సాక్షి, విజయవాడ: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగడం లేదనీ, ఈ నెల 21 హాయ్‌లాండ్‌ను ముట్టడిస్తామని అగ్రిగోల్డ్ కస్టమర్స్, ఏజెంట్స్ వెల్ఫేర్ అసోషియేషన్ గౌరవాధ్యక్షులు ముప్పాళ్ల నాగేశ్వరరావు వెల్లడించారు. అక్టోబర్ 31 నాటికి అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు చేయకపోతే ఆందోళన చేస్తామని గతంలోనే హెచ్చరించామని అన్నారు. హాయ్ ల్యాండ్ ముమ్మాటికీ అగ్రిగోల్డ్ యాజమాన్యానికి చెందినదేనని అన్నారు. హాయ్‌లాండ్ అగ్రిగోల్డ్ ప్రాపర్టీ కాదని తీర్పు చెప్పి హైకోర్టు ఈ చిత్రమైన పరిస్థితి కారణమైందని వాపోయారు. హైకోర్టుని తప్పుదోవ పట్టించేందుకు అగ్రిగోల్డ్ కేసులో బెయిల్ మీద బయటకొచ్చిన కొంతమంది ప్రయత్నిస్తున్నారనీ, వారి బెయిల్ రద్దు చేయాలని కోరారు.
హాయ్‌ల్యాండ్ ప్రాపర్టీ వివరాలను కోర్టు సమక్షంలో అగ్రిగోల్డ్ యజమాన్యం చెప్పిందని గుర్తు చేశారు. మళ్లీ ఇప్పుడు ఆ ఆస్తి అగ్రిగోల్డ్‌ది కాదని ప్లేట్ ఫిరాయిస్తున్నారని మండిపడ్డారు. కొంతమంది ఆడుతున్న గేమ్‌లో భాగంగానే హాయ్‌ల్యాండ్ విషయంలో కొత్త డ్రామా ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హాయ్ ల్యాండ్ ఆస్తి వందశాతం అగ్రిగోల్డ్‌దే అని పునరుద్ఘాటించారు. హాయ్‌లాండ్ ప్రాపర్టీ అగ్రిగోల్డ్‌కి చెదినది కాదని చెప్పడంతో ఆందోళనకు గురైన కొంతమంది బాధితులు గుండె పోటుకు గురయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరిగే వరకు వెనక్కు తగ్గబోమనీ, ప్రాణాలైనా వదులుకుంటామని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారం కోసం ఆమరణ నిరాహార దీక్షలు చేయబోతున్నామని తెలిపారు. వచ్చే నెల 15 తర్వాత ఆమరణ నిరాహారదీక్ష తేదీలను ప్రకటిస్తామని నాగేశ్వరరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment