దుబ్బాక, న్యూస్‌లైన్: తెలంగాణ కోసం మరో బలిదానం జరిగింది. టీ బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు కుట్రలకు పాల్పడుతుండటంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో దుబ్బాకలో విషాదం అలుముకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. దుబ్బాకకు చెందిన వంగ శేఖర్(29) నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లాడు. ఆదివారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా గంభీర్‌రావుపేట మండలం మానేరులో శవమై తేలాడు. తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు తెలపడం లేదన్న వార్తలు అతణ్ణి కలచివేశాయి.
దీంతో మానేరు ప్రాజెక్టు వద్దకు వెళ్లాడు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులకు, బంధువులకు ఫోన్ చేశాడు. వీరు తెలంగాణ రావడం ఖాయమని, ఆత్యహత్య చేసుకోవద్దని సూచించారు. కానీ శేఖర్ ఫోన్ కట్ చేసినట్లు సమాచారం. నాలుగు రోజులుగా మానేరు ప్రాజెక్టు వద్ద శేఖర్ ఆచూకీ కోసం గాలించారు. ఆదివారం మధ్యాహ్నం మానేరులో శేఖర్ మృతదేహం బయటపడింది. సమాచారం తెలుసుకున్న మృతుడి తల్లి రుక్కవ్వ, బంధువులు ఘటనా స్థలానికి వెళ్లారు.
మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు కూడా మానేరు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిరిసిల్లకు తరలించారు. ఆదివారం రాత్రి మృతదేహాన్ని దుబ్బాకకు తెచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శేఖర్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడు. గతంలో తడిపై కేసులు కూడా నమోదయ్యాయి. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు.
దుబ్బాకలో విషాదం
శేఖర్ మరణ వార్త తెలియగానే దుబ్బాకలో విషాద ఛాయలు అలముకున్నాయి. శనివారం వరకు శేఖర్ బతికే ఉంటాడని భావించిన దుబ్బాక ప్రజలు, అతని మిత్రులు చనిపోయాడని తెలియడంతో కన్నీరుమున్నీరయ్యారు.
నేడు దుబ్బాక బంద్
తెలంగాణ కోసం ప్రాణాలు వదిలిన వంగ శేఖర్ మృతికి సంతాపకంగా టీఆర్‌ఎస్ నాయకులు సోమవారం దుబ్బాక బంద్ కు పిలుపునిచ్చారు. ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో శేఖర్ పాత్ర చాలా విలువైందని కొనియాడారు. అతని మృతి తనకు దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమని ఇలాంటి నేపథ్యంలో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన సూచించారు. బంద్‌కు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
శేఖర్ మృతి బాధాకరం
శేఖర్ మృతి తెలంగాణ ఉద్యమానికి తీరని లోటు. అతని మరణం బాధించింది. రాష్ట్ర ప్రక్రియ సాగుతున్న తరుణంలో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. - కొత్త ప్రభాకర్‌రెడ్డి టీఆర్‌ఎస్ నాయకుడు
ముదిరాజ్ యువసేనా సంతాపం
తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన శేఖర్‌కు తెలంగాణ ముదిరాజ్ యువసేన సంతాపం ప్రకటించింది.
తెలంగాణ కోసం మరో బలిదానం
Published Sun, Feb 9 2014 11:53 PM | Last Updated on Tue, Nov 6 2018 7:53 PM
Advertisement
Advertisement