
వాకౌట్ అనంతరం కౌన్సిల్ బయట నిరసన తెలుపుతున్న కార్పొరేటర్లు
తూర్పుగోదావరి, కాకినాడ: ‘‘కార్పొరేటర్లంటే గౌరవం లేదు. ప్రొటోకాల్ కూడా పాటించడం లేదు. అదేమని అడిగితే సమాధానం కూడా లేదు. ఇలాంటప్పుడు కౌన్సిల్ సమావేశంలో ఉండాల్సిన అవసరం ఏముంది?’’ అంటూ కాకినాడ నగరపాలక సంస్థ అధికారుల తీరుపై కార్పొరేటర్లు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కమిషనర్, అదనపు కమిషనర్ల తీరును నిరసిస్తూ సమావేశం నుంచి వాకౌట్ చేయడంతో కోరం లేని కారణంగా కౌన్సిల్‌ను వాయిదా వేస్తున్నట్టు మేయర్ సుంకర పావని ప్రకటించారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం మేయర్ సుంకర పావని అధ్యక్షతన శుక్రవారం ప్రారంభమైంది. అజెండాలోని తొలి అంశంపై చర్చ సందర్భంగానే అధికారుల తీరుపై సభ్యులు విరుచుకుపడ్డారు. ప్లాస్టిక్ నిషేధం విషయంలో అధికారులు జీవోలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి మండిపడ్డారు. 50 మైక్రాన్ల మందం కలిగిన ప్లాస్టిక్ కవర్ల వినియోగంపై జీవోకు విరుద్ధంగా అధికారులు తీసుకున్న నిర్ణయం చిన్న వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించేదిగా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొత్తం ప్లాస్టిక్‌ను అప్పటికప్పుడు నిషేధించాలన్న నిర్ణయంకన్నా దశలవారీగా అవగాహన కల్పించి అమలు చేయాలని మరో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ ఎంజీకే కిశోర్, టీడీపీ కార్పొరేటర్ మల్లాడి గంగాధర్ హితవు పలికారు.
ప్లాస్టిక్ కవర్ల తయారీదార్లను నియంత్రించకుండా హడావుడిగా ఈ నిర్ణయాలు ఏమిటని ప్రశ్నించారు. పైగా ఈ అంశాన్ని కౌన్సిల్ దృష్టికి తీసుకురాకుండా, ముందుగా నిర్ణయం తీసుకుని, ర్యాటిఫికేషన్‌కు ఎలా తీసుకొస్తారని టీడీపీ కార్పొరేటర్లు చోడిపల్లి ప్రసాద్, మల్లాడి గంగాధర్‌తోపాటు, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు కూడా గట్టిగా నిలదీశారు. ఇదే అంశంపై చర్చ జరుగుతుండగా.. ప్లాస్టిక్ నిషేధాన్ని అమలు చేస్తూ ర్యాటిఫికేషన్ చేసిన తరువాత ఇంతవరకూ ఎన్ని దాడులు చేశారో, ఎంత ఫీజు వసూలు చేశారో చెప్పాలని కార్పొరేటర్ కంపర రమేష్ వివరణ కోరారు. దీనికి అదనపు కమిషనర్ సత్యవేణి సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో అధికారులు సరైన సమాచారం లేకుండా కౌన్సిల్ సమావేశాలకు ఎలా వస్తున్నారని కార్పొరేటర్లందరూ నిలదీశారు. వివిధ అంశాల్లో తమపట్ల అధికారుల వ్యవహార శైలిని దుమ్మెత్తిపోశారు. గృహనిర్మాణ డీడీల విషయంలో కూడా ఎన్నో అవకతవకలు జరిగాయని, వీటిపై కూడా అధికారులు సరైన వివరణ ఇవ్వడం లేదని రాగిరెడ్డి చంద్రకళాదీప్తి మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో తాము కౌన్సిల్ సమావేశంలో ఉండలేమంటూ వాకౌట్ చేశారు. దీంతో కోరం లేదని పేర్కొంటూ మధ్యాహ్నం 2 గంటలకు సమావేశాన్ని మేయర్ వాయిదా వేశారు. అప్పుడు కూడా కార్పొరేటర్లు హాజరు కాకపోవడంతో కౌన్సిల్‌ను నిరవధికంగా వాయిదా వేసినట్టు ప్రకటించారు.