ఎస్పీపై ఎస్సై ఫిర్యాదు
చింతలపూడి: అనారోగ్యంతో మెడికల్ లీవ్లో ఉన్న తనను కులం పేరుతో దూషించడమే కాక , నిత్యం మానసిక వేధింపులకు గురి చేస్తున్నాడని సాక్షాత్తు జిల్లా సూపరింటెండెంట్ పై ఓ ఎస్సై ఫిర్యాదు చేశాడు. ఎస్పీతోపాటు డీఎస్‌పీ, స్పెషల్ బ్రాంచ్ హెచ్‌సిలు కూడా క్షోభకు గురిచేశారని వాపోతున్నాడా ఎస్సై. వివరాల్లోకి వెళితే..
పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఎస్సైగా పనిచేస్తున్న డి. రాంబాబు నాయక్.. జ్వరంతో బాధపడుతుండటంతో నవంబర్ 5 నుంచి 7 వరకు మెడికల్ లీవ్ కావాలని ఉన్నతాధికారులను కోరాడు. అందుకు నిరాకరించిన అధికారులు అతడికి సెలవు మంజూరుచేయకపోగా గ్రౌహౌండ్స్ ట్రైనింగ్ డ్యూటీ వేశారు. డ్యూటీకి వెళ్లలేనని తేల్చిచెప్పడంతో తనను కులంపేరుతో దూషించారని ఎస్సై రాంబాబు ఉన్నతాధికారులపై ఫిర్యాదుచేశారు.
ఈమేరకు తన భార్యతో కలిసి ఎస్సై రాంబాబు శనివారం రాత్రి చింతలపూడి పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదుచేశారు. ఎస్సీ భాస్కర్ భూషణ్, జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె వెంకట్రావు, స్పెషల్ బ్రాంచ్ హెచ్ సిలు ప్రభాకర్‌రావు, పిసి సత్యన్నారాయణలపై చర్యలు తీసుకోవాలని అభ్యర్థించాడు. అనంతరం ఎస్‌ఐ రాంబాబు విలేఖరులతో మాట్లాడుతూ.. గత నెల 28 న ఓ కేసు విషయమై ఎస్సీ తనకు ఫోన్ చేశారని, అకారణంగా కులంపేరుతో దూషించారని చెప్పాడు. ఎస్‌పిపై అట్రాసిటి సెక్షన్ క్రింద కేసు నమోదు చేసి చర్యలు తీసుకుని తనకు రక్షణ కల్పించాలని కోరారు.