కౌన్సిల్లో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ పుణ్యశీల
పటమట(విజయవాడ తూర్పు): డ్వాక్వా రుణ మాఫీ, ఇష్టారాజ్యంగా రోడ్ల తవ్వకం తదితర అంశాలపై ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలపై కౌన్సిల్ సమావేశం వాడివేడిగా జరిగింది. పాలకపక్ష అనూకూల నిర్ణయాలు తీర్మానించుకునేందుకు, ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అంశాలను ఆఫీసు రిమార్కులకు పంపే వేదికగా ఇది మారింది. సోమవారం నగర మేయర్ కోనేరు శ్రీధర్ అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. ప్రతిపక్ష సభ్యులు పలు అంశాలను ప్రస్తావిస్తుంటే యథాలాపంగా ప్రతిపక్షాల గొంతు నొక్కేసింది. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలను కౌన్సిల్ తీర్మానం తిరస్కరించి ప్రభుత్వానికి పంపినప్పటికీ ప్రభుత్వం మాత్రం ప్రత్యేక జీవోలు తీసుకువచ్చి స్థానిక సంస్థలకున్న స్వయంప్రతిపత్తిని నీరుగారుస్తోందని సభ్యులు అసంతృప్తి వ్యక్తంచేశారు.
ప్రశ్నోత్తరాల సమయంలో సీపీఎం కార్పొరేటర్ గాదే ఆదిలక్ష్మీ లేవనెత్తిన ప్రశ్నలకు అధికారులు అసంతృప్తిగా సమాధానాలు ఇస్తున్నారని, అధికారులు కౌన్సిల్‌ను ఖాతరు చేయడం లేదని ప్రస్తావించడంతో సభ్యులంతా ఏకతాటిపైకి వచ్చి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ షేక్ బీజాన్‌బీ మైనార్టీ ప్రాంతాల్లో జరిగే అభివృద్ధి పనులపై ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంపీ, ఎమ్మెల్యేల నుంచి తన వార్డుకు నిధులు రాని పక్షంలో కార్పొరేషనే ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. 177 అంశాలు కౌన్సిల్ ఎజండాకు రాగా అందులో 61 అంశాలను ఆమోదించారు. 22 అంశాలు ఆఫీస్ రిమార్కుకు కోరగా, 24 అంశాలు ఆఫీస్ వారు తగు చర్యలు తీసుకునేలా తీర్మానం చేశారు. మిగిలిన అంశాలను స్థానిక అభ్యంతరాలతో వాయిదా వేశారు.
రుణమాఫీపై రగడ
వైఎస్సార్ సీపీ ఫ్లోర్‌లీడర్ బండి పుణ్యశీల మాట్లాడుతూ నగరంలో పీఎంఈవై అమలు తీరుపై గందరగోళ వాతావరణం నెలకొందని దీనిపై స్పష్టత ఇవ్వాలని కోరారు. నగరంలో 12 వేలకు పైగా డ్వాక్వా గ్రూపులు ఉన్నాయని, ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం వల్ల స్వయం సహాయక గ్రూపులు రోడ్డున పడే పరిస్థితి నెలకొందని చెప్పారు. దీనిపై టీడీపీ నాయకులు ఆమెతో వాగ్వాదానికి దిగారు. వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు బుల్లా విజయ్, చోడిశెట్టి సుజాత, అవుతు శ్రీశైలజ, బీజాన్‌బీ, వామపక్ష సభ్యురాలు ఆదిలక్ష్మీ మాట్లాడుతూ నగరంలో రుణమాఫీ జరగడం లేదని చెప్పారు. దీంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా భావించిన పాలకపక్షం చకచకా పలు తీర్మానాలు ఆమోదించుకుంది. వీధులకు, భవనాలకు పేర్లు పెట్టే అంశాలపై వైఎస్సార్‌సీపీ సభ్యులు అధికారపక్షాన్ని నిలదీశారు. అజిత్‌సింగ్‌నగర్‌లోని ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ని«ధులతో నిర్మించిన కమ్యూనిటీ భవనానికి స్థానికులు బూదాల ఆదాం పేరు ప్రస్తావించడంపై ప్రతిపక్ష సభ్యులు అభ్యంతరం చెప్పారు. ఇప్పటికే కౌన్సిల్ ఆమోదం లేకుండా భవనానికి పేరెలా పెట్టారని పుణ్యశీల నిలదీశారు.
కౌన్సిల్ తీర్మానాలు..
♦ అడ్‌హక్ కమిటీ ప్రతిపాదనకు కౌన్సిల్ ఆమోదించింది.
