
పరిహారం పరిహాసం !
=అందని ఇన్‌పుట్ సబ్సిడీ
=ఆగిన రూ.5.21 కోట్ల చెల్లింపులు
=వేరుశెనగ రైతుకూ తప్పని తిప్పలు
=చాలాచోట్ల వర్తించని పంట బీమా పథకం
=ఖాతాలు సరిగా లేవంటున్న అధికారులు
=అన్నదాత నిరీక్షణ
సాక్షి, చిత్తూరు: జిల్లా వ్యాప్తంగా 7,690 మంది రైతులకు వేరుశెనగ పంటకు సంబంధించి 5,21,89,468 రూపాయల ఇన్‌పుట్ సబ్సిడీ ఏడాదిగా అందలేదు. ఈ క్రమంలో రైతులకు పరిహారం కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. వ్యవసాయ అధికారులు మాత్రం కొన్నిచోట్ల నష్టపరిహారం ఇన్‌పుట్ సబ్సిడీ రూపంలో వచ్చినా బ్యాంక్ ఖాతాలు సరిగా లేనందున నిధులు జమ చేయలేదని చెబుతున్నారు. జిల్లాలో 30కిపైగా మండలాల్లో రైతులు ఇన్‌పుట్ సబ్సిడీ అందక ఇబ్బంది పడుతున్నారు. చాలా చోట్ల పంటల బీమా వర్తించలేదు.
పలమనేరు నియోజకవర్గానికి 2009 సంవత్సరానికి ఇన్‌పుట్ సబ్సిడీ 1.62 కోట్ల రూపాయలు రావాల్సి ఉంది. అయితే రైతులు ఇనూరెన్స్ తీసుకున్నారు కనుక ఇన్‌పుట్స్ సబ్సిడీ ఇచ్చేది లేదని అధికారులు తేల్చి చెప్పారు. అలాగే 2011లో రూ.81 లక్షలు రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందాల్సి ఉంది. పంటల బీమా పరిహారం అందలేదు. 2009లో 4,779 మంది రైతులకు, 2011లో 3075 మంది రైతులకు పంట నష్టపరిహారం అందలేదు.
కుప్పంలో 2012-13లో 5,845 మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీకి ప్రతిపాదనలు పెట్టారు. వీరిలో 840 మందికి ఇన్‌పుట్ సబ్సిడీ అందలేదు. అలాగే 2178 హెక్టార్లలో వేరుశెనగ పంట దెబ్బతింది. ఇన్‌పుట్ సబ్సిడీ అందలేదు. గుడుపల్లె, రామకుప్పం, శాంతిపురం మండలాల్లో చాలా మంది రైతులకు పాస్ పుస్తకాల్లో పేర్లు లేవని, బ్యాంకు ఖాతాలు సరిగా లేవని ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదు.
మదనపల్లె మండలంలో 2,650 హెక్టార్లలో పంట నష్టపరిహారం కోసం ప్రతిపాదనలు పంపారు. మొత్తం 4,350 లబ్ధిదారులను ఎంపిక చేశారు. వీరికి 2.65 కోట్లు మంజూరు చేశారు. అయితే ఇందులో రూ.1.8 కోట్లు పెండింగ్‌లో ఉంది. బ్యాంక్ ఖాతాలు సరిగా లేక జమ కాలేదు. నిమ్మనపల్లె మండలంలో 3,812 మందిని ఎంపిక చేశారు. వీరికి రూ.2.60 కోట్లు మంజూరు చేశారు. ఇందులో 2.53 కోట్లు పంపిణీ అయింది. ఇంకా 69 మందికి 38.98 లక్షలు అందాల్సి ఉంది. బ్యాంక్ ఖాతాలు సరిగా లేకపోవడమే సమస్యని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు.
తంబళ్లపల్లె నియోజకవర్గంలో 4 వేల మంది రైతులకు 2011-12 సంవత్సరం పంట నష్టపరిహారం కింద ఇన్‌పుట్ సబ్సిడీ రూ.2 కోట్లు అందలేదు. పెద్దమండ్యం, తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట మండలాల్లో వేరుశెనగ పంట బీమానష్టం, సబ్సిడీ రెండూ అందలేదు.
ముఖ్యమంత్రి నియోజకవర్గం పీలేరులో 1,329 మంది రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ అందలేదు. రూ.40 లక్షల వరకు నిధులు రావాల్సి ఉంది.
సత్యవేడు నియోజకవర్గంలో తుపాన్ల వల్ల దెబ్బతిన్న పంటలకు నాలుగేళ్లుగా నష్టపరిహారం ఒక్క రూపాయీ ఇవ్వలేదు. ఇన్‌పుట్ సబ్సిడీ ఇంత వరకు అందలేదు. గత ఏడాది 70 శాతం పంట నష్టం ఉన్నా పరిహారం ఇవ్వలేదు. వ రి పైరు దెబ్బతిన్న రైతులు 55 మంది వరకు ఉన్నా వారిని పట్టించుకోలేదు.
చిన్నగొట్టిగల్లు మండలంలో 2011లో కరువుతో వేరుశెనగ పంట దెబ్బతింటే పంట నష్టపరిహారం 852 మందికి రూ.17.68 లక్షలు వచ్చింది. ఇందులో 189 మందికి రూ.2.93 లక్షలు అందాల్సి ఉంది.