'యాక్షన్ కు... రియాక్షన్ తప్పదు'
హైదరాబాద్: ఓటుకు నోటు కేసులో అరెస్ట్ అయిన రేవంత్ రెడ్డి వ్యవహారం కోర్టు పరిధిలో ఉందని... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఫోన్ ట్యాపింగ్ అంశం కేంద్రం పరిధిలో ఉన్నట్లు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. రాజకీయంగా టీఆర్ఎస్ ఎలాంటి యాక్షన్ తీసుకున్నా... దానికి తమ వైపు నుంచి కూడా రియాక్షన్ ఉంటుందని యనమల శుక్రవారం హైదరాబాద్లో స్పష్టం చేశారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంపై ఆధారాలను కేంద్రానికి నివేదించినట్లు యనమల తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి భవనాల తరలింపుపై కమిటీ వేశామని, అద్దెకు భవనాలు దొరికాక ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తామని చెప్పారు. రెవెన్యూ, పోలీస్, ఎన్నికలకు సంబంధించిన శాఖల్లో మాత్రం బదిలీలు ఉండవన్నారు.