వేంపల్లె, న్యూస్‌లైన్ : పంటల బీమా ప్రీమియంను రైతులు చెల్లించేందుకు మీసేవ కేంద్రాల వద్దకు భారీగా రావడంతో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. వేంపల్లెలో ఉన్న నాలుగు మీసేవ కేంద్రాల వద్దకు రైతులు భారీగా వచ్చారు. మంగళవారం పంటల బీమా ప్రీమియం గడువు చివరి రోజు కావడంతో రైతుల తొందరపాటుకు అంతులేకుండా పోవడంతో తోపులాట జరిగింది. దీంతో ఉదయం నుంచి ఆయా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.
జిల్లా వ్యాప్తంగా జమ్మలమడుగు మినహా దాదాపు 40వేల మంది రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉండగా.. ఇందులో 10వేల మంది రైతులు ప్రీమియం చెల్లించినట్లు లెక్కలు చెబుతున్నాయి.. దాదాపు 30వేల మంది రైతులు ప్రీమియం చెల్లించాల్సి ఉండగానే గడువు ముగియడంతో తీవ్ర నిరాశకు లోనయ్యారు. బుధవారం నూతన సంవత్సర వేడుకలు కావడంతో ఒకవైపు ప్రీమియం చెల్లించకపోవడంతో నిరాశగానే ఉన్నారు. మంగళవారం 11గంటల దాకా సమయం ఉండటంతో మీసేవ కేంద్రాల వద్ద అలాగే వేచి ఉన్నారు. అధికారులకు సమయం వెచ్చించాలని డిమాండు చేసినా ఫలితంలేదు.
తహశీల్దార్ ఏమంటున్నారంటే.. :
ఈ విషయమై తహశీల్దార్ మధుసూదన్‌రెడ్డి, ఏడీఏ జమ్మన్నలను వివరణ కోరగా.. గడువు పెంచేందుకు వీలు లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పద్ధతి కాబట్టి తమ చేతుల్లో ఏమీ లేదని చెప్పారు. ఇప్పటికే కలెక్టర్, కమిషనర్ల దృష్టికి తీసుకెళ్లామని.. గడువు పెంచే పరిస్థితి లేదన్నారు. తహశీల్దార్ మధుసూదన్‌రెడ్డి మాత్రం ప్రీమియం చెల్లించని రైతులు ఒక జాబితా తయారు చేసి తమకు అందించాలని.. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి తెలియజేస్తామన్నారు.
మీ సేవ కేంద్రాల వద్ద గందరగోళం
Published Wed, Jan 1 2014 4:34 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM
Advertisement
Advertisement