అగ్రిగోల్డ్‌కో దండం! | Subhash Chandra Foundation requested to the High Court about Agri Gold | Sakshi
Sakshi News home page

అగ్రిగోల్డ్‌కో దండం!

Published Wed, Sep 19 2018 3:58 AM | Last Updated on Wed, Sep 19 2018 4:45 AM

Subhash Chandra Foundation requested to the High Court about Agri Gold - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అగ్రిగోల్ట్‌ కేసులో తాజాగా మరో మలుపు చోటుచేసుకుంది. ఆ సంస్థ ఆస్తుల టేకోవర్‌ విషయంలో ఇప్పటికే హైకోర్టులో పలుమార్లు దాగుడుమూతలు ఆడిన సుభాష్‌చంద్ర ఫౌండేషన్‌ తాజాగా మళ్లీ అదే పంథాను అనుసరించింది. అగ్రిగోల్డ్‌ ఆస్తుల టేకోవర్‌ ప్రతిపాదన నుంచి తాము వెనక్కి వెళ్లిపోతున్నామని హైకోర్టుకు లిఖితపూర్వంగా నివేదించింది. ఈ విషయాన్ని ఇక ఇంతటితో వదిలేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. తాము ఇలా వెనక్కి వెళ్లిపోవడానికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలతోపాటు అగ్రిగోల్డ్‌ యాజమాన్యం, బ్యాంకులు కూడా కారణమని వివరించింది. సంస్థ ఆస్తి, అప్పుల మదింపు కోసం తాము డిపాజిట్‌ చేసిన రూ.10 కోట్లను విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతినివ్వాలని హైకోర్టును అభ్యర్థించింది. ఈ మేరకు ఫౌండేషన్‌ అధీకృత ప్రతినిధి పియూష్‌ రజ్‌గరియా ఓ అనుబంధ పిటిషన్‌ దాఖలు చేశారు. 

గతంలోనూ ఇలాగే వెనక్కి..
అగ్రిగోల్డ్‌ యాజమాన్యం తమ నుంచి భారీ మొత్తంలో డిపాజిట్లు సేకరించి తిరిగి చెల్లించకుండా చేతులెత్తేసిందని, దీనిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ పలువురు డిపాజిటర్లు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలు చేశారు. వీటిపై న్యాయమూర్తి జస్టిస్‌ వి.రామసుబ్రమణియన్‌ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. అగ్రిగోల్డ్‌ ఆస్తుల టేకోవర్‌ విషయంలో జీ గ్రూప్‌నకు చెందిన సుభాష్‌చంద్ర ఫౌండేషన్‌ స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. అగ్రిగోల్డ్‌ ఆస్తి, అప్పుల మదింపు కూడా చేపట్టింది. అయితే, అకస్మాత్తుగా తాము టేకోవర్‌ ప్రతిపాదన నుంచి వెనక్కి వెళ్లిపోతున్నామని హైకోర్టుకు చెప్పింది. దీనిపై హైకోర్టు నిర్ణయం తీసుకునేలోపే, లేదు లేదు తాము టేకోవర్‌ రేసులో ఉన్నామని చెప్పింది.

ఇలా ఇప్పటికే రెండుసార్లు దాగుడుమూతలు ఆడింది. ఇటీవల అగ్రిగోల్డ్‌ ఆస్తులన్నింటినీ రూ.4 వేల కోట్లకు తీసుకుంటామంటూ ఫౌండేషన్‌ హైకోర్టు ముందు ఓ ప్రతిపాదన ఉంచింది. దీనిపై స్పందించిన ఏపీ ప్రభుత్వం, వచ్చే నాలుగేళ్లలో అగ్రిగోల్డ్‌ ఆస్తులు రూ.4 వేల కోట్లకు పెరుగుతాయన్న అంచనాతో సుభాష్‌చంద్ర ఫౌండేషన్‌ లెక్కలు వేస్తోందని, ఈ లెక్కలను తాము ఇప్పుడు ఆమోదిస్తే, భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయని.. అందుకు తాము సిద్ధంగాలేమని తెలిపింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ధర్మాసనం ఫౌండేషన్‌ ప్రతిస్పందనను కోరింది. దీంతో ఫౌండేషన్‌ తన నిర్ణయాన్ని ఓ అఫిడవిట్‌ రూపంలో ధర్మాసనం ముందు ఉంచింది.

ఏ ఒక్కరూ సహకరించడంలేదు..
‘అగ్రిగోల్డ్‌ ఆస్తుల టేకోవర్‌కు శక్తివంచన లేకుండా అన్ని ప్రయత్నాలు చేశాం. అయితే, కొన్ని కారణాలవల్ల వెనక్కి వెళ్లిపోతున్నాం. రూ.4వేల కోట్లకు ఆస్తులను టేకోవర్‌ చేస్తామన్న మా ప్రతిపాదనను అటు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం, ఇటు అగ్రిగోల్డ్‌ యాజమాన్యం నిర్ద్వందంగా తోసిపుచ్చాయి. తెలంగాణ ప్రభుత్వం నుంచి కూడా సహకారం అందడంలేదు. అంతేకాక.. అగ్రి యాజమాన్యం నుంచి పూర్తి సహకారం లేకుండా ఆస్తుల టేకోవర్‌ సాధ్యం కానేకాదు. ఆస్తులకు సంబంధించి వారి లెక్కలకు, మా లెక్కలకు చాలా వ్యత్యాసం ఉంది.

వారి లెక్క ప్రకారం అగ్రిగోల్డ్‌ ఆస్తుల విలువ రూ.25వేల కోట్లు ఉంటే మా లెక్కల ప్రకారం గరిష్టంగా రూ.2,200కోట్లు ఉంటుంది. బ్యాంకులు కూడా తమకు రావాల్సిన బకాయిలు ఇస్తే మా ప్రతిపాదనకు అంగీకరిస్తామని చెప్పాయి. ఎంత చెల్లించాలో మాత్రం స్పష్టంగా చెప్పడంలేదు. అగ్రిగోల్డ్‌ చెల్లించాల్సిన పన్నుల విషయంలోనూ చాలా అస్పష్టత ఉంది. ఈ అనిశ్చితి వైఖరి మాకు ఇబ్బందికరం. ఈ కారణాలన్నింటి వల్ల మేం వెనక్కి వెళ్లిపోతున్నాం’.. అని సుభాష్‌ చంద్ర ఫౌండేషన్‌ కోర్టుకు నివేదించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement