రాష్ట్ర ప్రభుత్వం వివిధ పారిశ్రామిక పాలసీల కింద ఇస్తున్న రాయితీలను జీఎస్టీ తర్వాత కూడా అమలు
రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ చాంబర్స్ డిమాండ్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం వివిధ పారిశ్రామిక పాలసీల కింద ఇస్తున్న రాయితీలను జీఎస్టీ తర్వాత కూడా అమలు చేయాలని, దీనికి అనుగుణంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఏపీ చాంబర్స్ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ప్రకటించిన పలు ప్రోత్సహకాలు జీఎస్టీ తర్వాత ఎలా అమలు చేస్తారన్న దానిపై స్పష్టత లేదని ఏపీ ఛాంబర్స్ అధ్యక్షుడు ముత్తవరపు మురళీకృష్ణ పేర్కొన్నారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర పారిశ్రామిక రంగం ఎదుర్కొంటున్న సమస్యల్ని ఎదుర్కొనేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడును కోరినట్లు తెలిపారు. ప్రభుత్వం తమ విధానాల్లో అనేక రాయితీలు ప్రకటించినా అవి జీవోల రూపంలో రావట్లేదని విమర్శించారు. ఏపీ చాంబర్స్ ప్రధాన కార్యదర్శి పొట్లూరి భాస్కరరావు కూడా మాట్లాడుతూ పలు డిమాండ్లను ప్రస్తావించారు.