♦ 47వ డివిజన్‌లో నిర్మించిన అంతిమయాత్ర భవనం నిర్వహణ వీఎంసీనే చూస్తుందని కౌన్సిల్ తీర్మానించింది.
♦ నగరంలోని వివిధ ప్రాంతాల్లో నూతన దోభీఘాట్లు, మరమ్మతులకు గురైన దోభీఘాట్లపై వచ్చిన ప్రతిపాదనపై కౌన్సిల్ ఆమోదం తెలిపింది.
భాగ్య నగర్ గ్యాస్ ఏజెన్సీపై..
నగరంలో ఇంటింటికీ పైప్‌లైన్ల ద్వారా గ్యాస్ అందించేందుకు భాగ్యనగర్ గ్యాస్ ఏజెన్సీ ప్రతిపాదనపై కౌన్సిల్లో చర్చ జరిగింది. చాలా ప్రాంతాల్లో సంబంధిత సంస్థ సిబ్బంది రోడ్లను తవ్వేస్తున్నారని, తవ్విన తర్వాత వాటిని పూడ్చకపోవడంతో రోడ్లపై ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ఓవైపు ఎల్‌అండ్‌టీ, మరోవైపు ఇంజినీరింగ్, ఇంకోవైపు గ్యాస్ ఏజెన్సీ ఇలా నగరంలోని రోడ్లను తవ్వుతుండటంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని కౌన్సిల్ సభ్యులు ప్రస్తావించారు. ఈ ఏజెన్సీకి ఇప్పుడు నగరంలో నాలుగు ప్రాంతాల్లో ఫిల్లింగ్ స్టేషన్ల నిమిత్తం భూములను కేటాయించాలని ప్రతిపాదన రావడంతో సభ్యులు అభ్యంతరం తెలిపారు. భూముల కేటాయింపు ప్రతిపాదనపై కౌన్సిల్ ఆఫీస్ రిమార్కుకు పంపింది.
ఎమ్మెల్యేలపై వ్యతిరేక గళం
నగరంలోని ఎమ్మెల్యేలు కార్పొరేషన్‌కు ఒనగూరే నిధులపై కూడా కన్నేయడంపై కౌన్సిల్ సభ్యులు ముక్తకంఠంతో వ్యతిరేకించారు. తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఆరో డివిజన్‌లో రూ. 68.65 లక్షల వ్యయంతో ప్రతిపాదించిన సీసీ రోడ్డుపై కౌన్సిల్‌ల్లో ఆసక్తికర చర్చ జరిగింది. కార్పొరేటర్లు ఈ ప్రతిపాదనను ఆమోదించినప్పటికీ స్థానిక సంస్థలు నిర్వీర్యం అవుతున్నాయని, ఎమ్యెల్యేలకు ప్రత్యేక నిధులు కేటాయించడం ఇప్పటి వరకు వీఎంసీకి అలవాటులేదని, ఈ నూతన సంప్రదాయాన్ని భవిష్యత్‌లో కొనసాగించకూడదని సభ్యులు కోరారు. కార్పొరేషన్‌లో బీపీఎస్ ద్వారా వచ్చిన ఆదాయంలో ఎమ్యెల్యేలకు రెండు కోట్ల చొప్పున కే టాయించామని, ఆ పరిధి దాటితే తప్పనిసరిగా మేయర్ సమక్షంలో ఇంజినీరింగ్ విభాగం అధికారులు అంచనాలతో సహా పనుల వివరాలను సమర్పించాలని పేర్కొన్నారు.
చెన్నుపాటి గాంధీ వర్సెస్‌కమిషనర్ నివాస్
నగరంలోని వరద నీటి ముంపును నిరోధించేందుకు ఎల్‌అండ్‌టీ చేపట్టిన స్ట్రామ్‌వాటర్ పనులు నగర వాసులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ఎల్‌ఐసీ కాలనీలో జరుగుతున్న ఈ పనులు నిలుపుదల చేయాలని కౌన్సిల్ సభ్యులు ప్రతిపాదించగా దీనిపై చర్చ జరుగుతున్న సమయంలో కార్పోరేటర్ గాంధీకి, కమిషనర్ జె. నివాస్‌కు మధ్య మాటల యుద్ధం జరిగింది. ఓ సందర్భంలో కమిషనర్ ఎల్‌అండ్‌టీ సంస్థకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని గాంధీ ఆరోపించినప్పటికీ కమిషనర్ సుతిమెత్తగా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment