Manair
-
ప్రపంచంలో మూడో అతిపెద్ద ఫౌంటేన్.. 150 మీటర్ల ఎత్తుతో నీరు పైకి
సాక్షి, కరీంనగర్: మానేరు తీరాన్ని సుందరంగా తీర్చిద్దాలన్న సంకల్పంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన మానేరు రివర్ ఫ్రంట్ (ఎంఆర్ఎఫ్) పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే రిటెయినింగ్ వాల్ నిర్మాణం వేగంగా సాగుతున్న క్రమంలో ఫౌంటేన్‌కు సంబంధించిన పనులు సమాంతరంగా ఊపందుకున్నాయి. ఉత్తర తెలంగాణకు ముఖద్వారంగా ఉన్న మానేరు వంతెనల నడుమ ఏర్పాటు చేస్తున్న ఈ బృహత్తర ప్రాజెక్టు.. కరీంనగర్ పర్యాటకానికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకువస్తుందని ప్రభుత్వం ధీమాగా ఉంది. అందుకే, ఈ ప్రాజెక్టు పనులను మంత్రి గంగుల కమలాకర్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. తాజాగా సీఎం కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్ కూడా ఈ ప్రాజెక్టు పురోగతిపై నిరంతర సమాచారం తెప్పించుకుంటున్నారు. ఈ ప్రాజెక్టులో హైలైట్‌గా నిలిచే ఫౌంటేన్ పనులకు ఈనెల 26వ తేదీన మంత్రి భూమి పూజ చేయనున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి ఎంఆర్ఎఫ్ ప్రాజెక్టును పూర్తి చేసి, సీఎం చేతుల మీదుగా జాతికి అంకితం చేయాలన్న సంకల్పంతో జిల్లా మంత్రి,అధికారులు పనిచేస్తున్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఫౌంటేన్.. కరీంనగర్లో ఇన్స్టాల్ చేయబోయే ఫౌంటేన్ ప్రపంచంలోనే మూడోఅతిపెద్దది కావడం విశేషం. మొదటిది దక్షిణ కొరియాలోని సియోల్‌లో, రెండోది చైనాలోని షాంఘైలో మూడోది మన కరీంనగర్‌లోనే కావడం గమనార్హం. నీటి మీద 100 మీటర్ల ఎత్తున నిర్మించనున్న ఈ ఫౌంటేన్‌కు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. రాత్రిపూట అందమైన రంగులు చిమ్మే లైటింగ్‌తోపాటు, సంగీతానికి అనుగుణంగా 150 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తుతో నీరు పైకి చిమ్మడం పర్యాటకులను ముగ్గుదలను చేస్తుంది. దీనిపై నీటినే తెరగా చేసుకుని లఘు చిత్రాల ప్రదర్శన ప్రజలను అబ్బురపోయేలా చేస్తుందని మంత్రి తెలిపారు. భారతదేశ, తెలంగాణ చరిత్రలను తెలియజేసేలా పలు లఘుచిత్రాలను ప్రదర్శించే వీలు ఫౌంటేన్‌లో ఉండటం దీని ప్రతేకత. ఇందులో నీటిపారుదల శాఖ రూ.310 కోట్లు, పర్యాటకశాఖ రూ.100 కోట్లు మొత్తం రూ.410 కోట్ల ప్రాజెక్టు ఇది. ఇందులో కేవలం ఫౌంటేన్కే రూ.70 కోట్లు వెచ్చించడం గమనార్హం. ఫౌంటేన్ ఒక హైలైట్ తొలిదశలో మానేరు రివర్ ఫ్రంట్ పనులను మొదటి దశలో 3.75 కి.మీ వరకు అభివద్ధి చేస్తాం. రెండవ దశలో 6.25 కి.మీలు పూర్తి చేస్తాం. మానేరు రివర్ ఫ్రంట్ కు ఇరువైపులా పార్కులు, వాటర్ ఫౌంటేన్స్, థీమ్ పార్కులు, వాటర్ స్పోర్ట్స్, మ్యూజికల్ ఫౌంటేన్స్, ఆట స్థలాలు, గార్డెన్స్ లాంటివి ఏర్పాటు చేస్తాము. మానేర్ రివర్ ఫ్రంట్ లో 12 నుంచి 13 ఫీట్ల లోతు వరకు నీరు నిల్వ ఉంటుందని, ఇందులో స్పీడ్ బోట్లు, క్రోజ్ బోట్లు పర్యాటకులకు ఆకర్షణగా, ఆహ్లాదాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా ఎంఆర్ఎఫ్ ప్రాజెక్టులో ఫౌంటేన్ ఒక హైలైట్‌గా నిలవనుంది. అలాగే తీగల వంతెనపై నాలుగు భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు చేయనున్నాం. వాటి ద్వారా వాణిజ్య ప్రకటనలతోపాటు, ప్రభుత్వ పథకాలనూ ప్రచారం చేసుకోవచ్చు. -
మానేరు వాగులో ఆరు గంటలు..
