manair project
-
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఫౌంటేన్.. 150 మీటర్ల ఎత్తుతో నీరు పైకి
సాక్షి, కరీంనగర్: మానేరు తీరాన్ని సుందరంగా తీర్చిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్) పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే రిటెయినింగ్ వాల్ నిర్మాణం వేగంగా సాగుతున్న క్రమంలో ఫౌంటేన్‌కు సంబంధించిన పనులు సమాంతరంగా ఊపందుకున్నాయి. ఉత్తర తెలంగాణకు ముఖద్వారంగా ఉన్న మానేరు వంతెనల నడుమ ఏర్పాటు చేస్తున్న ఈ బృహత్తర ప్రాజెక్టు.. కరీంనగర్ పర్యాటకానికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకువస్తుందని ప్రభుత్వం ధీమాగా ఉంది. అందుకే, ఈ ప్రాజెక్టు పనులను మంత్రి గంగుల కమలాకర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తాజాగా సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్ కూడా ఈ ప్రాజెక్టు పురోగతిపై నిరంతర సమాచారం తెప్పించుకుంటున్నారు. ఈ ప్రాజెక్టులో హైలైట్‌గా నిలిచే ఫౌంటేన్ పనులకు ఈనెల 26వ తేదీన మంత్రి భూమి పూజ చేయనున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి ఎంఆర్ఎఫ్ ప్రాజెక్టును పూర్తి చేసి, సీఎం చేతుల మీదుగా జాతికి అంకితం చేయాలన్న సంకల్పంతో జిల్లా మంత్రి,అధికారులు పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఫౌంటేన్.. కరీంనగర్లో ఇన్స్టాల్ చేయబోయే ఫౌంటేన్ ప్రపంచంలోనే మూడోఅతిపెద్దది కావడం విశేషం. మొదటిది దక్షిణ కొరియాలోని సియోల్‌లో, రెండోది చైనాలోని షాంఘైలో మూడోది మన కరీంనగర్‌లోనే కావడం గమనార్హం. నీటి మీద 100 మీటర్ల ఎత్తున నిర్మించనున్న ఈ ఫౌంటేన్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రాత్రిపూట అందమైన రంగులు చిమ్మే లైటింగ్‌తోపాటు, సంగీతానికి అనుగుణంగా 150 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తుతో నీరు పైకి చిమ్మడం పర్యాటకులను ముగ్గుదలను చేస్తుంది. దీనిపై నీటినే తెరగా చేసుకుని లఘు చిత్రాల ప్రదర్శన ప్రజలను అబ్బురపోయేలా చేస్తుందని మంత్రి తెలిపారు. భారతదేశ, తెలంగాణ చరిత్రలను తెలియజేసేలా పలు లఘుచిత్రాలను ప్రదర్శించే వీలు ఫౌంటేన్‌లో ఉండటం దీని ప్రతేకత. ఇందులో నీటిపారుదల శాఖ రూ.310 కోట్లు, పర్యాటకశాఖ రూ.100 కోట్లు మొత్తం రూ.410 కోట్ల ప్రాజెక్టు ఇది. ఇందులో కేవలం ఫౌంటేన్కే రూ.70 కోట్లు వెచ్చించడం గమనార్హం. ఫౌంటేన్ ఒక హైలైట్ తొలిదశలో మానేరు రివర్ ఫ్రంట్ పనులను మొదటి దశలో 3.75 కి.మీ వరకు అభివద్ధి చేస్తాం. రెండవ దశలో 6.25 కి.మీలు పూర్తి చేస్తాం. మానేరు రివర్ ఫ్రంట్ కు ఇరువైపులా పార్కులు, వాటర్ ఫౌంటేన్స్, థీమ్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, మ్యూజికల్ ఫౌంటేన్స్, ఆట స్థలాలు, గార్డెన్స్ లాంటివి ఏర్పాటు చేస్తాము. మానేర్ రివర్ ఫ్రంట్ లో 12 నుంచి 13 ఫీట్ల లోతు వరకు నీరు నిల్వ ఉంటుందని, ఇందులో స్పీడ్ బోట్లు, క్రోజ్ బోట్లు పర్యాటకులకు ఆకర్షణగా, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఎంఆర్ఎఫ్ ప్రాజెక్టులో ఫౌంటేన్ ఒక హైలైట్‌గా నిలవనుంది. అలాగే తీగల వంతెనపై నాలుగు భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేయనున్నాం. వాటి ద్వారా వాణిజ్య ప్రకటనలతోపాటు, ప్రభుత్వ పథకాలనూ ప్రచారం చేసుకోవచ్చు. -
మిడ్‌మానేరు.. ఇక జాతీయ ప్రాజెక్టు
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ గ్రామ సమీపంలో చివరిదశ నిర్మాణంలో ఉన్న మధ్యమానేరు రిజర్వాయర్ ఇక జాతీయ ప్రాజెక్టు జాబితాలో చేరనుంది. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖామంత్రి తన్నీరు హరీశ్‌రావు అసెంబ్లీలో గురువారం ప్రకటన చేయడం జిల్లా ప్రజల్లో ఆనందం నింపింది. బోయినపల్లి(చొప్పదండి): ‘మధ్యమానేరు ప్రాజెక్టు నిర్మాణానికి 2006లో టెండర్లు పిలిచారు. ఆ తర్వాత ఎనిమిదిన్నరేళ్లలో రూ.106కోట్లు ఖర్చు చేశారు. మూడేళ్లలో మేం రూ.461కోట్లు ఖర్చు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నాం. ప్రాజెక్టు కోసం 25 గేట్లు సిద్ధమయ్యాయి. రెండు, మూడు నెలల్లో గేట్లు బిగించి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం’ అని గురువారం మిడ్‌మానేరుపై అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో కాంగ్రెస్ శాసనసభ్యుడు టి.జీవన్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు నీటి పారుదల శాఖామంత్రి టి.హరీశ్‌రావు వివరణ ఇచ్చారు. 2లక్షల ఎకరాలకు సాగునీరు ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల్లోని సుమారు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూపొందించిన మిడ్‌మానేరు ప్రాజెక్టు అంశం అసెంబ్లీలో హాట్ టాపిక్‌గా మారింది. ఎస్సారెస్పీ నుంచి 12 టీఎంసీల నీరు ఇక్కడకు తరలించడంతో ఎస్సారెస్పీలో నీటి లభ్యత లోటు ఏర్పడిందని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. దీంతో మంత్రి హరీశ్‌రావు మిడ్‌మానేరుపై పూర్తి వివరణ ఇచ్చారు. అలాగే సింగూర్ ప్రాజెక్టు నుంచి 15 టీఎంసీల నీరు ఎస్సారెస్పీకి విడుదల చేసి లోటు పూడుస్తామని మంత్రి హామీ ఇచ్చారు. నిల్వ సామర్థ్యం 25.873 టీఎంసీలు 25.873 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో 2006లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ మధ్యమానేరుకు రూపకల్పన చేశారు. ఈ సమయంలోనే నిజామాబాద్ జిల్లా ఎస్సారెస్పీ నుంచి బోయినపల్లి మండలం వరదవెల్లి క్రాస్ రెగ్యులేటర్ వరకు 122 కిలోమీటర్ల పొడవున వరదకాలువ నిర్మించారు. ఎస్సారెస్పీలో పూర్తిస్థాయి నీటిమట్టం ఉన్న తర్వాత పోటెత్తే వరదనీరును వరదకాలువ ద్వారా మిడ్‌మానేరులోకి తరలించేందుకు వీలుగా నిర్మించారు. వైఎస్సార్ మరణానంతరం వచ్చిన ప్రభుత్వాలు ప్రాజెక్టుపై శ్రద్ధ చూపలేదు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన మూడేళ్లలోనే రూ.461కోట్లు ఖర్చు చేయడంతో పది టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి ప్రాజెక్టు రూపుదిద్దుకుంది. ప్రత్యేక గుర్తింపు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఉన్న ప్రాజెక్టుగా మధ్యమానేరు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు పొందింది. ఏఐబీపీ(ఆక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం) జాబితాలో మిడ్‌మానేరు ఉండడంతో కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రాజెక్టుకు 25 శాతం నిధులు వస్తాయని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రాజెక్టులో కాంక్రిట్ పనులు 4.8లక్షల క్యూబిక్ మీటర్లు చేయాల్సి ఉంది. 2006 నుంచి ప్రస్తుత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేవరకు కేవలం 50వేల క్యూబిక్ మీటర్ల పని మాత్రమే చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక 4.10లక్షల క్యూబిక్ మీటర్ల మేర పనులు చేశారు. ప్రస్తుతం మిషన్ భగీరథ పనుల కోసం ఎస్సారెస్పీ నుంచి వదిలిన నీరు 5.20 టీఎంసీలుంది. వచ్చే నవంబర్ వరకు నీటి నిల్వ మిడ్‌మానేరు ప్రాజెక్టు ఆధారంగా మిషన్ భగీరథ పథకం కింద సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల్లోని 18 మండలాలు, 466 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగానే ఎస్సారెస్పీ నుంచి వరదకాలువ ద్వారా నీరు విడుదల చేసి 5 టీఎంసీలు నిల్వ చేసింది. వచ్చే ఏడాది నవంబర్ వరకు మిడ్‌మానేరులో ఇది నిల్వ ఉంటుందని ఎస్ఈ శ్రీకాంత్‌రావు చెప్పారు. ఈలోగా ప్రాజెక్టుకు 25 గేట్లు బిగించి పూర్థిస్థాయిలో నీరు నిల్వ చేయాలని భావిస్తున్నారు. అన్నీ సవ్యంగా జరిగితే 2018 మార్చి వరకు మిడ్‌మానేరు ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారు. పెరగనున్న భూగర్భజలాలు మిడ్‌మానేరులో ఏడాదిపాటు 5 టీఎంసీల నీరు నిల్వ ఉంటే.. బోయినపల్లి మండలం మాన్వాడ, మల్లాపూర్, కొదురుపాక, నీలోజిపల్లి, శాభాష్‌పల్లి, వరదవెల్లి, వేములవాడ మండలం రుద్రవరం, సంకెపెల్లి, తంగళ్లపల్లి మండలం చీర్లవంచ, చింతలఠాణా తదితర ముంపు గ్రామాల పరిధిలోని పునరావాస కాలనీల్లో భూగర్భజలాలు పెరిగే అవకాశముంది. -
తెలంగాణ కోసం మరో బలిదానం
దుబ్బాక, న్యూస్‌లైన్: తెలంగాణ కోసం మరో బలిదానం జరిగింది. టీ బిల్లును అడ్డుకునేందుకు సీమాంధ్ర నేతలు కుట్రలకు పాల్పడుతుండటంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి బలవన్మరణానికి పాల్పడ్డాడు. దీంతో దుబ్బాకలో విషాదం అలుముకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. దుబ్బాకకు చెందిన వంగ శేఖర్(29) నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లాడు. ఆదివారం మధ్యాహ్నం కరీంనగర్ జిల్లా గంభీర్రావుపేట మండలం మానేరులో శవమై తేలాడు. తెలంగాణ బిల్లుకు బీజేపీ మద్దతు తెలపడం లేదన్న వార్తలు అతణ్ణి కలచివేశాయి. దీంతో మానేరు ప్రాజెక్టు వద్దకు వెళ్లాడు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులకు, బంధువులకు ఫోన్ చేశాడు. వీరు తెలంగాణ రావడం ఖాయమని, ఆత్యహత్య చేసుకోవద్దని సూచించారు. కానీ శేఖర్ ఫోన్ కట్ చేసినట్లు సమాచారం. నాలుగు రోజులుగా మానేరు ప్రాజెక్టు వద్ద శేఖర్ ఆచూకీ కోసం గాలించారు. ఆదివారం మధ్యాహ్నం మానేరులో శేఖర్ మృతదేహం బయటపడింది. సమాచారం తెలుసుకున్న మృతుడి తల్లి రుక్కవ్వ, బంధువులు ఘటనా స్థలానికి వెళ్లారు. మాజీ ఎమ్మెల్యే రామలింగారెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కూడా మానేరు ప్రాజెక్టు వద్దకు వెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సిరిసిల్లకు తరలించారు. ఆదివారం రాత్రి మృతదేహాన్ని దుబ్బాకకు తెచ్చి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. శేఖర్ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనేవాడు. గతంలో తడిపై కేసులు కూడా నమోదయ్యాయి. జైలుకు కూడా వెళ్లి వచ్చాడు. దుబ్బాకలో విషాదం శేఖర్ మరణ వార్త తెలియగానే దుబ్బాకలో విషాద ఛాయలు అలముకున్నాయి. శనివారం వరకు శేఖర్ బతికే ఉంటాడని భావించిన దుబ్బాక ప్రజలు, అతని మిత్రులు చనిపోయాడని తెలియడంతో కన్నీరుమున్నీరయ్యారు. నేడు దుబ్బాక బంద్ తెలంగాణ కోసం ప్రాణాలు వదిలిన వంగ శేఖర్ మృతికి సంతాపకంగా టీఆర్ఎస్ నాయకులు సోమవారం దుబ్బాక బంద్ కు పిలుపునిచ్చారు. ఈ విషయమై మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో శేఖర్ పాత్ర చాలా విలువైందని కొనియాడారు. అతని మృతి తనకు దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. తెలంగాణ ఏర్పాటు ఖాయమని ఇలాంటి నేపథ్యంలో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన సూచించారు. బంద్‌కు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. శేఖర్ మృతి బాధాకరం శేఖర్ మృతి తెలంగాణ ఉద్యమానికి తీరని లోటు. అతని మరణం బాధించింది. రాష్ట్ర ప్రక్రియ సాగుతున్న తరుణంలో ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దు. - కొత్త ప్రభాకర్‌రెడ్డి టీఆర్ఎస్ నాయకుడు ముదిరాజ్ యువసేనా సంతాపం తెలంగాణ ఏర్పాటు కోసం ప్రాణాలు అర్పించిన శేఖర్‌కు తెలంగాణ ముదిరాజ్ యువసేన సంతాపం ప్రకటించింది.