Muppalla Nageswara rao
-
వైఎస్ జగన్ నిర్ణయం పట్ల హర్షాతిరేకాలు
సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేబినెట్ తీసుకున్న నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ నిర్ణయం పట్ల అగ్రిగోల్డ్ బాధితుల సంఘం గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చొరవతో తొమ్మిది లక్షల మంది బాధితులకు ఒకేసారి న్యాయం జరుగనుందన్నారు. అగ్రిగోల్డ్ బాధితుల సంఘం తరుపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. 9 లక్షల మంది 20 వేల లోపు ఉన్న అగ్రిగోల్డ్ బాధితులకు 1150 కోట్లు ఇవ్వాలని కాబినెట్ నిర్ణయం తీసుకోవడంపై బాధితుల తరుఫున ధన్యవాదాలు తెలిపారు. మంగళవారం విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ.. నిరంతర పోరాట ఫలితంగానే ఈ నిర్ణయం తీసుకున్నారని అభిప్రాయపడ్డారు. ‘‘మల్టీ లెవెల్ స్కీంల వల్ల అమాయకులు మోసపోయి, ఆర్ధికంగా నష్టపోతున్నారు. గతంలో 250 కోట్లు ఇస్తున్నామని దీక్ష విరమింపజేశారు, కానీ ఒక్క బాధితుడికి కూడా న్యాయం జరగలేదు. ఈ ప్రభుత్వం 1150 కోట్లు ఇస్తామనడం చిన్న విషయం కాదు. ఇప్పుడున్న మంత్రులు ఎదో ఒక దశలో మా ఉద్యమంలో పాల్గొన్న వారే. బినామీ ఆస్తులను కూడా వెంటనే అటాచ్ చేయాలి. ఈ తరహా మార్కెటింగ్ కంపెనీలను పూర్తిగా రద్దు చేయాలి’’ అని అన్నారు. -
‘కోర్టు తీర్పే.. ఈ పరిస్థితికి కారణం’
సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగడం లేదనీ, ఈ నెల 21 హాయ్‌లాండ్‌ను ముట్టడిస్తామని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు వెల్లడించారు. అక్టోబర్ 31 నాటికి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేయకపోతే ఆందోళన చేస్తామని గతంలోనే హెచ్చరించామని అన్నారు. హాయ్ ల్యాండ్ ముమ్మాటికీ అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చెందినదేనని అన్నారు. హాయ్‌లాండ్ అగ్రిగోల్డ్ ప్రాపర్టీ కాదని తీర్పు చెప్పి హైకోర్టు ఈ చిత్రమైన పరిస్థితి కారణమైందని వాపోయారు. హైకోర్టుని తప్పుదోవ పట్టించేందుకు అగ్రిగోల్డ్ కేసులో బెయిల్ మీద బయటకొచ్చిన కొంతమంది ప్రయత్నిస్తున్నారనీ, వారి బెయిల్ రద్దు చేయాలని కోరారు. హాయ్‌ల్యాండ్ ప్రాపర్టీ వివరాలను కోర్టు సమక్షంలో అగ్రిగోల్డ్ యజమాన్యం చెప్పిందని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు ఆ ఆస్తి అగ్రిగోల్డ్‌ది కాదని ప్లేట్ ఫిరాయిస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది ఆడుతున్న గేమ్‌లో భాగంగానే హాయ్‌ల్యాండ్ విషయంలో కొత్త డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాయ్ ల్యాండ్ ఆస్తి వందశాతం అగ్రిగోల్డ్దే అని పునరుద్ఘాటించారు. హాయ్‌లాండ్ ప్రాపర్టీ అగ్రిగోల్డ్‌కి చెదినది కాదని చెప్పడంతో ఆందోళనకు గురైన కొంతమంది బాధితులు గుండె పోటుకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు వెనక్కు తగ్గబోమనీ, ప్రాణాలైనా వదులుకుంటామని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్షలు చేయబోతున్నామని తెలిపారు. వచ్చే నెల 15 తర్వాత ఆమరణ నిరాహారదీక్ష తేదీలను ప్రకటిస్తామని నాగేశ్వరరావు తెలిపారు. -
హుదూద్ కన్నా తీవ్రమైనది
శ్రీకాకుళం: జిల్లాలోని 18 మండలాల్లో తిత్లీ తుపాను తీవ్ర ప్రభావం చూపిందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి, అగ్రిగోల్డ్ ఏజెంట్ల, బాధితుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. విలేకరులతో ముప్పాళ్ల మాట్లాడుతూ..గతంలో వచ్చిన హుదూద్ తుపాను కన్నా తిత్లీ తుపాను తీవ్రమైన తుపానుగా అభివర్ణించారు. కేంద్ర ప్రభుత్వం తుపాను బాధిత ప్రాంతంపై కన్నెత్తి కూడా చూడకపోవడం చాలా హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. బాధితులకు పూర్తిగా సహాయకచర్యలు చేయకుండానే తెలుగు దేశం ప్రభుత్వం అందరినీ ఆదుకున్నామని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడాన్ని తప్పుబట్టారు. తుపాను బాధితుల ప్రాంతాల్లో ఉపాధి హామీ చేపట్టాలని డిమాండ్ చేశారు. అలాగే రూ.300 వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. జీవచ్చవాలులా ఉన్న తుపాను బాధితులను ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. పదేళ్ల ప్యాకేజీని ప్రభుత్వం వారం రోజుల్లోనే ప్రకటించాలని కోరారు. సత్వరమే తుపాను బాధితులను ఆదుకోవాలని, అవసరమైతే అన్ని సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని తెలిపారు. రాజకీయ పార్టీలకు ఏ విషయంపైన ఐనా దీక్షలు చేసే అధికారం ఉంటుందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. -
