వేధింపులు తాళలేకున్నాం
Published Tue, Jan 28 2014 3:54 AM | Last Updated on Thu, Oct 4 2018 5:44 PM
నెల్లూరు(క్రైమ్), న్యూస్‌లైన్: భర్త వేధింపులు తాళలేకున్నాం..ఆస్తి కోసం చంపేందుకు యత్నిస్తున్నారు..బంధువులు వేధిస్తున్నారు..ఇలా ఒక్కొక్కరు తమ ఆవేదనను సోమవారం నెల్లూరులోని ఉమేష్‌చంద్ర మెమోరియల్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన గ్రీవెన్స్‌డేలో ఎస్పీ పీవీఎస్ రామకృష్ణ దృష్టికి తెచ్చారు.
తమ సమస్యలను వినతిపత్రం రూపంలో ఎస్పీతో పాటు ఏఎస్పీలు గంగాధరరావు, ఐఆర్‌ఎస్ మూర్తి, నగర డీఎస్పీ పి.వెంకటనాథ్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్లు వై. జయరామసుబ్బారెడ్డి, మాధవరావు, ఎం.నాగేశ్వరమ్మ, హోంగార్డ్స్ ఆర్‌ఐ కేజేఎం చిరంజీవి పాల్గొన్నారు.
హత్య చేయబోయాడు
నాకు చాముదలకు చెందిన రామకృష్ణతో 14ఏళ్ల కిందట వివాహమైంది. మాకు ఇద్దరు పిల్లలు. నా భర్త ఇటీవల చెప్పుడు మాటలు విని నన్ను ఇబ్బంది పెడుతున్నాడు. నా ఆస్తి కాజేసేందుకు ఇటీవల నన్ను హత్య చేయబోయాడు. విచారించి న్యాయం చేయండి. వల్లేరు కామాక్షి, చామదల, జలదంకి ఇంటిని కూల్చేశారు.
మా ఊర్లో గున్నంరెడ్డి సుజన వద్ద ఐదు అంకణాల స్థలాన్ని 2011 ఆగస్టులో కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నాను. గత ఏడాది ఏప్రిల్‌లో సుజన బంధువులు కూనం ధనమ్మ, రాఘవరెడ్డి, వాసుదేవరెడ్డి, దశరథరామిరెడ్డి ఇంటిని కూల్చేశారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. అరవ ఉమామహేశ్వరి, జలదంకి
బంధువులే వేధిస్తున్నారు
నాకు మాధవరావుతో 13 ఏళ్ల కిందట పెళ్లయింది. ఆయన బేల్దారి పనిచేస్తూ కు టుంబాన్ని పోషిస్తున్నాడు. కొంతకాలం గా నా భర్త అన్న కుమారులు నాగరాజు, శ్రీనివాసులు, అక్క కొడుకు శ్రీహరి నన్ను వేధిస్తున్నారు. పలు దఫాలు మందలించినా ఫలితం లేకపోగా ఇటీవల వేధింపులు ఎక్కువయ్యాయి. వారు చెప్పినట్లు వినకపోతే నన్ను, నా భర్తను చంపేస్తామంటున్నారు. ఫొటోలు తీసి నెట్‌లో పెడతామని బెదిరిస్తున్నారు. స్వప్న, బ్రహ్మారెడ్డిపాళెం, కొడవలూరు
భర్తపై చర్యలు తీసుకోవాలి
నాకు వెంకటేశ్వరపురానికి చెందిన దాసరి కోటయ్యతో వివాహమైంది. మాకు ఇద్దరు పిల్లలు. ఆయన నాపై అనుమానం పెంచుకుని చిత్రహింసలు పెడుతున్నాడు. ఆయన ఇప్పటికే నలుగురిని వివాహం చేసుకున్నట్లు తెలిసింది. దీనిపై నిలదీస్తే నా కుమార్తెతో పాటు అన్న కుమార్తెను కూడా చంపుతానని బెదిరిస్తున్నాడు. విజయమ్మ, చంద్రబాబునగర్
కాపురాన్ని చక్కదిద్దండి
నాకు మేనమామ జాలయ్యతో 1993 లో వివాహమైంది. మద్యానికి బానిసై న భర్త నన్ను, పిల్లల్ని పట్టించుకోకుం డా ఇబ్బంది పెడుతున్నాడు. ఇటీవల మరో మహిళతో వి వాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. ప్రశ్నిస్తే కొట్టి ఇంట్లో నుంచి తరిమేశాడు. నా కాపురాన్ని చక్కదిద్దండి. - కూనంగారి మస్తానమ్మ, గుమ్మళ్లదిబ్బ, చిల్లకూరు
మోసం చేశారు
నేను గతేడాది ఏప్రిల్‌లో టాటా 207 వాహనాన్ని ఫైనాన్స్‌లో తీసుకొన్నాను. రెండు నెలల తర్వాత పొదలకూరుకు చెందిన మస్తాన్‌కి లీజ్‌కి ఇచ్చాను. అతను నాకు తెలియకుండా చేజర్ల మండలం మడపల్లికి చెందిన రవి(హోంగార్డ్)కి అమ్మేశాడు. అతను ఫైనాన్స్ చెల్లించకుండా ఆ వాహనంలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేశారు. అది తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేస్తే, నా వాహనాన్ని నాకు ఇస్తామని చెప్పి వేరే వాహనానికి నంబరు ప్లేటు మార్చి ఇచ్చారు. దొంగబండి అని తేలడంతో చేజర్ల పోలీసులకు అప్పగించాను. నాకు జరిగిన మోసంపై పొదలకూరు సీఐ రోశయ్యకు ఫిర్యాదు చేయగా పట్టించుకోవడం లేదు. పి. శ్రీనివాసులు, కలువాయి
Advertisement
Advertisement