మానేరు వాగులో చేపల వేట కు వెళ్లిన ముగ్గురు యువకులు ఒక్కసారిగా వచ్చిన వరదకు అందులోనే చిక్కుకుపోయారు. చెట్టును పట్టుకుని ఇద్దరు, పైపును పట్టుకుని మరొకరు సుమారు ఆరు గంటలు నరకయాతన పడ్డారు. అప్రమత్తమైన అధికారులు, పోలీసులు రెస్క్యూటీం సహకారంతో ముగ్గురినీ ప్రాణాలతో రక్షించారు. ఈ సంఘటన వీణవంక మండలం చల్లూరు వద్ద ఆదివారం సాయంత్రం జరిగింది. సాక్షి, వీణవంక(హుజూరాబాద్): చల్లూరు గ్రామానికి చెందిన నేదురు రవి, నేదురు శ్రీనివాస్, మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన తిరుపతి ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో మానేరు వాగులో చేపలు పట్టడానికి వెళ్లారు. ఈ క్రమంలో వాగులో ఉధృతి ఎక్కువగా ఉండటంతో ముగ్గురూ కొట్టుకుపోయారు. వాగు ఒడ్డు నుంచి 600 మీటర్ల దూరంలో ఉన్న ఓ చెట్టును నేదురు శ్రీనివాస్, తిరుపతి పట్టుకున్నారు. నేదురు రవి వాగు ఒడ్డు నుంచి కిలోమీటర్ దూరం కొట్టుకుపోయి అక్కడ ఓ రైతుకు చెందిన వ్యవసాయ బావి పైపు కనిపించడంతో దానిని పట్టుకున్నాడు. సహాయం కోసం ఆర్తనాదాలు చేస్తుండగా వాగు ఒడ్డు నుంచి వెళ్తున్నవారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై కిరణ్‌రెడ్డి, సర్పంచ్ పొదిల జ్యోతిరమేశ్, ట్రస్మా అధ్యక్షుడు ముసిపట్ల తిరుపతిరెడ్డి వెంటనే వాగు వద్దకు చేరుకుని స్థానికుల సహాయంతో రక్షించేందుకు ప్రయణ్నించారు. కానీ వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఫలితం లేకుండా పోయింది. ట్రస్మా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి కలెక్టర్‌కు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వడంతో రెస్క్యూటీం రంగంలోకి దిగింది. చదవండి: (ఒక్కసారిగా పెరిగిన వరద, ముగ్గురూ వాగులోనే..) వాగులో ఆరుగంటలు... సాయంత్రం 4 గంటలకు గల్లంతైన యువకులు రాత్రి 10 గంటల వరకు సుమారు ఆరు గంటలు వాగులేనే బిక్కుబిక్కు మంటు గడిపారు. కాపాడాలంటూ నేదురు శ్రీనివాస్, తిరుపతి రోదిస్తూ వేడుకున్నారు. నేదురు రవి అచూకీ కనుక్కోవడం కొంత ఆలస్యమైంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో వారిని కాపాడటానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. సాయంత్రం 7 గంటలకు కరీంనగర్‌కు చెందిన రెస్క్యూటీం సభ్యులు వాగు వద్దకు చేరుకుని మొదటగా రవిని రక్షించేందుకు ప్రయణ్నించారు. మూడుసార్లు రవి వద్దకు వెళ్లి వెనక్కు వచ్చిన సిబ్బంది చివరకు తాడు సహాయంతో రాత్రి 9.40 గంటలకు రక్షించగలిగారు. మిగిలిన ఇద్దరినీ 10 గంటల సమయంలో సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో చచ్చి బతికామంటు వారు కన్నీటిపర్యంతమయ్యారు. ఎల్ఎండీ గేట్లు మూయడంతో... కరీంనగర్ ఎల్ఎండీకి ఎగువ నుంచి ఇన్‌ఫ్లో పెరుగడంతో అధికారులు సాయంత్రం నీటి విడుదలను పెంచారు. సుమారు లక్ష క్యూసెక్కులు దిగువకు వదలడంతో మానేరు వాగు ఉప్పొంగి ప్రవహించింది. వరదను అంచనా వేయకుండా యువకులు చేపల వేటకు వెళ్లి గల్లంతయ్యారు. యువకుల గల్లంతు విషయం తెలుసుకున్న మంత్రి ఈటల రాజేందర్ ఎల్ఎండీ గేట్లు మేసివేయాలని ఎస్సారెస్పీ అధికారులను ఆదేశించారు. దీంతో హుటాహుటిన గేట్లు మూసివేయడంతో వాగులో వరద ఉధృతి తగ్గుముఖంపట్టింది. దీంతో యువకులను కాపాడడం రెస్క్యూ సిబ్బందికి సులువైంది. హెలిక్యాప్టర్ తెప్పిస్తే బాగుండేది... ముగ్గురు యువకులు ఆరు గంటలపాటు ప్రాణాపాయ స్థితిలో వాగులో కొట్టుమిట్టాడారు. హెలిక్యాప్టర్ సకాలంలో తెప్పిస్తే యువకులను త్వరగా కాపాడేవారని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఆరు గంటల జాప్యంలో యువకులు పట్టు కోల్పోతే ప్రాణాలు కోల్పోయేవారని పేర్కొంటున్నారు. వరదలో ఆరు గంటలు చుక్కలు చూశామని, అసలు ప్రాణాలతో బయటపడుతామని అనుకోలేదని బాధితులు తెలిపారు. తహసీల్దార్ కనకయ్య, ఎస్సై కిరణ్‌రెడ్డి, ట్రస్మా అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, సర్పంచ్ పొదిల్ల జ్యోతిరమేశ్కు కృతజ్ఞతలు తెలిపారు. -
మానేరులో శవం
సిరిసిల్ల మండలం పెద్దూరు వద్ద మానేరులో ఓ యువకుడి శవం కనిపించింది. యువకుడి ఒంటిపై దుస్తులు ఒడ్డున్న విప్పేసి ఉన్నాయి. అయితే సదరు యువకుడు ఈత రాకపోవడం వల్ల మునిగిపోయాడా లేక ఎవరైనా గొంతు పిసికి చంపి అనుమానం రాకుండా బట్టలు విప్పేసి మానేరులో పడేసి ఉంటారా అని అనుమానిస్తున్నారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
పూర్తిగా నిండిన లోయర్ మానేను
ఎగువ ప్రాంతాల నుంచి వ రదతో కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు జలాశయం పూర్తిస్థాయిలో నిండింది. డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 920 అడుగులు కాగా.. ప్రస్తుతం పూర్తి స్థాయి నీటి మట్టం కొనసాగుతోంది. జలాశయానికి ఎగువ ప్రాంతాల నుంచి 16,000 క్యూసెక్కుల నీరు వస్తుండటంతో.. 8 గేట్లు ఎత్తి 16,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. కాకతీయ కాలువకు మరో 2, 000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 24 టీఎంసీల నీరు నిల్వ ఉందని అధికారులు తెలిపారు.