సాక్షి, కరీంనగర్: మానేరు తీరాన్ని సుందరంగా తీర్చిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్‌ఎఫ్) పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే రిటెయినింగ్ వాల్ నిర్మాణం వేగంగా సాగుతున్న క్రమంలో ఫౌంటేన్‌కు సంబంధించిన పనులు సమాంతరంగా ఊపందుకున్నాయి. ఉత్తర తెలంగాణకు ముఖద్వారంగా ఉన్న మానేరు వంతెనల నడుమ ఏర్పాటు చేస్తున్న ఈ బృహత్తర ప్రాజెక్టు.. కరీంనగర్ పర్యాటకానికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకువస్తుందని ప్రభుత్వం ధీమాగా ఉంది.
అందుకే, ఈ ప్రాజెక్టు పనులను మంత్రి గంగుల కమలాకర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తాజాగా సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్ కూడా ఈ ప్రాజెక్టు పురోగతిపై నిరంతర సమాచారం తెప్పించుకుంటున్నారు. ఈ ప్రాజెక్టులో హైలైట్‌గా నిలిచే ఫౌంటేన్ పనులకు ఈనెల 26వ తేదీన మంత్రి భూమి పూజ చేయనున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి ఎంఆర్‌ఎఫ్ ప్రాజెక్టును పూర్తి చేసి, సీఎం చేతుల మీదుగా జాతికి అంకితం చేయాలన్న సంకల్పంతో జిల్లా మంత్రి,అధికారులు పనిచేస్తున్నారు.
ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఫౌంటేన్..
కరీంనగర్‌లో ఇన్‌స్టాల్ చేయబోయే ఫౌంటేన్ ప్రపంచంలోనే మూడోఅతిపెద్దది కావడం విశేషం. మొదటిది దక్షిణ కొరియాలోని సియోల్‌లో, రెండోది చైనాలోని షాంఘైలో మూడోది మన కరీంనగర్‌లోనే కావడం గమనార్హం. నీటి మీద 100 మీటర్ల ఎత్తున నిర్మించనున్న ఈ ఫౌంటేన్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రాత్రిపూట అందమైన రంగులు చిమ్మే లైటింగ్‌తోపాటు, సంగీతానికి అనుగుణంగా 150 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తుతో నీరు పైకి చిమ్మడం పర్యాటకులను ముగ్గుదలను చేస్తుంది.
దీనిపై నీటినే తెరగా చేసుకుని లఘు చిత్రాల ప్రదర్శన ప్రజలను అబ్బురపోయేలా చేస్తుందని మంత్రి తెలిపారు. భారతదేశ, తెలంగాణ చరిత్రలను తెలియజేసేలా పలు లఘుచిత్రాలను ప్రదర్శించే వీలు ఫౌంటేన్‌లో ఉండటం దీని ప్రతేకత. ఇందులో నీటిపారుదల శాఖ రూ.310 కోట్లు, పర్యాటకశాఖ రూ.100 కోట్లు మొత్తం రూ.410 కోట్ల ప్రాజెక్టు ఇది. ఇందులో కేవలం ఫౌంటేన్‌కే రూ.70 కోట్లు వెచ్చించడం గమనార్హం.
ఫౌంటేన్ ఒక హైలైట్
తొలిదశలో మానేరు రివర్ ఫ్రంట్ పనులను మొదటి దశలో 3.75 కి.మీ వరకు అభివద్ధి చేస్తాం. రెండవ దశలో 6.25 కి.మీలు పూర్తి చేస్తాం. మానేరు రివర్ ఫ్రంట్ కు ఇరువైపులా పార్కులు, వాటర్ ఫౌంటేన్స్, థీమ్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, మ్యూజికల్ ఫౌంటేన్స్, ఆట స్థలాలు, గార్డెన్స్ లాంటివి ఏర్పాటు చేస్తాము. మానేర్ రివర్ ఫ్రంట్ లో 12 నుంచి 13 ఫీట్ల లోతు వరకు నీరు నిల్వ ఉంటుందని, ఇందులో స్పీడ్ బోట్లు, క్రోజ్ బోట్లు పర్యాటకులకు ఆకర్షణగా, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
ముఖ్యంగా ఎంఆర్‌ఎఫ్ ప్రాజెక్టులో ఫౌంటేన్ ఒక హైలైట్‌గా నిలవనుంది. అలాగే తీగల వంతెనపై నాలుగు భారీ ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేయనున్నాం. వాటి ద్వారా వాణిజ్య ప్రకటనలతోపాటు, ప్రభుత్వ పథకాలనూ ప్రచారం చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment