సాక్షి, నెల్లూరు: జిల్లాలో సమైక్యాంధ్ర ఉద్యమం 23వ రోజు గురువారం మరింత ఉధృతమైంది. గుంటూరులో వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమర దీక్షకు మద్దతుగా కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష 4వ రోజుకు చేరింది. ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మేరిగ మురళీధర్, వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సూళ్లూరుపేట సమన్వయకర్త నెలవల సుబ్రమణ్యం ప్రసన్న దీక్షకు సంఘీభావం తెలిపారు.
ఉదయగిరి నియోజకవర్గంలోని బోగ్యంవారిపల్లికి చెందిన యువకులు తిమ్మారెడ్డిపల్లి సెంటర్లో రాస్తారోకో, ధర్నా నిర్వహించి దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. వీరికి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సంఘీభావం తెలిపారు. కావలిలో జరిగిన ఆందోళనలో సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దీక్షలు కొనసాగుతున్నాయి. విద్యార్థి జేఏసీ, ఎన్‌జీఓ అసోసియేషన్, గెజిటెడ్ ఆఫీసర్లతోపాటు పలు రాజకీయపార్టీలు జిల్లా వ్యాప్తంగా రిలే దీక్షలు, ర్యాలీలు, రాస్తారోకోలు, మానవహారాలు, వంటావార్పు కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. ఆర్టీసీ బంద్ కొనసాగుతోంది. ఉపాధ్యాయుల సమ్మెతో ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి.
నెల్లూరులో పెన్నా వంతెనపై సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు, ఆర్టీసీ ఎదుట ఆర్టీసీ కార్మికుల రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. కస్తూర్బా కళాక్షేత్రంలో గెజిటెడ్ ఆఫీసర్స్, ఉపాధ్యాయులు, ఉద్యోగులు సమావేశం నిర్వహించారు. అక్కడి నుంచి వీఆర్‌సీ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం చేపట్టారు. వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులు నర్తకిసెంటర్‌లో ధర్నా, ర్యాలీ నిర్వహించారు.
విద్యుత్‌భవన్ ఎదుట విద్యుత్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు, పంచాయతీరాజ్‌శాఖలోని ఉద్యోగులందరూ జెడ్పీ కార్యాలయం ఎదుట ముఖానికి నల్ల రిబ్బన్లు కట్టుకుని దీక్ష చేపట్టారు. కావలిలో ఆర్టీసీ ఉద్యోగ సంఘ జేఏసీ ఆధ్వర్యాన హైర్ బస్సులతో భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీపొట్టిశ్రీరాములు బొమ్మ సెంటర్లోని శిబిరంలో యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఏరియా వైద్యశాల సెంటర్లో సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో, ఎంపీడీఓ కార్యాలయం ఎదురుగా ఉపాధ్యాయ సంఘాలు, ఆర్డీఓ కార్యాలయం వద్ద రెవెన్యూ, పంచాయతీరాజ్‌తో పాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు, మున్సిపల్ కార్యాలయం ఎదురుగా మున్సిపల్ ఉద్యోగులు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. విక్రమ సింహపురి యూనివర్సిటీ కావలి పీజీ సెంటర్ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో ట్రంకురోడ్డుపై వంటావార్పు నిర్వహించారు. కావలి ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు సంఘీభావం తెలిపారు. పలుచోట్ల జరుగుతున్న రిలేదీక్షల్లో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి పాల్గొని సంఘీభావం తెలిపారు. రాత్రి స్థానిక ఏరియా వైద్యశాల వద్ద కోలాటం, నృత్యాలు ప్రమిదలతో నిరసన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో పాఠశాల విద్యార్థులు లక్ష్మీప్రియ థియేటర్ నుంచి వైఎస్సార్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో, బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు. సోనియా దిష్టిబొమ్మను దహనం చేశారు. పోలీస్‌స్టేషన్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 16వ రోజుకు చేరాయి. కలిగిరి ఆర్టీసీ బస్టాండు సమీపంలో వికలాంగులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి విరమింపజేశారు. వరికుంటపాడులో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించి, బస్టాండ్ వద్ద మానవహారం నిర్వహించారు.
గూడూరు జెడ్పీ బాలుర, బాలికల ఉన్నత పాఠశాలల విద్యార్థులు, దివిపాళెం ఉన్నత పాఠశాల విద్యార్థులు పాటలకు నృత్యాలు వేస్తూ రాష్ట్రాన్ని సమైక్యాంగానే ఉంచాలని నినదించారు. ఆర్టీసీ కార్మికులు నోటికి గుడ్డలు కట్టుకుని మౌన ప్రదర్శన చేశారు. జర్నలిస్టులు ఎసై ్స బూట్లు తుడిచి సమైక్యానికి మద్దతు తెలపాలని కోరారు. కోట క్రాస్‌రోడ్డులో విద్యార్థి జేఏసీ నాయకులు చేపట్టిన నిరవధిక దీక్షలు రెండవ రోజూ కొనసాగాయి. చిట్టమూరు మండలం కొత్తగుంటలో విద్యార్థులు రాస్తారోకో చేపట్టి మానవహారం ఏర్పాటు చేశారు. చిల్లకూరు రెవెన్యూ కార్యాలయం ఎదుట ఉపాధ్యాయుల జేఏసీ నిరసన తెలిపారు.
పొదలకూరులో టీచర్లు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. మనుబోలులో జాతీయ రహదారిపై విద్యార్థులు, గ్రామస్తులు రాస్తారోకో చేసి, మానవహారం నిర్వహించారు. నేలటూరులోని ఏపీ జెన్‌కో విద్యుత్ ప్రాజెక్టు ప్రధాన గేటు వద్ద విద్యుత్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు రెండు గ ంటలకు పైగా ధర్నా చేశారు.
ఆత్మకూరులో మున్సిపల్ బస్టాండ్ సెంటర్‌లో వికలాంగులు, విజయమ్మ దీక్షకు మద్దతుగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో బంద్ నిర్వహించారు. మండలంలోని కరటంపాడులో సర్పంచ్ దొరస్వామి ఆధ్వర్యంలో వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు.
సమస్తం సమైక్యం
Published Fri, Aug 23 2013 4:20 AM | Last Updated on Tue, May 29 2018 4:06 PM
Advertisement
Advertisement