అనర్హులకు పరిహారం | compensation for disqualifiers | Sakshi
Sakshi News home page

అనర్హులకు పరిహారం

Published Fri, Dec 20 2013 4:27 AM | Last Updated on Thu, Sep 27 2018 8:42 PM

compensation for disqualifiers

మంచిర్యాల రూరల్, న్యూస్‌లైన్ : ఆదిలాబాద్-కరీంనగర్ జిల్లాల సరిహద్దులోని గోదావరి నదిపై శ్రీపాద(ఎల్లంపల్లి) ప్రాజెక్టు పనులను 2005లో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించారు. దాదాపు 2 లక్షల ఎకరాలకు సాగునీటితోపాటు తాగునీరు అందించాలనేది ప్రాజెక్టు లక్ష్యం. వైఎస్సార్ హయాంలో నిధులు వెచ్చించగా పనులు ముమ్మరంగా సాగాయి. రోశయ్య, కిరణ్ సర్కారుల పుణ్యమాని నిధులు విదల్చకపోవడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయి. పూర్తిస్థాయిలో నిర్వాసితులకు కూడా పరిహారం అందలేదు. పునరావాస కాలనీలు కూడా పూర్తికాలేదు. కానీ.. బినామీలు, దళారులు అధికారుల సహకారంతో రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. అర్హులకు పరిహారం అందకపోగా, అనర్హులు మాత్రం పరిహారం పొందుతున్నారు. బినామీలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా అందాయి.
 
 బయోమెట్రిక్ ద్వారా గుర్తింపు
 ముంపు గ్రామాల్లో బయోమెట్రిక్ ద్వారా పరిహారం పొందిన వారి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపు 129 మంది అనర్హులుగా గుర్తించారు. వీరు దాదాపు రూ.6 కోట్ల పరిహారం పొందినట్లు అధికారులు అంచనా వేశారు. తొమ్మిది గ్రామాలు ముంపునకు గురవుతుండగా ఎనిమిది గ్రామాల్లో బయోమెట్రిక్ ద్వారా అనర్హులను తొలగించారు. ఇంకా ఒక్క గ్రామంలో బయోమెట్రిక్ నిర్వహిస్తే మరికొంత మంది అనర్హులు బయటపడే అవకాశం ఉంది. వీరి నుంచి పరిహారం రికవరీ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. ఈ క్రమంలో ఈ నెల 10న ఆర్‌అండ్‌ఆర్ కమిషనర్ శ్రీదేవి పనులను పర్యవేక్షించి అనర్హులపై చర్యలు తీసుకోవాలని చెప్పడంతో బినామీల్లో గుబులు  మొదలైంది. పరిహారం పొందేందుకు అధికారులకు, దళారులకు వాటాలు ఇచ్చిన బినామీలు, ప్రభుత్వం రికవరీ చేస్తే ఎక్కడి నుంచి డబ్బులు కట్టాలని ఆందోళన చెందుతున్నారు. బినామీల వ్యవహారం తెరపైకి రావడంతో గ్రామాల్లోని దళారులు రాజకీయ నాయకులతో రికవరీ, కేసులు లేకుండా చూసేందుకు మంతనాలు జరుపుతున్నారు.
 
 అర్హులకు నిరాశ..
 2006 సంవత్సరంలో ముంపు గ్రామాల్లో సోషల్ ఎకనామికల్ సర్వేలో తప్పిన వారి పేర్లు అడ్డుపెట్టుకుని ఒక్కో గ్రామంలో 50కి పైగా బినామీలు తెరపైకి వచ్చారు. పేర్లు తప్పిపోయిన అర్హులు గ్రామానికి 10 నుంచి 30 మంది వరకు ఉండగా, వీరిని అర్హులుగా అధికారులు గుర్తించలేదు. ముడుపులు ఇచ్చిన బినామీలకు పరిహారం డబ్బులు, పునరావాస కాలనీలో ప్లాట్లు కేటాయించారు. తమకు పరిహారం ఇవ్వకుండా అనర్హులకు ఇచ్చారంటూ బాధితులు అప్పటి ఆర్‌ఆర్ కమిషనర్ చిరంజీవి చౌదరికి ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టు పనులు ముగింపు దశకు చేరుకున్నాయి. త్వరలో ప్రారం భం కానుండడంతో అర్హులైన వారికి న్యాయం చేయాలని నిర్వాసితులు కోరుతున్నారు. ప్లాట్లు కేటాయించిన వారు వెళ్లిపోతే తాము ఎలా ఉండేదని పరిహారం పొందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఎల్లంపల్లి ప్రాజెక్టును ఈ నెలాఖరులోగా సీఎం కిరణ్‌తో ప్రారంభించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. తెలంగాణ బిల్లు కోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తుండటంతో మొదట అనుకున్న దానికంటే ప్రారంభోత్సవం కొంత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నట్లు ఎల్లంపల్లి ఎస్‌ఈ వెంకటేశ్వర్లు పేర్కొంటున్నారు.
 
 అనర్హులకు జాబితాలో చోటు..
 మంచిర్యాల మండలం గుడిపేటలో అప్పటి జీపీ కార్యదర్శి తన బంధువుల పేర్లు సోషల్ ఎకనామికల్ సర్వే(ఎస్‌ఈఎస్)లో చేర్చారు. గ్రామానికి చెందిన చుంచు లింగయ్య, చుంచు రామయ్యలకు చెందిన భూమిలో గుడిసెలు వేసిన బినామీలకు ఇంటి నంబర్లు కేటాయించాడు. 2-106 ఇంటి నంబర్లకు బై 1, బై 2 నంబర్లు వేసి కూలీ డబ్బుల కింద రూ.1,44,500 తీసుకున్నారు.
 
 బినామీల్లో జమ్మికుంట మండలం గోపాలపురంకు చెందిన సారంపెల్లి వెంకటమ్మ, ఆమె కుమారుడు సారంపెల్లి రాజయ్యలు 2-106/2 లో ఉంటున్నారని పేర్కొంటూ ఎస్‌ఈఎస్‌లో పేరు నమోదు చేశారు. వీరికి కూలీ డబ్బులతోపాటు, పునరావాస కాలనీలో ప్లాటు కూడా లభించింది. బినామీ పేర్లతో పరిహారం పొందేందుకు కార్యదర్శికి సహకరించిన పలువురు దళారులు, అదే కార్యదర్శి సహాయంతో వందల ఇళ్లకు బై నంబర్లు వేసి పరిహారం పొందారు. ఇలాంటివి గ్రామాల్లో వందల సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుతం అధికారులు బినామీల నుంచి పరిహారం రికవరీ చేసేందుకు సన్నాహాలు చేస్తుండడంతో ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారి నుంచి కూడా వసూలు చేయాలని అర్హులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement