గౌడ, శెట్టిబలిజ వనసమారాధనలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌రావు
పశ్చిమగోదావరి, పాలకొల్లు టౌన్: తెలుగుదేశం పార్టీ అంతర్గత విభేదాలు రోడ్డున పడ్డ విషయం తెలిసిందే. ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు చేసిన అవమానాన్ని జీర్ణించుకోలేక సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ఆయన ఆదేశిస్తే తన పదవికి రాజీనామా చే స్తానని ఎమ్మెల్సీ అంగర రామమోహన్‌రావు ప్రకటించడం టీడీపీ, బీసీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. పూలపల్లి బైపాస్ రోడ్డులో జరిగిన గౌడ, శెట్టిబలిజ కార్తీక వనసమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ అంగర హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 28 ఏళ్లుగా టీడీపీలో పలు పదవులను చేపట్టానని, అయితే అన్న క్యాంటీన్ ప్రారంభోత్సవం సందర్భంగా తాను ఏర్పాటుచేసిన ఫ్లెక్సీని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు తొలగించేలా చేయడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీగా ఉన్న తనకు ఫ్లెక్సీ పెట్టే అర్హత లేనప్పుడు తాను పదవిలో ఉన్నా లేకపోయినా ఒకటేనని అన్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లి ఆయన ఆదేశిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని బహిరంగంగా ప్రకటించడం చర్చనీయాంశం అయ్యింది. టీడీపీకి తానెప్పుడూ కృతజ్ఞతగా ఉంటానని స్పష్టం చేశారు. వనసమారాధనకు శాసనమండలి ఇన్‌చార్జ్ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, కార్మిక, ఉపాధి కల్పనశాఖ మంత్రి పితాని సత్యనారాయణ, తూర్పుగోదావరి జిల్లా మాజీ జెడ్పీచైర్మన్ చెల్లబోయిన వేణుగోపాలకృష్ణ తదితరులు హాజరయ్యారు.
బీసీలను అణగదొక్కితే ఊరుకోం
ఏ పార్టీ అయినా, నాయకులైనా బీసీ నాయకులను అవమానిస్తే సహించేది లేదని గౌడ సంఘ జిల్లా అధ్యక్షుడు వేండ్ర వెంకటస్వామి హెచ్చరించారు. బీసీల వల్లే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందన్న విషయాన్ని నాయకులు గుర్తించుకోవాలని హితవు పలికారు.
Comments
Please login to add a commentAdd a comment