పశ్చిమగోదావరి , ఏలూరు టౌన్ : మన జిల్లా పోలీసులకు పదోన్నతుల్లో పరాభవం తప్పలేదు. మూడు దశాబ్దాలుగా చాలామంది సుదీర్ఘంగా ఉత్తమ సేవలందించినా వారి కష్టానికి తగ్గ ఫలితం దక్కలేదు. సర్వీసు రికార్డుల ఆధారంగా సీనియార్టీ జాబితా తయారీలో జరిగిన తప్పిదాలు జిల్లాపోలీసులకు శాపంగా మారాయి. ఏలూరు రేంజ్ పరిధిలో తూర్పు, కృష్ణా జిల్లాల్లోని పోలీసులకు పదోన్నతులు లభిస్తే.. పశ్చిమగోదావరి జిల్లా పోలీసులు మాత్రం ఉన్నతాధికారులు, న్యాయస్థానాల చుట్టూ కాళ్ళు అరిగేలా తిరుగుతూనే ఉన్నారు. ఇతర జిల్లాల్లోని తమకంటే జూనియర్లు సబ్ ఇన్‌స్పెక్టర్లుగా ఉద్యోగోన్నతి పొందుతుంటే వీరు మాత్రం ఉద్యోగవిరమణ ముందైనాపదోన్నతి లభిస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇప్పటికైనా జిల్లాలోని 19మంది ఏఎస్సైలకు సబ్ ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతులు కల్పించా లని వారు ఉన్నతాధికారులను అభ్యర్థిస్తున్నారు.జిల్లా పోలీసు శాఖలో 1984 జనవరి 13న సర్వీసులో ప్రవేశించిన కొందరు కానిస్టేబుళ్లు ఏళ్లు గడుస్తున్నా పదోన్నతి పొందలేని దీనస్థితిలో ఉన్నారు. సుమారు 19మంది కానిస్టేబుళ్లకు ఎస్సైగా ప్రీ ప్రమోషనల్ ట్రైనింగ్ ఇచ్చి పదోన్నతులు కల్పించాల్సి ఉన్నా నిబంధనలు అడ్డుకుంటున్నాయి. వారు చేయని తప్పుకు బాధ్యత వహిస్తూ పోలీస్ స్టార్ భుజాన వేసుకుందామనే ఆశ అడియాసగానే మిగిలిపోతుందనే ఆందోళనలో ఉన్నారు. ఏపీ పరిపాలనా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా పదోన్నతుల్లో వారికి అన్యాయం జరిగిందని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ తీర్పుపై పోలీస్ శాఖ న్యాయపరమైన వివరణకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు ఏమి నిర్ణయం తీసుకుంటారో అనే ఆశతో బాధితులు ఎదురుచూస్తున్నారు.
జాబితాలో తప్పులే కారణమా!
ఏలూరు రేంజ్ పరిధిలో పోలీసు శాఖలో హెడ్‌కానిస్టేబుల్ స్థాయి సిబ్బంది సినియార్టీ జాబితాలో తప్పులు దొర్లినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు ఏఎస్సై ఏవీఎన్ హనుమంతరావు సీనియార్టీ జాబితాలో 185వ నంబర్‌లోనూ, మరోసారి 230 లోనూ ఉన్నట్లు తెలుస్తోంది. సీనియార్టీ జాబితాలో డబ్లింగ్‌లు కూడా నమోదు అయ్యాయనే ఆరోపణలు ఉన్నాయి. 2010 జనవరి 27 నుంచి ఏప్రిల్ 27వరకూ మూడు నెలలపాటు హైదరాబాదు పోలీసు ట్రైనింగ్ స్కూల్లో హెచ్‌సీలుగా పదోన్నతికి శిక్షణ పొందారు. ప్రస్తుతం ఈ పోలీసు సిబ్బందికి 34ఏళ్ల సర్వీసు ఉంది. కానీ ఏలూరు రేంజ్ సీనియార్టీ జాబితా మేరకు హెచ్‌సీ/ఏఎస్‌ఐల సీరియల్ నంబర్ 73(2) ఏపీ పోలీస్ మాన్యువల్ పార్ట్–1లో జిల్లా పోలీసుల స్థానమేంటో తెలియని సందిగ్ధత నెలకొంది. కృష్ణా, తూర్పు గోదావరి, విజయవాడ సిటీలో పనిచేస్తున్న పోలీ సులకు పదోన్నతిలో భాగంగా డేట్ ఆఫ్ జాయినింగ్ కాకుండా, డేట్ ఆఫ్ ప్రమోషన్‌ను తీసుకున్నారని, ఈ కారణంగానే జిల్లా పోలీసులకు అన్యాయం జరిగిందని అంటున్నారు. దీనిపై పోలీస్ శాఖలో పెద్ద చర్చే జరుగుతున్నా.. ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్లినా సమస్య పరి ష్కారం కాకుండానే మిగిలిపోయిందని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియార్టీ జాబితాలో చోటుచేసుకున్న తప్పులను సరిదిద్దటం కష్టమేనని, కానీ ఉన్నతాధికారులు తలచుకుంటే అసాధ్యమేమీ కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉద్యోగవిరమణ చేసే నాటికైనా తమకు పదోన్నతి లభిస్తుందనే ఆశాభావాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment