విశాఖపట్నం : సముద్ర లోతు జలాల్లో చేపల వేట సాగించే అంశంపై ఈ నెల 6వ తేదీన కోస్తాంధ్ర సదస్సు విశాఖపట్నంలో జరుగనుంది. స్థానిక జెడ్పీ సమావేశ మందిరంలో శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు ఉన్న తొమ్మిది జిల్లాల పరిధిలో ఈ సదస్సు జరుగనుంది.
సాధరణంగా సముద్రంలో 100 నుంచి 200ల మీటర్ల లోతు జలాల్లో మాత్రమే వేట సాగిస్తున్నారు. అయితే ప్రస్తుతం సముద్రంలో జరుగుతున్న డ్రెడ్జింగ్ కార్యకలాపాల వల్ల తీరప్రాంతంలో ఉండే మత్స్య సంపద సురక్షిత ప్రాంతాలకు తరలిపోతుంది. దీంతో వంద మీటర్ల లోతు జలాల్లో మత్స్యసంపద దొరకని పరిస్థితి ఏర్పడింది.
సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ(సీఐఎఫ్‌టీ) ఆధ్వర్యంలో డీప్ సీ ఫిషింగ్‌పై గత దశాబ్ద కాలంగా విస్తృత పరిశోధనలు జరుగుతున్నాయి. సముద్ర లోతు జలాల్లో ఊహించనంత మత్స్యసంపద ఉందని, కనీసం వెయ్యి మీటర్ల లోతు జలాల్లో వేట సాగిస్తే ప్రపంచంలో మరెక్కడా దొరకని మత్స్య సంపద మన తీర జలాల్లోఉన్నట్టుగా ఈ పరిశోధనల్లో గుర్తించారు.
తూర్పుతీరంలోని మత్స్యకారుల వద్ద ఉన్న మెకానైజ్డ్ బోట్లు 100-150మీటర్ల లోతు జలాల్లో వేట సాగించేందుకు మాత్రమే ఉపయోగపడతాయి. కనీసం 500 మీటర్ల నుంచి 1000 మీటర్లు ఆ పైబడిన లోతు జలాల్లో వేట సాగించాల్సిన ఆవశ్యకత నెలకొంది. రానున్న ఐదేళ్లలో ఈ లోతు జలాల్లో కనీసం 200 బోట్లతోనైనా వేట సాగించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని మత్స్యశాఖ చూస్తోంది.
ఈ నేపథ్యంలో సముద్ర లోతు జలాల్లో చేపలవేట ఆవశ్యకత, అనుకూలతలపై చర్చించేందుకు తొలిసారిగా కోస్తాంధ్ర పరిధిలోని తొమ్మిది జిల్లాల సదస్సు విశాఖ తీరంలో జరుగనుంది. 6వ తేదీ ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు జరుగనున్న ఈ సదస్సుకు తొమ్మిది జిల్లాల మత్స్యశాఖ అధికారులు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు, మెకానైజ్డ్ బోటు యజమానులు, మత్స్యశాఖ నిపుణులు హాజరుకానున్నారని జిల్లా మత్స్యశాఖ జేడీ కోటేశ్వరరావు తెలిపారు.
లోతు జలాల్లో చేపల వేటపై సదస్సు
Published Sat, Jul 4 2015 7:34 PM | Last Updated on Tue, Oct 16 2018 3:04 PM
Advertisement
Advertisement