అగ్రిగోల్డ్ కేసులో కొత్త మలుపు
హైదరాబాద్: అగ్రిగోల్డ్ కేసు కొత్త మలుపు తిరిగింది. అగ్రిగోల్డ్ కేసు మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చింది.రూ.10 కోట్ల డిపాజిట్‌ను వెనక్కి ఇవ్వాలన్న అభ్యర్థనను జీఎస్ఎల్ గ్రూప్ వెనక్కి తీసుకుంది. కోర్టు సమయాన్ని వృథా చేసిన జీఎస్‌ఎల్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషనర్, న్యాయమూర్తిని కోరారు. పిటిషనర్ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి జీఎస్ఎల్ గ్రూప్‌పై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదే సమయంలో 10 ఆస్తులను ఏపీ సీఐడీ కోర్టుకు సమర్పించింది. సీఐడీ సమర్పించిన 10 ఆస్తుల విలువ ఎంతో చెప్పాలని హైకోర్టు, ప్రభుత్వాన్ని కోరింది. అదేవిధంగా జిల్లాల వారీగా ఆస్తుల విక్రయానికి త్రిసభ్య కమిటీకి హైకోర్టు ఆమోదం తెలిపింది. కార్పస్ ఫండ్‌ను ఏపీ ప్రభుత్వం ఇచ్చేందుకు అంగీకరించింది. అగ్రిగోల్డ్ కేసుపై తదుపరి విచారణ జూన్ 8కి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ కేసుపై సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వర రావు మాట్లాడుతూ..20 వేల ఎకరాల అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని కోరు. రెండు వేల కోట్ల రూపాయల కార్పస్ ఫండ్‌ను ప్రభుత్వం అడ్వాన్స్‌గా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రెండు నెలలల్లో బాధితులకు డబ్బులు చెల్లించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. త్రిసభ్య కమిటీ ద్వారా ఇప్పటివరకూ జమ అయిన నగదును జిల్లాల వారీగా అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లించాలని చెప్పారు. -
‘హాయ్‌లాండ్ లాభాల వివరాలు కోర్టుకు చెప్పాలి’
సాక్షి, గుంటూరు: అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ప్రభుత్వం మూడున్నరేళ్లుగా తాత్సారం చేస్తుందని అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అగ్రిగోల్డ్ ఆస్తులు ఇంకా అవ్వా సోదరులు స్వాధీనం చేసుకోలేదని చెప్పారు. హయ్‌లాండ్ లాభాల వివరాలు కోర్టుకు తెలియచేయాలని కోరారు. రెండు నెలల్లోగా అగ్రిగోల్డ్ బాధితులు డిపాజిట్ చేసిన సొమ్ములు చెల్లించాలని డిమాండ్ చేశారు. చివరి డిపాజిటర్‌కు డబ్బు అందేంతవరకూ పోరాటం కొనసాగిస్తామని ముప్పాళ్ల అన్నారు. గురువారం కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిశామని తెలిపారు. రూ. 20 వేలలోపు డిపాజిట్ చేసిన బాధితుల కోసం రూ. 2 వేల కోట్లు ఇమ్మని సీఎంని అడిగామన్నారు. దీనిపై ప్రభుత్వ, అగ్రిగోల్డ్ అసోసియేషన్ ప్రతినిధులతో కలిసి కమిటీ వేస్తామన్నారని చెప్పారు. -
ఆయన్ను అరెస్ట్ చేసినందుకు అభినందనలు
సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ కంపెనీ డైరెక్టర్ అవ్వా సీతారామ్‌ను అరెస్ట్ చేసినందుకు పోలీసులకు అభినందనలు తెలియ జేస్తున్నట్లు అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ అసోసియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘మూడేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న సీతారాం వెనక ఏదో అదృశ్య శక్తి ఉంది. అదే ఇప్పటిదాకా రక్షిస్తూ వచ్చింది. అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం జరగకుండా సీతారాం ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. అవ్వా సోదరుల కుటుంబ సభ్యుల ఆస్తులను కూడా జప్తు చేయాలి. మే 30వ తేదీన విజయవాడ, గుంటూరు నుంచి ఛలో సచివాలయం పేరిట పాదయాత్ర చేపడుతున్నాం. పాదయాత్రను అడ్డుకుంటే జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. అగ్రిగోల్డ్ బాధితుల్లో లక్షలోపు డిపాజిట్ చేసిన వారికి ముందస్తుగా రూ.20 వేలు చెల్లించేలా చర్యలు తీసుకోవాల’ని డిమాండ్ చేశారు. ‘అగ్రిగోల్డ్ నిందితుడు అవ్వా సీతారామ్‌ను సోమవారం రాత్రి అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నాం. ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు చేయించాం. ప్రస్తుతం అవ్వా సీతారాం ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. అన్ని విధాలా విచారణకు సహకరిస్తున్నారు. కేసుకు సంబంధించి కొన్ని కీలక ఆధారాలు లభించాయి. వాటి ఆధారంగా విచారణం చేస్తున్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేంత సమయం లేదు. కాబట్టి మెట్రోపాలిటన్ కోర్టుకు తీసుకెళ్లి హాజరుపరుస్తాం. కేసు కూడా ఫైనల్ స్టేజ్‌కి వచ్చింది. ట్రాన్సిస్ అరెస్ట్ వారెంట్ కూడా దొరికింద’ని ఏపీ సీఐడీ పోలీసులు ఢిల్లీలో వెల్లడించారు. -
బాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
-
హోదా లేకపోతే పదువులు ఎందుకు?
ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నాగేశ్వరరావు గుంటూరు వెస్ట్ : ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని కోరిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ హోదాను ఇవ్వాలని, లేకుంటే తమ పదవులకు రాజీనామా చేయాలని ప్రత్యేక హోదా సాధన సమితి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు కోరారు. అరండల్‌పేటలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక తరగతి హోదా విషయంలో మోదీని మెప్పించలేని వెంకయ్యనాయుడు కుప్పిగంతులు వేస్తున్నారని విమర్శించారు. మంగళవారం చేపట్టిన బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన మాటలకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సమితి జిల్లా అధ్యక్షుడు పీ.వీ.మల్లికార్జునరావు, నాయకులు తాడికొండ నరసింహారావు, సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ప్రజానాట్య మండలి జాతీయ కార్యదర్శి పులి సాంబశివరావు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వెలుగూరి రాధాకృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
ఏడాదిలో ఏమి సాధించాం?
8న గుంటూరులో సీపీఐ జాతీయ సమితి సమావేశాలు సాక్షి, హైదరాబాద్: పుదుచ్చేరిలో జరిగిన జాతీయ మహాసభలో తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు సీపీఐ జాతీయ సమితి వచ్చేనెల 8న గుంటూరులో భేటీ కానుంది. మూడు రోజులపాటు జరిగే ఈ సమావేశాల్లో పార్టీ నిర్మాణంపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. పార్టీని ప్రణాళికాబద్ధంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టాలని గత మార్చిలో జరిగిన జాతీయ మహాసభల్లో నిర్ణయించారు. తదనుగుణంగా ఏయే రాష్ట్రంలో ఎంతెంత ప్రగతిని సాధించిందీ చర్చించి భవిష్యత్ కార్యాచరణ ఖరారు చేస్తారు. పార్టీ పునాదులు కదిలిపోయి జాతీయ హోదాను కోల్పోయిన నేపథ్యంలో గ్రామస్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పూర్తిగా సంస్కరించాలని నాయకత్వం నడుంకట్టింది. అయినప్పటికీ ఏమాత్రం పురోగతి కనిపించకపోగా నానాటికీ తీసికట్టు.. అన్నట్టుగానే మిగిలింది. ఈ తరుణంలో జరుగుతున్న ఈ సమావేశాలకు ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ ప్రధాన కార్యదర్శి సుధాకర్‌రెడ్డి మొదలు జాతీయ నాయకత్వమంతా 7వ తేదీకే గుంటూరు చేరుకుంటుంది. సమావేశాల ఎజెండాను ఖరారు చేసేందుకు కేంద్ర కార్యదర్శివర్గం అదే రోజు సాయంత్రం భేటీ అవుతుంది. 8న ఉదయం కేంద్ర కార్యవర్గం సమావేశం అనంతరం ర్యాలీ, గుంటూరు లాడ్జి సెంటర్లోని మహిమా గార్డెన్స్‌లో బహిరంగ సభ ఉంటుంది. తర్వాత జాతీయ సమితి భేటీ అయి మర్నాడు సాయంత్రం వరకు కొనసాగుతుందని పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు వివరించారు.