నోటిఫికేషన్‌ను విడుదల చేస్తున్న డిప్యూటీ సీఎం బోస్
సాక్షి, అమరావతి/మండపేట: రాష్ట్రంలో దాదాపు 120 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత భూముల సమగ్ర రీ సర్వేకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలంలో భూముల రీ సర్వేకు సంబంధించిన నోటిఫికేషన్‌ను సర్వే సెటిల్‌మెంట్ డైరెక్టర్ ప్రభాకర్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు. జగ్గయ్యపేట మండలంలోని మొత్తం 25 గ్రామాల పరిధిలోగల 66,761 ఎకరాల భూములను రీసర్వే చేయనున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. దీంతో భూముల రీసర్వేకు సంబంధించి అధికారిక ప్రక్రియ ప్రారంభమైనట్లే.
రీసర్వేకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపు
రాష్ట్రంలో సమగ్ర భూ సర్వే నిర్వహిస్తామని ఎన్నికల ముందు ప్రజా సంకల్ప యాత్రలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన విషయం విదితమే. ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా భూముల సమగ్ర రీసర్వే కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించారు. భూముల సమగ్ర రీసర్వే, భూ యజమానులకు శాశ్వత భూహక్కుల కల్పన బిల్లును అసెంబ్లీలో ఆమోదించారు. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు రెవెన్యూ, సర్వే సెటిల్‌మెంట్ విభాగాల అధికారులు సర్వే సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఆధునిక సర్వే యంత్రాలను కొనుగోలు చేశారు. భూ రికార్డుల స్వచ్ఛీకరణ ప్రక్రియ చేపట్టారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నుంచి భూముల సమగ్ర రీసర్వే ప్రారంభించాలని నిర్ణయించి, నోటిఫికేషన్ జారీ చేశారు.
బ్రిటిష్ సర్కారు హయాంలో...
దేశవ్యాప్తంగా బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో భూములను సర్వే చేశారు. రాష్ట్రంలో 120 ఏళ్ల క్రితం భూములను సర్వే చేసి రీసర్వే సెటిల్‌మెంట్ రిజిస్టర్(ఆర్‌ఎస్‌ఆర్) రూపొందించారు. తర్వాత కాలంలో తరాలు మారడం, కుటుంబాలు విడిపోవడం, జనాభా పెరగడం, భూములు చాలామంది చేతులు మారడం, భూకమతాల సైజు తగ్గడం వంటి వాటితో సబ్‌డివిజన్లు/ సర్వేనంబర్లు పెరిగిపోయాయి. భూ వివాదాలు సైతం పెరిగాయి. ఈ తరహా సమ్యల పరిష్కారానికి, భూ రికార్డుల సమగ్రతకు రీసర్వే చేపట్టాలని నిపుణులు సూచించినా గత పాలకులు పట్టించుకోలేదు. జగ్గయ్యపేట మండలంలో ఈ ప్రక్రియ పూర్తయ్యాక, ఈ అనుభవాలతో రాష్ట్రవ్యాప్తంగా భూముల రీసర్వే నిర్వహించాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పట్టుదలతో ఉంది.
రైతులపై నయా పైసా కూడా భారం పడకుండా..
లోపభూయిష్టంగా మారిన భూ రికార్డులను ప్రక్షాళన చేసి, భూ యజమానులకు భరోసా కల్పించేందుకు ప్రభుత్వం భూముల సమగ్ర రీసర్వేను ప్రారంభిస్తోందని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. భూముల సమగ్ర రీసర్వే ప్రాజెక్టు అమలుకు రూ.2,000 కోట్ల వ్యయం అవుతున్నప్పటికీ రైతులు, భూ యజమానులపై నయాపైసా కూడా భారం పడకుండా మొత్తం ప్రభుత్వమే భరించనుందని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ సర్వే, సరిహద్దుల చట్టం–1923 కింద భూముల సమగ్ర సర్వే కోసం సర్వే డైరెక్టర్ తయారు చేసిన నోటిఫికేషన్‌ను పిల్లి సుభాష్ చంద్రబోస్ బుధవారం తూర్పు గోదావరి జిల్లా మండపేటలోని తన క్యాంపు కార్యాలయంలో విడుదల చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి 30 ఏళ్లకోసారి రీసర్వే చేయాల్సి ఉండగా, గత ప్రభుత్వాలు పట్టించుకోలేదని చెప్పారు.
11,158 మంది గ్రామ సర్వేయర్లను నియమించాం
అమెరికా, మలేషియా, సింగపూర్, ఆస్ట్రేలియా దేశాల్లో వినియోగించిన ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారతదేశంలో తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లోనే సమగ్ర రీ సర్వేకు వినియోగిస్తున్నట్టు పిల్లి సుభాష్‌చంద్రబోస్ తెలిపారు. భూ యజమానులకు కచ్చితత్వాన్ని అందించే విధంగా క్రాస్ నెట్‌వర్క్ ద్వారా రీ సర్వే చేస్తారన్నారు. సర్వేయర్ల కొరతను అధిగమించేందుకు రాష్ట్రవ్యాప్తంగా గ్రామ సచివాలయాల ద్వారా 11,158 మంది గ్రామ సర్వేయర్లను నియమించి, వారికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చామని పేర్కొన్నారు. 2022 మార్చి నాటికి రాష్ట్రవ్యాప్తంగా సర్వే పూర్తి చేసి, పటిష్టమైన నూతన రెవెన్యూ రికార్డులు రూపొందిస్తామని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment