
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో సాగునీటి పనులకు రూ.58,064 కోట్లు ఖర్చు చేసినా ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాకపోవడం, అదనంగా ఆయకట్టుకు నీళ్లందించలేకపోవడం వెనుక గుట్టును రట్టు చేసేందుకు కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులవారీగా ఎంత ఖర్చు చేశారు? ఇప్పటివరకూ చేసిన పనులు ఎన్ని? మిగిలిపోయినవి ఎన్ని? అదనంగా ఆయకట్టుకు నీళ్లందించారా? తదితర అంశాలపై వివరాలు ఇవ్వాలని కోరుతూ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సాగునీటి పనులపై సర్కారు సమర్పించే వివరాలు, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసి అసెంబ్లీ శీతాకాల సమావేశాల నాటికి పూర్తి స్థాయి నివేదికను సభకు సమర్పించాలని కాగ్ నిర్ణయించింది. మరోవైపు 2016–17, 2017–18 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి సాగునీటి పనులపై శాసనసభకు కాగ్ సమర్పించిన నివేదికల్లో ప్రస్తావించిన అంశాలపై తీసుకున్న చర్యల వివరాలను వెల్లడించాలని లేఖలో కోరారు.
ప్రాజెక్టులవారీగా సమగ్ర విచారణకు సిద్ధం..
నాలుగున్నరేళ్లుగా సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఖర్చు, పనుల పురోగతిపై సమర్పించిన వివరాలను అధ్యయనం చేసి క్షేత్రస్థాయిలో విచారణ జరపాలని కాగ్ నిర్ణయించింది. భారీ ఎత్తున నిధులు ఖర్చు చేసినా ఒక్క ప్రాజెక్టూ పూర్తి కాకపోవడంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించనుంది. సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం పేరుతో పాత కాంట్రాక్టర్లపై 60 సీ నిబంధన కింద వేటు వేసి మిగిలిపోయిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి టెండర్లు లేదా నామినేషన్ పద్ధతిలో కొంత మంది కాంట్రాక్టర్లకు అప్పగించడం, కొత్త కాంట్రాక్టర్లకు అప్పగించినా ప్రాజెక్టులు పూర్తికాకపోవడాన్ని గుర్తించిన కాగ్ ఈ వ్యవహారం వెనుక మతలబును శోధించాలని నిర్ణయించింది. ప్రాజెక్టులవారీగా ఆడిట్ నివేదిక రూపొందించి శీతాకాల సమావేశాలనాటికి శాసనసభలో ప్రవేశపెట్టనుంది.
రెట్టింపు నిధులు ఖర్చయినా..
చంద్రబాబు సీఎంగా బాధ్యతలు స్వీకరించాక 2014 జూలై 28న సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా మిగిలిన ప్రాజెక్టులను రూ.17,368 కోట్లతో పూర్తి చేస్తామంటూ శ్వేతపత్రంలో స్పష్టం చేశారు. అయితే నాలుగున్నరేళ్లలో పోలవరం, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి మినహా మిగిలిన ప్రాజెక్టులకు రూ.44 వేల కోట్లను ఖర్చు చేసినా ఇప్పటివరకూ ఒక్కటి కూడా పూర్తయిన దాఖలాలు లేవు. అదనంగా ఆయకట్టుకు నీళ్లందించిన ఉదంతాలు లేవు. నిధులు భారీగా ఖర్చు చేసినా ఫలితం లేకపోవడంతో కాగ్ వివరాల సేకరణకు సిద్ధమైంది.
ఆ నివేదికలపై ఏ చర్యలు తీసుకున్నారో చెప్పరేం?
సాగునీటి ప్రాజెక్టులపై కాగ్ ఇప్పటికే రెండుసార్లు శాసననభకు నివేదికలు సమర్పించింది. 2016–17లో జరిపిన ఆడిటింగ్‌లో పట్టిసీమ ఎత్తపోతలలో అక్రమాలు చోటుచేసుకున్నట్లు ధ్రువీకరించింది. 2017–18 ఆడిటింగ్‌లో ప్రాజెక్టుల అంచనా వ్యయం భారీగా పెంచేయడాన్ని తప్పుబట్టింది. ఈ రెండు నివేదికల్లో కాగ్ ప్రస్తావించిన అంశాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలంటూ ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ పలదఫాలు రాష్ట్ర ప్రభుత్వానికి, జలవనరులశాఖకు, ఆర్థికశాఖకు లేఖలు రాశారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని ఓ సీనియర్ అధికారి తెలిపారు. తాజాగా ఇదే అంశంపై సెప్టెంబరు 15న ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ మరోసారి లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఆర్థిక శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్ర కాగ్ నివేదికల్లో ప్రస్తావించిన అంశాలపై తక్షణమే వివరణ ఇవ్వాలని జలవనరుల శాఖను కోరారు.
Comments
Please login to add a commentAdd a comment