కంప్యూటర్ యంత్రం.. భవితకు మంత్రం
పాకాల : ప్రస్తుత పోటీ ప్రపంచంలో కంప్యూటర్ పరిజ్ఞానం అందరికీ తప్పనిసరైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యార్థుల తల్లిదండ్రులు వేసవి కాలంలో తమ పిల్లలకు కంప్యూటర్ పరిజ్ఞానం కోసం శిక్షణ ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. అదే విధంగా విద్యార్థులు చిన్నతనం నుంచే కంప్యూటర్‌పై అవగాహన తప్పనిసరిగా మారింది. వేసవి సెలవుల్లో ఆట, పాటలపై ఆసక్తి చూపే విద్యార్థులు ఇప్పుడు ఏ కొంచెం సమయం దొరికినా కంప్యూటర్ ముందు వాలిపోతున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో పలు చోట్ల శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానంపై శిక్షణను ఇస్తున్నారు.
ఇందులో భాగంగా నియోజకవర్గంలో పలు చోట్ల కంప్యూటర్ శిక్షణా తరగతులు ప్రారంభమైయ్యాయి. మరికొన్ని త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో ఆరు నుంచి పదో తరగతి వరకు రాజీవ్ విద్యామిషన్ సహకారంతో నిట్ సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చేవారు. క్రమేణా నిట్‌ను తొలగించడంతో ఉపాధ్యాయులే విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. కంప్యూటర్ ఆవశ్యకత పెరుగుతున్న ప్రారంభ రోజుల్లో చాలా చోట్ల స్వచ్చంధ సంస్థలు ముందుకొచ్చి ఉచితంగా విద్యార్థులకు కంపూటర్ శిక్షణను అందించేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి పరిస్థితులు కానరావడం లేదు.
దీంతో డబ్బులు వెంచించి కంప్యూటర్ కోర్స్‌ల్లో చేరలేని నిరు పేద విద్యార్థులు దిగులు చెందుతున్నారు. దయాహృదయం గల ధనికులు, సేవభావం కలిగిన వ్యక్తులు ఉచితంగా కంప్యూటర్ శిక్షణను అందించగలిగితే పేద విద్యార్థులు కూడా కంప్యూటర్ కోర్స్‌లు నేర్చుకునే అవకాశం ఉంటుందని ప్రజలు బావిస్తున్నారు.