల్ పంచాయతీ’ హల్‌చల్ చేస్తుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా ఉన్న అధికారగణంలో ఇది తీవ్ర చర్చనీయాంశమయ్యింది. వివరాల్లోకి వెళితే ై ఇక్కడ మున్సిపల్ కమిషనర్‌గా పనిచేసిన ఎస్.శివరామకృష్ణకు హెదరాబాద్‌లోని డీఎంఏ కార్యాలయానికి బదిలీ అయింది. గత జనవరి 27వ తేదీన మున్సిపాలిటీ నూతన కమిషనర్‌గా ఏ మారుతిదివాకర్ బాధ్యతల్ని స్వీకరించారు.
ఈయన బాధ్యతలు స్వీకరించి దాదాపు 20 రోజులవుతున్నా పాత కమిషనర్ శివరామకృష్ణ ప్రభుత్వం కేటాయించిన సెల్ సిమ్‌ను నూతన కమిషనర్‌కు అప్పగించలేదు. సహజంగా ఏ అధికారి బదిలీ అయినా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అధికారికి ఈ సిమ్‌ను ఇచ్చేస్తారు. కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన మారుతిదివాకర్ వద్ద ఈ సిమ్ లేకపోవటంతో పలు సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు పట్టణ ప్రజలు ఈ ఫోన్ నంబర్‌కు కాల్ చేస్తుంటే స్విచ్‌ఆఫ్ డైలర్ టోన్ వస్తోంది. దీంతో నూతన కమిషనర్ ఫోన్ నంబర్ తెలియక సమస్యలపై ఫిర్యాదు చేయాలని భావించే పట్టణ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల మధ్య ఏమైనా విభేదాలు ఉంటే వారువారు చూసుకోవాలే కానీ తమను ఇబ్బందులకు గురి చేయకూడదు కదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పాత కమిషనర్ తీరుపై చర్చ :
బదిలీపై వెళ్లిన పాత కమిషనర్ శివరామకృష్ణ తీరుపై పలువురు మున్సిపల్ ఉద్యోగులతో పాటు పట్టణ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడకు నూతన కమిషనర్‌గా వేరే వ్యక్తి వస్తున్నాడని తెలిసిన ఆయన వచ్చే కమిషనర్‌కు కనీసం ఒక్క అటెండర్‌ను లేకుండా చేశాడని చర్చించుకుంటున్నారు. ఆయనకు అటెండర్‌లుగా పని చేసిన గణేష్, సాంబశివరావుకు పదోన్నతులు కల్పించి రెవెన్యూ విభాగానికి బదిలీ చేశారు. తమకు పదోన్నతులు ఇచ్చారనే కారణంతో వీరిద్దరూ కమిషనర్ ఛాంబర్‌లో ఉన్న పలు పుస్తకాలను, వస్తువులను, చివరికి కమిషనర్ సీటుపై ఉండే టర్కీ టవల్‌ను సైతం లేకుండా తీసేశారు.
నూతన కమిషనర్‌గా మారుతీదివాకర్ బాధ్యతలు స్వీకరించే సమయానికి ఆయన ఛాంబర్ బోసిపోయేలా చేశారనే విమర్శలున్నాయి. నూతన కమిషనర్‌కు కనీసం అంటెండర్‌లు లేకుండా చేయటంతో వేరే విభాగాల్లో పని చేసే వారిని ఈయన అటెండర్లుగా నియమించుకున్నారు. అలాగే మునిసిపాలిటీకి సంబంధించిన పలు ఫైళ్లపై పాత కమిషనర్ ఇప్పటికీ పాత తేదీలను వేస్తూ సంతకాలు చేస్తున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. వీటితో పాటు ఇటీవల ఆయన పలువురికి పాత తేదీలతో చెక్కులను ఇచ్చారనే వాదనలున్నాయి. ఈ నేపధ్యంలోనే అకౌంటెంట్ వద్ద ఉన్న చెక్, క్యాష్ పుస్తకాలను నూతన కమిషనర్ మారుతీదివాకర్ స్వాధీనపర్చుకున్నారు. అలాగే కార్యాలయంలో ఉన్న సీసీ కెమేరాలకు అను సంధానం చేసిన ఆన్‌లైన్ లింక్‌ను పొందుపర్చిన ల్యాప్‌టాప్ పాత కమిషనర్ శివరామకృష్ణ వద్దే ఉందని చెబుతున్నారు.
సెల్‌సిమ్ ఇంకా ఇవ్వలేదు, మారుతీదివాకర్, కమిషనర్ :
కమిషనర్‌గా పనిచేసి బదిలీ అయిన శివరామకృష్ణ ఇంకా సెల్‌ఫోన్‌సిమ్ ఇవ్వలేదు. దీంతో పర్సనల్ ఫోన్ నంబర్‌నే ఉపయోగిస్తున్నా. ఉన్నతాధికారులు, ప్రజలు తనకు ఫోన్ చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. చెక్కులు పాత తేదీలతో బ్యాంక్‌లకు వెళుతున్నాయనే వాదనలు రావటంతో చెక్‌బుక్‌లను అకౌంటెంట్ నుంచి తీసుకుని నా వద్దే ఉంచాను.