
అగ్రిగోల్డ్ చిహ్నం
సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ కంపెనీ డైరెక్టర్ అవ్వా సీతారామ్‌ను అరెస్ట్ చేసినందుకు పోలీసులకు అభినందనలు తెలియ జేస్తున్నట్లు అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘మూడేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న సీతారాం వెనక ఏదో అదృశ్య శక్తి ఉంది. అదే ఇప్పటిదాకా రక్షిస్తూ వచ్చింది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం జరగకుండా సీతారాం ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అవ్వా సోదరుల కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా జప్తు చేయాలి. మే 30వ తేదీన విజయవాడ, గుంటూరు నుంచి ఛలో సచివాలయం పేరిట పాదయాత్ర చేపడుతున్నాం. పాదయాత్రను అడ్డుకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అగ్రిగోల్డ్ బాధితుల్లో లక్షలోపు డిపాజిట్ చేసిన వారికి ముందస్తుగా రూ.20 వేలు చెల్లించేలా చర్యలు తీసుకోవాల’ని డిమాండ్ చేశారు.
‘అగ్రిగోల్డ్ నిందితుడు అవ్వా సీతారామ్‌ను సోమవారం రాత్రి అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నాం. ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు చేయించాం. ప్రస్తుతం అవ్వా సీతారాం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. అన్ని విధాలా విచారణకు సహకరిస్తున్నారు. కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు లభించాయి. వాటి ఆధారంగా విచారణం చేస్తున్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేంత సమయం లేదు. కాబట్టి మెట్రోపాలిటన్ కోర్టుకు తీసుకెళ్లి హాజరుపరుస్తాం. కేసు కూడా ఫైనల్ స్టేజ్‌కి వచ్చింది. ట్రాన్సిస్ అరెస్ట్ వారెంట్ కూడా దొరికింద’ని ఏపీ సీఐడీ పోలీసులు ఢిల్లీలో వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment