వీఐపీలకే దర్శనభాగ్యమా?
సామాన్యులకు దూరమవుతున్న ఆపదమొక్కులవాడు
ఒకటో తేదీ, ఏకాదశికి క్యూ కడుతున్న వీఐపీలు.. బంధుగణంతో సుమారు 180 మంది ఎంఎల్‌ఏలు, 30 మంది ఎంఎల్‌సీలు
సాక్షి, తిరుమల: ఆపద మొక్కులవాడా...అని మొక్కగానే కష్టాలను తీర్చే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం సామాన్య భక్తులకు రోజురోజుకీ దూరమవుతోంది. ఒకప్పుడు పది అడుగుల దూరంలోని కులశేఖరపడి నుంచే ఆ దేవదేవుని రూపాన్ని దర్శించుకుని భక్తులు తన్మయత్వం పొందేవారు. రద్దీని బూచిగా చూపి మహాలఘు దర్శనం పేరుతో 70 అడుగుల దూరానికి సామాన్య భక్తులను నెట్టివేశారు. ఇక కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి రోజుల్లో సామాన్య భక్తులకు స్వామి దర్శనం గగనమైపోతోంది. ప్రతిసారి ధర్నాలు, ఆందోళనలు, తోపులాటలు, తొక్కిసలాటలు జరిగినా టీటీడీ ధర్మకర్తల మండలి పెద్దలు, అధికారులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా వేలాది బంధుగణంతో తరలి వచ్చే వీవీఐపీలు, రాజకీయ నేతలు, ప్రజా పతినిధులు, వ్యాపార, వాణిజ్య వేత్తలకు ఎర్ర తివాచీ వేసేందుకు టీటీడీ మరోసారి సమాయత్తమవుతోంది. వైకుంఠ ఏకాదశి రోజున ఏకంగా పదివేల వీఐపీ టికెట్లు ఇచ్చే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి తెలిపారు. అంటే ఈ ఏడాది కూడా సామాన్య భక్తులకు అష్ట కష్టాలు తప్పవన్నమాట!
పెరుగుతున్న సామాన్య భక్తులు.. తప్పని అగచాట్లు...
తిరుమలకు సరాసరిగా రోజుకి 80వేలు, రద్దీ రోజుల్లో లక్ష, కొత్త సంవత్సరం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో రోజుకు లక్షన్నర వరకు భక్తులు వస్తారు. 1933 నుంచి 1970 వరకూ భక్తులు మహాద్వారం నుంచి నేరుగా ఆలయంలోకి వెళ్లి పది నిమిషాల్లోనే స్వామిని దర్శించుకుని వచ్చేవారు. 1945, ఏప్రిల్ 10న మొదటి ఘాట్‌రోడ్డు ప్రారంభమైన తర్వాత 1952 టీటీడీ లెక్కల ప్రకారం రోజుకు 2 వేలమంది స్వామిని దర్శించుకోగా... 2012 నాటికి 2.73 కోట్లకు పెరిగింది. ఇక 2013వ సంవత్సరం ఇప్పటివరకు సుమారు 3 కోట్లకు చేరింది. వీరిలో కేవలం నాలుగు నుంచి ఐదు శాతం మినహా అందరూ సామాన్య భక్తులే.
ఎటువంటి సిఫారసులు లేకుండానే 10 గంటల నుంచి 36 గంటల పాటు కూడా క్యూలో నిరీక్షించి స్వామివారినిదర్శించుకుంటారు. ఇందులో కంపార్ట్‌మెంట్లలో రోజుల తరబడి వేచి ఉండే సర్వదర్శనం... అలిపిరి, శ్రీవారి మెట్టు కాలిబాటల్లో నడిచి తిరుమలకు వచ్చి తిరిగి 10 నుంచి 16 గంటలపాటు క్యూలైన్లలో వేచి ఉండి దర్శించుకునే దివ్యదర్శనం... చంటి బిడ్డలతో వచ్చిన తల్లిదండ్రులు, వృద్ధులు, వికలాంగులు దర్శనం.... తిరుమలలో ఎవరి సిఫారసు లేకుండానే 8 నుంచి 15 గంటలపాటు క్యూలైన్లలో వేచి ఉండే రూ.300 టికెట్ల భక్తులు... ఈ- దర్శన్ కేంద్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ కింద రూ.50 టికెట్ల సుదర్శనం... అర్ధరాత్రుల వరకు మేల్కొని ఆన్‌లైన్ ద్వారా ముందస్తుగా బుక్ చేసుకునే ఆర్జిత సేవా భక్తులు ఉన్నారు. వీరిలో ఆర్జిత సేవా భక్తులు మినహా మిగిలినవారు గంటల నుంచి రోజుల తరబడి క్యూలో నిరీక్షించిన తర్వాత స్వామి దర్శనం లభిస్తోంది. విశిష్ట పర్వదినాలు, వారాంతపు రద్దీరోజుల్లోనే కాదు సాధారణ రోజుల్లో కూడా భక్తుల ఆగచాట్లు నిత్యకృత్యం. మరోవైపు వీఐపీలు రాజమార్గంలో వెళ్లి అరగంట నుంచి గంటలోపే స్వామివారిని దర్శించుకుంటున్నారు.
కొత్త సంవత్సరం, ఏకాదశిలో వీఐపీలకే ఎర్ర తివాచీ..
2014 కొత్త సంవత్సరం జనవరి 1వ తేదీ, 11వ తేదీ వైకుంఠ ఏకాదశి, 12వ తేదీ ద్వాదశి పర్వదినాల్లో వీఐపీ దర్శనాల కోసం తిరుమలకు తరలివచ్చే ప్రముఖులకు బస, దర్శన విషయంలో టీటీడీ పెద్దలు ఎర్ర తివాచీ సిద్ధం చేశారు. బంధుగణంతో సుమారు 180 మంది ఎంఎల్‌ఏలు, 30 మంది ఎంఎల్‌సీలు, మరో 25 మంది ఎంపీలు, 100 మందికి పైగా కేంద్ర , రాష్ట్ర ఉన్నతాధికారులు, జ్యుడీషియల్, వ్యాపార, వాణిజ్యవేత్తల రాకపై ఇప్పటికే టీటీడీకి సమాచారం అందింది. తిరుమలకు వస్తామో?రామో అన్న విషయం ఇంకా స్పష్టం కాకపోయినా తమపేరుతో తమ బంధుగణానికి శ్రీవారి సన్నిధిలో బస, దర్శన ఏర్పాట్లు సిద్ధం చేసుకోవటంలో నేతలు, అధికారులు బిజీబిజీ అయ్యారు. ఇందుకోసం ప్రత్యేకంగా రిసెప్షన్, ఆలయ అధికారులు, ఇంజనీర్లతో కూడిన అధికారులతో కమిటీలు కూడా వేసేశారు. తిరుమలకు వచ్చే వీఐపీకి బస, దర్శనం విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాచమర్యాదలు చేయాలని అధికారికంగా ఉత్తర్వులు సైతం ఇచ్చేశారు. దీంతో సంబంధిత టీటీడీ కింది స్థాయి అధికారులు కూడా ప్రముఖుల సేవకు సిద్ధమవుతున్నారు.